సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు మంచి రోజులు వచ్చాయి. వచ్చే నెల 1నే వారికి జీతాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ప్రతి నెలా ఒకటినే వారికి జీతాలు ఇవ్వనుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల డేటా సక్రమంగా ఉందా, లేదా అనే విషయాన్ని పరిశీలించాల్సిందిగా ట్రెజరీ అధికారులను శనివారం ప్రభుత్వం ఆదేశించింది.
► ఇచ్చిన మాట మేరకు సీఎం వైఎస్ జగన్ ఈ నెల 3న ప్రత్యేకంగా ఔట్‌సోర్సింగ్ కార్పొరేషన్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే.
► ఈ నెల 3 నాటికి 50 వేలకు పైగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు కార్పొరేషన్ పరిధిలోకి వచ్చారు.
► కార్పొరేషన్ పరిధిలోని ఉద్యోగులకు వచ్చే నెల 1 నుంచి సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ ద్వారా వేతనాలను చెల్లించనున్నారు. సచివాలయ శాఖలు, శాఖాధిపతుల కార్యాలయాలకు సంబంధించి కార్పొరేషన్ సమర్పించిన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల డేటాను పే అండ్ అకౌంట్ ఆఫీసర్లు పరిశీలించాల్సిందిగా ట్రెజరీ, అకౌంట్స్ డైరెక్టర్ ఆదేశించారు.
► జిల్లా కార్యాలయాలు, కార్పొరేషన్లు, సొసైటీలు, యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూషన్స్‌కు చెందిన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల డేటాను జిల్లా ట్రెజరీ అధికారులు పరిశీలించాల్సిందిగా ఆదేశాలిచ్చారు.
► ఆయా పోస్టులకు విద్యార్హతలతోపాటు కుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించాలన్నారు. ఆర్థిక శాఖ అనుమతితోనే ఉద్యోగులను తీసుకున్నారా, లేదా, మంజూరైన పోస్టుల్లో ఉద్యోగులు పనిచేస్తున్నారా, లేదా చూడాలని సూచించారు.
► డేటాను పూర్తిగా పరిశీలించి జిల్లా ట్రెజరీల డిప్యూటీ డైరెక్టర్లు నివేదికను వచ్చే నెల 9లోగా ఆన్‌లైన్‌లో పంపించాలన్నారు.
ఇక నియామకాలు కార్పొరేషన్ ద్వారానే..
► ఇక ప్రభుత్వ రంగంలో ఏ శాఖ లేదా సంస్థకైనా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు అవసరమైతే ఈ కార్పొరేషన్ ద్వారానే తీసుకోనున్నారు. దీని వల్ల ఏజెన్సీలు, దళారీ వ్యవస్థకు ఆస్కారం ఉండదు.
► గతంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు కావాలంటే అభ్యర్థులు లంచాలు ఇవ్వాల్సి వచ్చేది. అలాగే జీతాలకు ఆ ఏజెన్సీలకు ప్రభుత్వం నగదు ఇచ్చేది. ఏజెన్సీలు ఉద్యోగులకు జీతం పూర్తిగా ఇవ్వకుండా మిగుల్చుకునేవి.
► ఇప్పుడు ఉద్యోగాలకు, జీతాలకు పైసా లంచం లేకుండా పూర్తి పారదర్శకంగా కార్పొరేషన్ నిర్వహించనుంది.
► వివక్షకు తావులేకుండా 50 శాతం ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇవ్వడంతోపాటు, వాటన్నింటిలో 50 శాతం మహిళలకు ఇవ్వనున్నారు.
► అలాగే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల ఈఎస్‌ఐ, ఈపీఎఫ్‌ను కార్పొరేషన్ సక్రమంగా నిర్వహించనుంది.
Comments
Please login to add a commentAdd a comment