Power employees
-
కరెంటు మీటరులో ఏదైనా సమస్య ఉందా.. బహుశా మీక్కూడా ఇలా జరుగుతుందేమో..!?
సాక్షి, కరీంనగర్: విద్యుత్‌శాఖలో మీటర్ల దందా నడుస్తోంది. వినియోగదారులకు తెలియకుండానే మీటర్లను ఇతర ప్రాంతాలకు మార్చుతూ కనెక్షన్ ఇస్తూ లైన్మెన్లు మాయాజాలానికి పాల్పడుతున్నారు. ఇది తెలిసిన ఉన్నతాధికారులు మామూలుగా తీసుకుంటూ మెమోలతో సరిపెడుతున్నారు. ఇటీవల టీఎస్ఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఆఫీసు పరిధిలోని చిగురుమామిడి సెక్షన్‌న్‌లో చోటు చేసుకున్న ఓ సంఘటన కరీంనగర్ రూరల్ డీఈకి వినియోగదారుడు ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిగురుమామిడి నివాసి అయిన సీహెచ్.రమేశ్‌కు చెందిన సర్వీసు నంబరు 3560ను అతని అనుమతి లేకుండానే అదే గ్రామంలో వేరొకచోట అమర్చారు. పంక్చర్ దుకాణానికి చెందిన కేటగిరి–2 మీటర్‌ను వేరే దుకాణంలో వినియోగదారుడి ప్రమేయం లేకుండా అమర్చడం వివాదాస్పదంగా మారింది. ఇది గమనించిన వినియోగదారుడు తన మీటర్‌ను ఇతరులకు ఎలా అమర్చారని లైన్మెన్పై కరీంనగర్ రూరల్ డీఈకు ఫిర్యాదు చేశాడు. స్పందించిన డీఈ సదరు లైన్మెన్కు మెమోజారీ చేశారు. లైన్మెన్ సదరు వినియోగదారుడి మీటర్‌ను యధాస్థానంలో అమర్చేందుకు అంగీకరించాడు. ఇందుకుగాను అధికారులకు ఇచ్చిన ఫిర్యాదును వాపసు తీసుకోవాలంటూ వినియోగదారుడి నుంచి సంతకం తీసుకుని, మీటర్‌ను మార్చకుండా రేపు..మాపు అంటూ జాప్యం చేస్తున్నట్లు తెలిసింది. అంతేకాకుండా ఈ సర్వీసుపై బిల్లు బకాయి ఉందని, కేసు చేయిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఇలాంటి మీటర్ల దందా సర్కిల్ పరిధిలో అనేక చోట్ల కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న అపవాదును మూటగట్టుకుంటున్నారు. కరీంనగర్లో సైతం విద్యుత్ మీటర్లు ఒకచోట..ఇంటి నంబర్లు మరోచోట ఉన్నట్లు సమాచారం. కొంతమంది లైన్మెన్లు చేస్తున్న తప్పిదాలతో విద్యుత్ శాఖలోని సిబ్బందికి అపవాదు వస్తోందని మరికొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెమో జారీ చేశాం.. చిగురుమామిడికి చెందిన రమేశ్ బిల్లు కట్టకపోవడంతో లైన్మెన్ విద్యుత్ సరఫరా నిలిపివేశాడు. అయితే ఈ సర్వీసును ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి షిఫ్ట్ చేశాడని వినియోగదారుడు కరీంనగర్ రూరల్ డీఈకి ఫిర్యాదు చేశాడు. క్షేత్రస్థాయిలో పరిశీలించగా సర్వీసు వేరే ప్రాంతానికి షిఫ్ట్ చేసినట్లు తేలింది. వినియోగదారుడి అనుమతి లేకుండా లైన్మెన్ సర్వీసును షిఫ్ట్ చేయడం తప్పుగా భావించి ఉన్నతాధికారుల సూచన మేరకు లైన్మెన్కు మెమో జారీ చేసి విచారణ చేపడుతున్నాం. అయినప్పటికీ లైన్మెన్, వినియోగదారుడు ఒక ఒప్పందానికి వచ్చినట్లు తెలిసింది. – ప్రకాశ్, ఏఈ, చిగురుమామిడి -
విద్యుత్ సర్వీస్ తొలగించారని.. ఆగ్రహంతో లైన్ ఇన్స్పెక్టర్పై..
