పలమనేరు(చిత్తూరు జిల్లా): తాను ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ చానెల్‌లో 20 ఏళ్లు విలేకరిగా వెట్టిచాకిరి చేశానని, కనీసం జీతం కూడా ఇవ్వకుండా తనను తొలగించారని, ఈ మేరకు సంస్థపై కార్మిక శాఖకు ఫిర్యాదు చేశానని ఆర్‌ఎస్ లోకనాథం అనే వ్యక్తి శుక్రవారం తెలిపారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం... పలమనేరు పట్టణానికి చెందిన ఆర్‌ఎస్ లోకనాథం 20 ఏళ్లు ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ చానల్‌లో పనిచేశారు.
ఇటీవల చానల్‌లోని పలువురిని కుదించి పలమనేరు రిపోర్టరే మూడు నియోజకవర్గాలను కవర్ చేయాలని ఆదేశించారు. దీంతో లోకనాథం కారు అద్దెకు తీసుకుని ముఖ్యమైన కార్యక్రమాలను కవర్ చేశారు. ఇందుకు సంబంధించిన అద్దె బిల్లులను బ్రాంచ్ మేనేజర్ పెట్టుకుని డబ్బు డ్రా చేసుకోవడంతో కడుపుమండిన బాధితుడు తమ యాజమాన్యం పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు.
అయితే లోకనాథంపైనే ఆగ్రహం వ్యక్తంచేసి ఆయన్ను విధుల నుంచి తొలగించారు. దీనిపై బాధితుడు తిరుపతిలోని కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ (డీసీఎల్) బాబూనాయక్‌కు గత నెల 22న లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన డీసీఎల్ గత నెల 30వ తేదీన ఆంధ్రజ్యోతి డైరెక్టర్‌కు నోటీసులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment