రెండేళ్లలో కోటి ఉద్యోగాలు: దత్తాత్రేయ
పటాన్‌చెరు: రెండేళ్లలో కోటి ఉద్యోగాలు కల్పిస్తామని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. 25 ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తామన్నారు. మంగళవారం మెదక్ జిల్లా పటాన్‌చెరులో ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ దేశంలోని 40 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులకు యూవిన్ స్మార్ట్ కార్డును ఇవ్వనున్నామని చెప్పారు. జాతీయస్థాయిలో ఒకే విధ మైన వేతనాలు అమలు చేసే విధంగా త్వరలో పార్లమెంటులో బిల్లు పెడతామని వెల్లడించారు.
ఈఎస్‌ఐ ఆసుపత్రులను మరింతగా విస్తరిస్తామని, ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్‌లను కెరీర్ కౌన్సెలింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేస్తామన్నారు. నిరుద్యోగుల కోసం ప్రత్యేక పోర్టల్ తీసుకువస్తున్నామని, అందులో దేశవ్యాప్తంగా ఉన్న ఆయా సంస్థల్లో ఉద్యోగ ఖాళీల వివరాలు ఉంటాయని తెలిపారు. హోంమంత్రి నాయిని నర్సిం హారెడ్డి మాట్లాడుతూ రామచంద్రాపురం ఈఎస్‌ఐ ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దాలని కేంద్రమంత్రికి విజప్తి చేశారు. దత్తాత్రేయ స్పందిస్తూ రామచంద్రాపురంలో ఇప్పుడున్న ఈఎస్‌ఐ ఆసుపత్రిని 200 పడకలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
మేయర్ పీఠం బీజేపీదే..
హైదరాబాద్ మేయర్ స్థానం బీజేపీదేనని కేంద్ర మంత్రి దత్తాత్రేయ అన్నారు. మంగళవారం ఆయన పటాన్‌చెరులో కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. మిత్ర పక్షమైన టీడీపీతో హైదరాబాద్‌లో మేయర్ పదవిని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఇందుకు కార్యకర్తలు కష్టపడి పని చేయాలన్నారు.