ఖమ్మం: ఇంటి విద్యుత్ కనెక్షన్ తొలగించడంతో ఉద్యోగులపై దాడి చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. రఘునాథపాలెం పోలీసులు వెల్లడించిన వివరాలు... పది రోజులు క్రితం మండలంలోని హర్యాతండాలో విద్యుత్ బిల్లులు చెల్లించని వారి సర్వీసులే అక్రమంగా విద్యుత్ వాడుకుంటున్న వారి సర్వీసులను ఉద్యోగులు తొలగించారు. దీంతో తండాకు చెందిన బి.రాము, వి.శివలాల్ సోమవారం మంచుకొండ సబ్ స్టేషన్ వద్ద సెక్షన్ కార్యాలయానికి వచ్చిన వారు తమ ఇళ్లలో కరెంట్ లేకుండా చేశారంటూ మంచుకొండ లైన్ ఇన్స్పెక్టర్ బాబురావుపై దాడి చేశారు. అడ్డొచ్చిన సబ్ ఇంజనీరు యాకూబ్, జేఎల్ఎం దేవీలాల్‌పై సైతం దాడి చేయడమే కాక కార్యాలయంలోని కంప్యూటర్, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. కాగా, ఏడీ సంజయ్‌కుమార్ తదితరులు పరిశీలించి ఎస్ఈ సురేందర్, డీఈ రామారావు దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. -
తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు 7 శాతం ఫిట్మెంట్
-
వరదల్లోనూ.. వెలుగుల కోసం.!
సాక్షి, అమరావతి: కరెంటు తీగ నీటిలో పడిందంటే..అటువైపు వెళితే షాక్ కొడుతుందని భయడుతుంటాం..అలాంటిది కిలోమీటర్ల కొలదీ హై టెన్షన్, లో టెన్షన్ అనే తేడా లేకుండా విద్యుత్ తీగలు తెగిపోయి వరదనీటిలో వేలాడుతుంటే..వాటిని సరిచేయడానికి చేసే ప్రయత్నం ఎంత ప్రమాదకరమో అర్ధం చేసుకోవచ్చు. అలాంటి పరిస్థితిలో పడవలపై వెళ్లి లైన్లను సరిచేసేందుకు వందలాది మంది విద్యుత్ శాఖ సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తున్నారు. గోదావరి ముంపు ప్రాంతాల్లో చీకటి అలుముకున్న గ్రామాల్లో వెలుగులు నింపేందుకు ప్రాణాలకు తెగించి రేయింబవళ్లు పనిచేస్తున్నారు. భారీ దెబ్బ.. గోదావరి వరదల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీ ఎల్) పరిధిలోని అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ప్రధానంగా 12 మండలాల్లోని 406 గ్రామాల్లో 70,148 సర్వీసులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 8 సబ్స్టేషన్లు, 33కేవీ ఫీడర్లు 3, 11కేవీ ఫీడర్లు 46 దెబ్బతిన్నాయి. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు (టీడీఆర్) 3,964 పాడయ్యాయి. వీటిలో 3 సబ్ స్టేషన్లు, 33కేవీ ఫీడర్లు 3, 11కేవీ ఫీడర్లు 4, టీడీఆర్‌లు 383 బాగుచేశారు. వ్యవసాయ బోర్లు పూర్తిగా నీటమునగడంతో 5,368 సర్వీసులకు విద్యుత్ అందించలేని పరిస్థితి ఏర్పడింది. మిగతా వాటిలో 10,073 సర్వీసులకు అందిస్తున్నారు. 