సాక్షి, హైదరాబాద్: ఔట్ సోర్సింగ్ సిబ్బంది తమ ఉద్యోగులే కాదంటోంది విద్యుత్ సంస్థ. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది ఔట్‌సోర్సింగ్ విద్యుత్ ఉద్యోగుల తొలగింపుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇది తెలుసుకున్న ఆ ఉద్యోగులు హైదరాబాద్‌లోని విద్యుత్ సౌధాలో మంగళవారం ఆందోళన చేశారు. ఏపీ జెన్‌కోలో పనిచేస్తున్న 15 మంది తెలంగాణ ప్రాంతానికి చెందిన వారిని తొలగిస్తూ హెచ్‌ఆర్ అధికారులు ఆదేశాలు సిద్ధం చేశారు. ఇది లీకవడంతో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు హెచ్‌ఆర్ డెరైక్టర్ ఎ.వెంకటేశ్వరరావును ఆయన చాంబర్‌లోనే నిలదీశారు. తొలగింపు ఆదేశాలు సిద్ధమైనప్పటికీ జెన్‌కో ఎండీ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, కంగారు పడవద్దంటూ ఆయన ఆ ఉద్యోగులకు నచ్చజెప్పారు.
ఈ 15 మందిని తెలంగాణ జెన్‌కోకు పంపించే ప్రయత్నం చేస్తామని ఆయన భరోసా ఇవ్వడంతో ఉద్యోగులు కొంత శాంతించారు. కానీ లిఖితపూర్వక హామీ ఇవ్వకపోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే, గత కొద్ది రోజులుగా జిల్లాల వారీగా ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కమ్‌ల్లో ఉన్న ఔట్‌సోర్సింగ్ సిబ్బంది జాబితాలను సిద్ధం చేసినట్టు తెలిసింది. వీళ్లను రాజకీయ కోణంలో విభజన చేస్తున్నారని తెలిసింది. టీడీపీ హయాంలో తీసుకోని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను తీసివేయాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలున్నట్టు తెలియవచ్చింది. ఈ క్రమంలో దాదాపు 9 వేల మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను తీసివేసే యోచనలో విద్యుత్ సంస్థలున్నట్టు తెలిసింది.