ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్వాసన
ఉపాధి ఎఫ్‌ఏల తొలగింపునకూ నిర్ణయం
వీధిన పడతామంటున్న ఉద్యోగులు
సాక్షి, రాజమండ్రి: జాబు కావాలంటే బాబు రావాలంటూ ఎన్నికల్లో ప్రచారం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మాటలపై చాలీచాలని జీతాలతో, కనీస ఉద్యోగ భద్రత కూడా లేని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆశ పెంచుకున్నారు. ఆయన అధికారంలోకి వస్తే తమ వంటి చిరుద్యోగుల భవిష్యత్తు వెలిగిపోతుందనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. గృహ నిర్మాణ సంస్థలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మరోవైపు ఉపాధి హామీ పథకం ఫీల్డు అసిస్టెంట్లను తొలగించాలని కూడా నిర్ణయించింది. జలయజ్ఞం భూసేకరణ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగించే జీవో నేడో రేపో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గృహ నిర్మాణశాఖలో..
గృహ నిర్మాణశాఖలో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 2,600 మంది ఉద్యోగులున్నారు. వీరు 2006 నుంచి పనిచేస్తున్నారు. ఎప్పటికైనా ఉద్యోగం పర్మినెంట్ అవుతుందనే ఆశతో రూ.15 వేల లోపు జీతాలు తీసుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వీరిలో సుమారు 60 శాతం మందికి ప్రభుత్వోద్యోగాలకు వయోపరిమితి కూడా దాటిపోయింది. ఈ తరుణంలో ఉద్యోగాల నుంచి తొలగించటంతో వారికి దిక్కుతోచడంలేదు.
ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ల పరిస్థితి ఇదీ
ఉపాధి హామీ పథకంలో 13 జిల్లాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న సుమారు తొమ్మిదివేల మందిని తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎనిమిదేళ్లుగా ఉద్యోగాలను నమ్ముకున్న తమకు న్యాయం చేయాలని కోరుతున్నా ప్రభుత్వం కనికరించకపోవడంపై ఉద్యమించేందుకు ఫీల్డ్ అసిస్టెంట్లు సిద్ధమవుతున్నారు.
జలయజ్ఞం ఉద్యోగులకు చెల్లుచీటీ
జలయజ్ఞం భూసేకరణ కార్యాలయాల్లో పనిచేసే సుమారు 700 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తూ గతనెల 17నే నిర్ణయం తీసుకున్నారు. ఈనెల రెండో తేదీ నుంచి వారిని తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు కూడా జారీచేశారు. కానీ ఉద్యోగులు ఆందోళన చేయడంతో గవర్నర్ పాలనలోని అధికారులు ఉత్తర్వులను నెలపాటు నిలిపేశారు. ఈ ఉత్తర్వులను మళ్లీ అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోందని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు.
రాజకీయ కోణమా..
ఆయా శాఖల్లో వర్క్ ఇన్‌స్పెక్టర్లు, జూనియర్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఐటీ మేనేజర్లు, అకౌంటెంట్లు, అటెండర్లు, వాచ్‌మెన్‌లుగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరంతా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నియమితులైన వారే కావడంతో కేవలం రాజకీయ కారణాలతోనే ఉద్యోగుల పొట్ట కొట్టేందుకు టీడీపీ ప్రభుత్వం నడుం కట్టిందన్న విమర్శలు వస్తున్నాయి.
వీధిన పడతాం..
సుమారు ఎనిమిదేళ్లుగా క్రమశిక్షణతో పనిచేస్తున్నాం. పిల్లల చదువులు, పెళ్లిళ్లు.. ఈ ఉద్యోగంపై ఆధారపడే చేయాలి. మా తొలగింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకుని మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. లేకపోతే మా కుటుంబాలు వీధిన పడతాయి.
- పి.పోతురాజు, గృహ నిర్మాణసంస్థ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం ప్రతినిధి, రాజమండ్రి