230 ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామీణ తాగునీటి ప్రాజెక్టులు, ఆస్పత్రులు, సెల్ టవర్లకు ఇంకా విద్యుత్ సరఫరా చేయాల్సి ఉంది. నిరంతర ప్రయత్నం.. అత్యవసర సర్వీసులకు, వరద బాధితులు పునరావాస కేంద్రాలకు, పలు వసతి గృహాలు, పాఠశాలలకు తాత్కాలిక విద్యుత్ లైన్లు, పవర్ జనరేటర్ల ద్వారా విద్యుత్ అందిస్తున్నారు. ఇక దెబ్బతిన్న వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసేందుకు ట్రాన్స్ఫార్మర్లు సిద్ధం చేశారు. అవసరమైన కండక్టర్లు, కేబు ళ్లతో సహా 17,280 స్తంభాలను అందుబాటులో ఉంచారు. ప్రతి డివిజన్‌లోనూ 24 గంటలూ అందుబాటులో ఉండేలా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. క్షేత్ర స్థాయిలో జూనియర్ లైన్మెన్ దగ్గర్నుంచి డిస్కం సీఎండీ వరకూ 850 మంది సిబ్బంది 65 బృందాలుగా ఏర్పడి విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నారు. స్వయంగా పర్యవేక్షిస్తున్నాం వరదల వల్ల విద్యుత్ వైర్లు నీటిలో మునిగిపోయాయి. వెంటనే వాటిని సరిచేయాలి. లేదా విద్యుత్ సరఫరా నిలిపివేయాలి. అలా నిలిపివేయాలన్నా కూడా ఆ ప్రాంతానికి వరద నీటిలోనే వెళ్లాలి. అది చాలా ప్రమాదకరం. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఎవరూ ప్రాణాలతో మిగలరు. అయినప్పటికీ వెళుతున్నాం. నాతో పాటు కొందరు ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయికి పడవలపై వెళ్లి విద్యుత్ పునరుద్ధరణ పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వెంటనే విద్యుత్ సరఫరా చేసేలా ప్రయత్నిస్తున్నాం. – కే సంతోషరావు, సీఎండీ, ఏపీఈపీడీసీఎల్ ఇదీ చదవండి: CM YS Jagan: 48 గంటల్లో సాయం -
తొలగిన అడ్డంకులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న 23,667 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి అడ్డంకులు తొలగిపోయాయి. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను ఉమ్మడి హైకోర్టు కొట్టేసింది. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణ వల్ల తమకు అన్యాయం జరుగుతోందని, ఇది రాజ్యాంగం తమకు కల్పించిన హక్కులను హరించడమేనంటూ పలువురు నిరుద్యోగులు చేసిన వాదనను ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. విద్యుత్ సంస్థలు పరిశ్రమ నిర్వచన పరిధిలోకి వస్తాయని, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ వ్యవహారం పారిశ్రామిక వివాదాల చట్ట పరిధిలోకి వస్తుందని తెలిపింది. తెలంగాణ విద్యుత్ సంస్థలకు, కార్మిక సంఘాలకు మధ్య పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం ఓ ఒప్పందం కుదిరిందని, ఈ ఒప్పందం నుంచి ఇప్పుడు వెనక్కి వెళ్లమని చెప్పడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. పిటిషనర్లు ఈ ఒప్పందాన్ని సవాల్ చేయలేదని, అందువల్ల క్రమబద్ధీకరణ విషయంలో ఏ రకంగానూ జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. దొడ్డిదారిలో నియామకాలు జరపరాదంటూ ఉమాదేవి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇక్కడ వర్తించదని, అది కేవలం ఉద్యోగుల నియామకాలకు సంబంధించిందని తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి. రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. ఇప్పటికే