
అచ్చెన్నా... ఆడపడుచుల్లో ఆనందం ఎక్కడా?
‘టీడీపీ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో రాష్ట్రం సుభిక్షంగా మారిపోయింది. రైతుల ఆత్మహత్య ఘటనల్లేవు. మహిళలంతా ఆనందంగా ఉన్నారు. ఏ ఒక్క ఆడపడుచూ కన్నీరు పెట్టట్లేదు...’ ఇవీ రాష్ట్ర కార్మిక మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడి నోటివెంట జాలువారిన మాటలు! సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో పెండింగ్ పనులు, సమస్యలపై మున్సిపల్ మంత్రి నారాయణతో కలిసి అచ్చెన్న సమీక్ష నిర్వహించారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ తమ ప్రభుత్వం గురించి గొప్పలు చెప్పుకున్నారు.
ఆ తర్వాత కొద్ది నిమిషాల వ్యవధిలోనే సమావేశ మందిరం నుంచి బయటకు వెళ్తున్న మంత్రుల వద్ద కొంతమంది మహిళలు కన్నీటిపర్యంతమయ్యారు. వారిని చూసిన మంత్రికి ఏం చెప్పాలో కాసేపు అర్థం కాలేదు. ఇంతకీ విషయమేమిటంటే... టీడీపీ ప్రభుత్వమే పట్టణ ఆరోగ్య ఉపకేంద్రాల్లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులుగా తమను నియమించిందని... ఇప్పుడు కడుపుకొట్టడం భావ్యం కాదని ఆ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ‘కడుపు కాల్చుకొని పనిచేశాం. నిండు గర్భిణులుగా ఇంటింటికీ తిరిగి మాకు అప్పగించిన పని పూర్తి చేశాం. కానీ ప్రభుత్వం కనికరించట్లేదు. కొన్ని నెలలుగా జీతం ఇవ్వట్లేదు. ఇప్పుడు ఉద్యోగం తీసేస్తామంటే మేమెలా బతికేదీ’ అంటూ పి.విజయలక్ష్మి అనే ఏఎన్‌ఎం కన్నీరు పెట్టింది.
- సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం