బాబు వచ్చారు.. జాబు తీశారు
రాయవరం : ‘జాబు కావాలంటే.. బాబు రావా’ లంటూ తెలుగుదేశం ఎన్నికలకు ముందు ఊదరగొట్టింది. తీరా బాబు వచ్చాక ఉన్న ఉద్యోగాలనే ఊడగొడుతున్నారు. హౌసింగ్ శాఖలో సంవత్సరాల తరబడి పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను ఇంటికి పంపిస్తూ ఆ శాఖ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం నుంచి విధులకు హాజరు కావద్దని వచ్చిన ఆదేశాలతో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు హతాశులయ్యారు. హౌసింగ్‌శాఖ ద్వారా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికి పక్కా ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేశారు.
ఆ సమయంలో 2006-07 సంవత్సరాల్లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను తీసుకున్నారు. వర్క్ ఇన్‌స్పెక్టర్లతో పాటు డేటా ఎంట్రీ ఆపరేటర్లు, అకౌంటెంట్ అసిస్టెంట్లు, హౌసింగ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉద్యోగులను కాంట్రాక్టు పద్ధతిపై తీసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఎంకేఎంటర్‌ప్రైజెస్ ఏజెన్సీ ద్వారా వీరి నియామకం జరిగింది. అప్పటి నుంచి వీరు విధులు నిర్వర్తిస్తున్నారు. పేదలకు ఇళ్ల నిర్మాణం చేయించడం, ఎప్పటికప్పుడు ఇళ్ల నిర్మాణ ప్రగతిని ఉన్నతాధికారులకు తెలపడంతో ఆ శాఖలో కీలకంగా మారారు. జిల్లాలో సుమారు 218 మంది ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని సోమవారం నుంచి తొలగించారు. వీరిలో 150 మంది వరకు వర్క్ ఇన్‌స్పెక్టర్లు ఉన్నట్టు సమాచారం.
పనులెలా నడుస్తాయి..
రాయవరం హౌసింగ్ శాఖలో ఒక ఏఈ, ఇద్దరు వర్క్ ఇన్స్‌పెక్టర్లు ఉన్నారు. మండలంలో ఇందిర మ్మ ఇళ్ల ప్రగతిని వీరు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తు తం తొలగించిన వారిలో ఇద్దరు వర్క్ ఇన్‌స్పెక్టర్లు ఉండడంతో ఏఈ ఒక్కరే మిగిలారు. డీఈఈ కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్, అకౌం టెంట్ అసిస్టెంట్ పోస్టులను తొలగించడంతో డీఈఈ ఒక్కరే మిగిలారు. మంగళవారం నుంచి తొలగించిన సిబ్బందిని విధులకు హాజరు కావద్దంటూ తెలుపుతూ వారి వద్ద ఉన్న రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. దీంతో మంగళవారం నుంచి విధులు ఎలా నిర్వర్తించాలా అని రెగ్యులర్ ఉద్యోగులు మథనపడుతున్నారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వద్ద కీలక సమాచారం ఉండడంతో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆ శాఖ ఏఈలు పేర్కొంటున్నారు. రెగ్యులర్ సిబ్బందిని ఇవ్వకుండా వీరిని తొలగిస్తే పనులు ఎలా జరుగుతాయంటున్నారు.
ఉరుములేని పిడుగులా..
ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని తొలగించడం లేదం టూ రాష్ట్ర మంత్రి చేసిన ప్రకటనతో అందరితో పాటు హౌసింగ్ ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. ఔట్‌సోర్సింగ్ సిబ్బంది కొనసాగింపునకు ఇచ్చిన ఉత్తర్వుల్లో హౌసింగ్ శాఖను చేర్చక పోవడంతో ఆ శాఖ ఉన్నతాధికారులు వారి తొలగింపు ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. సోమవారం ఉదయం ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి ఈ వార్త ఉరుములేని పిడుగులా చేరింది. హౌసింగ్‌లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తున్నట్టు జూన్ 28 సాయంత్రానికి రెగ్యులర్ ఉద్యోగుల సెల్‌ఫోన్లకు ఉన్నతాధికారులు మెసేజ్ పంపించారు. చంద్రబాబు వస్తే ఇంటికో జాబు మాట ఎలా ఉన్నా ఉన్న జాబులు తొలగించడంతో రోడ్డున పడుతున్నామని హౌసింగ్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు లబోదిబోమంటున్నారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసు గత నెల 30తో ముగిసిందని హౌసింగ్‌శాఖ ఇన్‌చార్జ్ జిల్లా మేనేజర్ విజయ్‌కుమార్ చెప్పారు. జూలై ఒకటి నుంచి వారిని విధుల్లోకి తీసుకోవద్దంటూ ఆదేశాలు వచ్చాయన్నారు.