తమ సంస్థల్లో పనిచేస్తున్న సుమారు 21 వేల మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులను విలీనం చేసుకోవాలన్న విద్యుత్ సంస్థల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్‌కు చెందిన శ్రావణ్‌కుమార్ అనే నిరుద్యోగి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఇదే అభ్యర్థనతో మరికొందరు నిరుద్యోగులూ పిటిషన్లు వేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపి తీర్పు వాయిదా వేసిన ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పరిగణించలేం... ‘తెలంగాణ విద్యుత్ సంస్థల్లో నియామకం, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వ ఉద్యోగంతో సమానంగా పరిగణించాలన్న పిటిషనర్ల వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. రాజ్యాంగంలోని అధికరణ 16 క్లాజ్ 1, 2 ప్రకారం విద్యుత్ సంస్థల్లో పనిచేసే కార్మికుల సేవల క్రమబద్ధీకరణను ప్రభుత్వ ఉద్యోగంతో సమానంగా పరిగణించలేమని తేల్చిచెప్పింది. పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం తెలంగాణ విద్యుత్ సంస్థలు పరిశ్రమ పరిధిలోకి వస్తాయి. కాబట్టి అటు విద్యుత్ సంస్థల యాజమాన్యాలకు, అందులో పనిచేసే కార్మికులకు పారిశ్రామిక వివాదాల చట్ట నిబంధనలు వర్తిస్తాయి. వారికి చట్ట నిబంధనల రక్షణ ఉంది’అని ధర్మాసనం తెలిపింది. ఓటు బ్యాంకే ప్రభావితం చేస్తుంది.. అందుకే వారి వైపు మొగ్గు చూపారు... ‘విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న వేల మంది కార్మికులు ఒక్కమాట మీద నిలబడి, సర్వీసుల క్రమబద్ధీకరణ కోసం డిమాండ్ చేస్తున్నారు. ఈ వేల మంది ఓటు బ్యాంకు, విధాన నిర్ణయకర్తల విధానాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. గుర్తింపులేని నిరుద్యోగులతో పోలిస్తే గుర్తింపు ఉన్న కార్మిక శక్తి వైపే రాజకీయ కార్యనిర్వాహకులు మొగ్గుచూపుతారు. ఈ రెండు వర్గాలకు సంబంధించి హక్కులు, ప్రయోజనాల విషయంలో సమతౌల్యత పాటించడం న్యాయస్థానాలకు అంత సులభం కాదు. తెలంగాణ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులు, ఔట్‌సోర్స్ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులతో సమానమన్న పిటిషనర్ల వాదనను మేం సమర్థిస్తే ఇప్పటికే విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న వేల మంది ఉద్యోగులను బయటకు పంపాల్సి ఉంటుంది. అలా చేస్తే ఈ వేల మంది ఉద్యోగుల రాజ్యాంగ హక్కులను హరించినట్లవుతుంది. దొడ్డిదారిన నియామకాలు చేపట్టరాదని స్టేట్ ఆఫ్ కర్ణాటక వర్సెస్ ఉమాదేవి కేసులో సుప్రీంకోర్టు చెప్పిన తీర్పును పిటిషనర్లు ప్రస్తావిస్తున్నారు. ఈ తీర్పు ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలకు వర్తిస్తుందే తప్ప పారిశ్రామిక చట్టం కింద చేసే నియామకాలకు వర్తించదు’అని ధర్మాసనం తీర్పులో స్పష్టం చేసింది. -
ఔట్సోర్సింగ్ విద్యుత్ ఉద్యోగులు ఔట్!
