కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలపై పోరాటం
ఏపీఎస్‌జీవోఈఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు
విజయవాడ : వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తామని ఏపీ గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (ఏపీఎస్‌జీవోఈఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు ఏవీ నాగేశ్వరరావు హెచ్చరించారు. స్థానిక రాఘవయ్య పార్కు సమీపంలోని యూటీఎఫ్ హాలులో జిల్లా కాంట్రాక్టు ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆదివారం నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, పీఆర్సీ ఇవ్వాలని కోరుతూ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఈనెల 29న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల వద్ద ధర్నా చేస్తున్నామని పేర్కొన్నారు. ఆగస్టు వరకు దశల వారీగా ఆందోళనలు కొనసాగిస్తామన్నారు. ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నియమించిన కమిటీ జిల్లాలో కేవలం 442 మంది కార్మికులే ఉన్నారని పేర్కొందని తెలిపారు. అన్ని శాఖల్లో కాంట్రాక్టు కార్మికులను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇ.విజయ్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలో అన్ని ప్రభుత్వ శాఖల్లో 15వేల మంది కాంట్రాక్టు సిబ్బంది ఉన్నారని తెలిపారు. రాజకీయ కారణాలతో కొన్ని శాఖల్లో కార్మికులను తొలగిస్తున్నారని ఆరోపించారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో సిబ్బందిని ఫెడరేషన్‌గా ఏర్పాటు చేసి, వారికి న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. ఈ సదస్సులో ఫెడరేషన్ నాయకులు నాంచారయ్య, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.