ప్రతి నెల జీతం ఇస్తేనే బతుకు భారంగా సాగిపోతున్న రోజులివి. అలాంటిది పదిహేను నెలలుగా జీతాలివ్వకపోతే వారెలా బతకాలి?.. కనీస మానవత్వం లేని ప్రభుత్వ వైఖరిని ఏమనాలి? ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కన్నీటి గాధ ఇది.
విజయనగరం ఫోర్ట్: కేంద్రాస్పత్రి, ఘోషాస్పత్రుల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టుడుతున్నారు. పదిహేను నెలలుగా జీతాల్లేక ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నారు. జీతాలు అడిగితే ‘మీకు కొనసాగింపు ఉత్తర్వులు రాలేదు కదా.. ఉద్యోగం మానేయండని’ అధికారులు చెబుతున్నారు. ఎప్పటికైనా ప్రభుత్వం కరుణించకపోతుందా.. జీతాలు ఇవ్వకపోతారా? అని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎదురుచూడటం తప్ప చంద్రబాబు ప్రభుత్వం కరుణించని పాపాన పోలేదు.
కేంద్రాస్పత్రి, ఘోషాస్పత్రుల్లో వివిధ స్థాయిల్లో 18 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో ఎలక్ట్రీషియన్లు ముగ్గురు, ఈసీజీ టెక్నీషియన్లు ఇద్దరు, వార్డుబాయ్‌లు 13 మంది ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నారు. వీరికి 2014 సంవత్సరం నవంబర్ నెల నుంచి జీతాలు చెల్లించలేదు. కొనసాగింపు ఉత్తర్వులు కూడా లేకపోవడంతో వీరి పరిస్థితి అగమ్య గోచరమైంది.
కొనసాగింపు ఉత్తర్వులు ఇప్పించి, జీతాలు మంజూరు చేయాలని వీరంతా అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు వినతులిచ్చినా మొర వినేవారే కరువయ్యారు. ఇదే విషయాన్ని డీసీహెచ్‌ఎస్ కె.సీతారామరాజు వద్ద ప్రస్తావించగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు చెల్లించకపోవడం వాస్తవమేనన్నారు. వారికి కొనసాగింపు ఉత్తర్వులు కమిషనర్ కార్యాలయం నుంచి రాకపోవడం వల్ల చెల్లించలేదన్నారు.
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల ఆకలి కేకలు
Published Thu, Feb 25 2016 12:49 AM | Last Updated on Sun, Sep 3 2017 6:20 PM
Advertisement
Advertisement