సాక్షి, హైదరాబాద్: ఔట్ సోర్సింగ్ సిబ్బంది తమ ఉద్యోగులే కాదంటోంది విద్యుత్ సంస్థ. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది ఔట్సోర్సింగ్ విద్యుత్ ఉద్యోగుల తొలగింపుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇది తెలుసుకున్న ఆ ఉద్యోగులు హైదరాబాద్‌లోని విద్యుత్ సౌధాలో మంగళవారం ఆందోళన చేశారు. ఏపీ జెన్కోలో పనిచేస్తున్న 15 మంది తెలంగాణ ప్రాంతానికి చెందిన వారిని తొలగిస్తూ హెచ్ఆర్ అధికారులు ఆదేశాలు సిద్ధం చేశారు. ఇది లీకవడంతో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు హెచ్ఆర్ డెరైక్టర్ ఎ.వెంకటేశ్వరరావును ఆయన చాంబర్లోనే నిలదీశారు. తొలగింపు ఆదేశాలు సిద్ధమైనప్పటికీ జెన్కో ఎండీ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, కంగారు పడవద్దంటూ ఆయన ఆ ఉద్యోగులకు నచ్చజెప్పారు. ఈ 15 మందిని తెలంగాణ జెన్కోకు పంపించే ప్రయత్నం చేస్తామని ఆయన భరోసా ఇవ్వడంతో ఉద్యోగులు కొంత శాంతించారు. కానీ లిఖితపూర్వక హామీ ఇవ్వకపోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే, గత కొద్ది రోజులుగా జిల్లాల వారీగా ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కమ్‌ల్లో ఉన్న ఔట్సోర్సింగ్ సిబ్బంది జాబితాలను సిద్ధం చేసినట్టు తెలిసింది. వీళ్లను రాజకీయ కోణంలో విభజన చేస్తున్నారని తెలిసింది. టీడీపీ హయాంలో తీసుకోని ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తీసివేయాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలున్నట్టు తెలియవచ్చింది. ఈ క్రమంలో దాదాపు 9 వేల మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తీసివేసే యోచనలో విద్యుత్ సంస్థలున్నట్టు తెలిసింది. -
తీపి కబురు
చెన్నై, సాక్షి ప్రతినిధి: విద్యుత్ సంస్థలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు తీపి కబురందింది. కాంట్రాక్టు కార్మికులతో సహా ఉద్యోగులందరికీ 7 శాతం జీతాలను పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పెంపు మూలంగా రాష్ట్ర ప్రభుత్వంపై రూ.252 కోట్ల భారం పడుతున్నట్లు ముఖ్యమంత్రి జయలలిత బుధవారం వెల్లడించారు. కొడనాడు నుంచి సీఎం జయలలిత మాట్లాడుతూ ఉద్యోగులు, కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్న అన్నాడీఎంకే ప్రభుత్వం అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుందని గుర్తు చేశారు. కార్మికుల హక్కులు కాపాడటం, సుఖమయ జీవి తాన్ని అందుబాటులోకి తేవడం ప్రభుత్వ కర్తవ్యాలుగా భావిస్తోందని అన్నారు. విద్యుత్ సంస్థలో కాంట్రాక్టు ఉద్యోగులతో చేసుకున్న ఒప్పందం 2011 నవంబరు 30వ తేదీతో ముగిసిందని పేర్కొన్నారు. కొత్త ఒప్పందంపై సంతకాలు చేసేందుకు అదే ఏడాది డిసెంబరు 16న వేతన సవరణ కమిషన్‌ను నియమించామని తెలిపారు. ఈ కమిషన్ 15 కార్మిక సంఘాలతో చర్చించి నివేదికను సిద్ధం చేసిందని తెలిపారు. ఈ నివేదికలో పేర్కొన్న సిఫార్సుల ప్రకారం గడిచిపోయిన కాలం 2011 డిసెంబరు 1 నుంచి 2013 డిసెంబరు 31వ తేదీ వరకు పెంచిన వేతనాలను అందజేయాలని నిర్ణయించినట్లు ఆమె చెప్పారు. పెంచిన వేతనాలను కొత్త ఏడాది కానుకగా రెండు వాయిదాల్లో జనవరి, ఏప్రిల్ మాసాల్లో చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆమె తెలిపారు. వేతన సవరణ ఒప్పదం 2015 నవంబరు 30వరకు అమల్లో ఉంటుందని సీఎం తెలిపారు. 70,820 మంది కార్మికులు, 10,160 మంది అధికారులు వేతన సవరణతో లబ్ధి పొందుతారని ఆమె చెప్పారు. దీనివల్ల ప్రభుత్వంపై రూ.252 కోట్ల అదనపు భారం పడుతుందని ఆమె వివరించారు. దీంతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో 670 మంది నర్సుల నియామకం చేపట్టినట్లు సీఎం వెల్లడించారు. రాష్ట్రంలో 741 నర్సుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని వీటిల్లో ప్రస్తుతానికి 670 ఖాళీలను భర్తీచేశామని చెప్పారు.