కార్మికశాఖలో నిధులు స్వాహా...!
సాక్షి, హైదరాబాద్: కార్మికశాఖలో అవినీతి రాజ్యమేలుతోంది. నియంత్రించాల్సిన ఉన్నతాధికారులు సైతం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. కార్మికులకు అవగాహన సదస్సుల కోసం ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను ఒక డీసీఎల్ (డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్) స్థాయి అధికారి బొక్కేసినట్లు ఆడిటింగ్ విభాగం నిగ్గు తేల్చింది. రూ.12 లక్షలకు సంబంధించిన ఖర్చులకు ఒక్క ఆధారమూ చూపడంలేదని పేర్కొంది. ఆ గోల్‌మాల్ వ్యవహారానికి సంబంధించిన ఫైలును బయటకు పొక్కకుండా సిబ్బంది శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అక్రమ పద్ధతుల్లో పోస్టింగ్‌లు, జీతభత్యాలు పొందినా పట్టించుకున్న దాఖలాలు లేవు.
ఇలాంటి వ్యవహారాలు కార్మికశాఖలో సర్వసాధారణమేనని సిబ్బందే పేర్కొంటున్నారు. దీంతో కార్మికశాఖలో పెద్దఎత్తున నిధులు గోల్‌మాల్ అవుతున్నాయి. 2009-10 ఏడాదికిగాను అప్పటి ప్రభుత్వం కార్మికుల అవగాహన సదస్సుల కోసం రూ.12 లక్షలు మంజూరు చేసింది. కానీ వాటిని కొందరు అధికారులు తమ జేబుల్లోకి మళ్లించినట్లు సమాచారం. ఖర్చు పెట్టినట్లుగా ఆధారాలు సమర్పించకపోవడంతో 23 ఏప్రిల్ 23, 2014న సంబంధిత డీసీఎల్ అధికారికి నోటీసులు జారీ చేసింది. ఉన్నతాధికారుల అండదండలతో ఆయన తనకేమీ పట్టనట్లుగా వ్యవహరించారు. పదవీ విరమణ సందర్భంగా ఆ అధికారికి ఉన్నతాధికారులు క్లీన్‌చీట్ ఇచ్చి సత్కరించారు. ఈ వ్యవహారం కాస్త సచివాలయం దాకా వెళ్లడంతో ప్రస్తుతం కార్మికశాఖలో హాట్‌టాఫిక్‌గా మారింది.
ఫైళ్లు మాయమే..
కార్మికశాఖ కమిషనరేట్ పరిపాలన, విజిలెన్స్ విభాగాలు అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాయి. కనీసం అధికారికంగా విచారణ కోసం అందిన ఫైళ్లు సైతం మాయం కావడం విస్మయానికి గురి చేస్తోంది. అంతర్గత అవినీతి ఆరోపణలపై సర్గిగా రెండేళ్ల క్రితం పరిపాలన, విజిలెన్స్ విభాగానికి అధికారికంగా ఒక ఫైలు చేరింది. అందులో ‘కార్మికశాఖలో పోస్టింగ్ ఉత్తర్వులు లేకుండా ఒక అధికారి హైదరాబాద్-2 డీసీఎల్‌గా విధుల్లో చేరి 13 నెలలపాటు జీతాన్ని అక్రమంగా డ్రా చేసుకున్నారు’ అనే ఆభియోగాలకు సంబంధించిన పూర్తిస్థాయి ఆధారాలతో అధికారికంగా పరిపాలన, విజిలెన్స్ విభాగాని ఫైలు అందింది. కానీ రెండేళ్లు గడిచిన ఆ ఫైలు కనీసం విచారణ జరుగలేదు. తాజాగా ఆ ఫైలు పురోగతిపై ఆరాతీస్తే సంబంధిత విభాగం అధికారుల చేతివాటంతో ఆ ఫైలు మాయమైనట్లు తెలిసింది. సాక్షాత్తు సంబంధిత అధికారులు సైతం ఆ దస్త్రం పరిపాలన, విజిలెన్స్ విభాగాలల్లో లేదని స్పష్టం చేయడం ఇందుకు బలం చేకూర్చుతోంది.