ఒకటో తేదీనే జీతం | AP Government Released Outsourcing Employees Salaries Anantapur | Sakshi
Sakshi News home page

ఒకటో తేదీనే జీతం

Published Sat, Sep 21 2019 9:35 AM | Last Updated on Sat, Sep 21 2019 9:35 AM

AP Government Released Outsourcing Employees Salaries Anantapur - Sakshi

కాంట్రాక్ట్‌.. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల వేతన వెతలు తీర్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. బడ్జెట్‌తో సంబంధం లేకుండా శాశ్వత ఉద్యోగుల మాదిరి ఒకటో తేదీనే జీతం ఇచ్చేందుకు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఇన్నాళ్లూ మూడు, నాలుగు నెలలకోసారి జీతం తీసుకునే చిరుద్యోగులు ఇకనుంచి ఒకటో తేదీనే వేతనం అందుకోనున్నారు. 

సాక్షి, అనంతపురం: ప్రభుత్వ కార్యాలయాల్లో ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో పని చేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వారి వేతన వెతలు తీరుస్తూ నిర్ణయం తీసుకుంది. జిల్లాలో దాదాపు 21,250 మంది కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు పనిచేస్తుండగా.. ఏ ఒక్క శాఖలోనూ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు సక్రమంగా జీతాలు తీసుకోలేదు. రెండు నెలలు మొదలుకొని ఆరేడు నెలలకు కూడా జీతాలు మంజూరు కాని పరిస్థితి ఉండేది. దీంతో తక్కువ వేతనంతో పని చేసే కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. వారి బాధలు అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా ప్రతినెలా ఒకటో తేదీనే కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాలు చెల్లించేలా ఆదేశాలు జారీ చేశారు.  

గతంలో బడ్జెట్‌ ఉంటేనే జీతం 
గతంలో వివిధ శాఖల్లో పనిచేసే కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు జీతాలు చెల్లించాలంటే ప్రత్యేక బడ్జెట్‌ రావాల్సి ఉండేది. బడ్జెట్‌ వచ్చినప్పుడే వారికి జీతాలు చెల్లించేవారు. దీంతో ఒక్కోసారి ఆరు నెలలైనా జీతం అందక చిరుద్యోగులు అల్లాడిపోయేవారు. కుటుంబ పోషణకు అప్పులు చేసి వాటిని తీర్చేందుకు నానా తిప్పలు పడేవారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న తాజా నిర్ణయంతో ఇకపై ఆ పరిస్థితి ఉండదు. బడ్జెట్‌తో నిమిత్తం లేకుండా జీతాలు చెల్లించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రకారమైతే ఒకటో తేదీ రాగానే జీతాలు చెల్లిస్తారు.  

బీసీ హాస్టళ్ల కార్మికులకు ఆరునెలల జీతాలు జమ 
బీసీ సంక్షేమ వసతి గృహాల్లో పని చేస్తున్న నాల్గో తరగతి (కుక్, కమాటి, వాచ్‌మన్‌) ఉద్యోగులు ఆరునెలల జీతాల కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 128 మంది నాల్గో తరగతి ఉద్యోగులుగా పని పనిచేస్తుండగా.. మార్చి వరకు మాత్రమే జీతాలు పడ్డాయి. బడ్జెట్‌ లేక ఏప్రిల్‌ నుంచి బకాయిలు పేరుకుపోయాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో రెండు రోజుల కిందట ఆరునెలల జీతాల సొమ్మును చెల్లించారు. దాదాపు రూ. 96 లక్షల మేర ఉద్యోగుల ఖాతాల్లో జమ చేశారు.

చదవండి : కారుణ్య నియామకాలకు గ్రీన్‌ సిగ్నల్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement