క్రీడలతోనే మానసిక ఉల్లాసం
క్రీడలతోనే మానసిక ఉల్లాసం
Published Tue, Mar 21 2017 11:24 PM | Last Updated on Tue, Sep 5 2017 6:42 AM
– కార్మిక శాఖ కర్నూలు జోన్ క్రీడలు ప్రారంభం
– కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ ఎస్.వై. శ్రీనివాస్
కర్నూలు (టౌన్): క్రీడలతోనే మానసిక ఉల్లాసం కలుగుతుందని కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ ఎస్.వై. శ్రీనివాస్ అన్నారు. మంగళవారం స్థానిక ఔట్‌డోర్ స్టేడియంలో మే డేను పురస్కరించుకొని కార్మిక సంక్షేమ మండలి, కార్మిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో కర్నూలు జోన్ క్రీడా, సాంస్కృతిక పోటీలు నిర్వహించారు. కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ శ్రీనివాస్ పోటీలను ప్రారంభించారు. కార్మిక శాఖ జోన్ పరిధిలోని కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు చెందిన ఫ్యాక్టరీలు, దుకాణాలకు చెందిన కార్మికులు పోటీల్లో పాల్గొన్నారు. రెండు రోజులపాటు నిర్వహిస్తున్న ఈ క్రీడాపోటీల్లో కబడ్డీ, బాల్ బ్యాడ్మింటన్, వాలీబాల్, టెన్నికాయిట్, అథ్లెటిక్స్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కమిషనర్ మాట్లాడుతూ కార్మికులు నిరంతరం వివిధ సంస్థల్లో శ్రమిస్తుంటారన్నారు. అలాంటి వారికి ఏటా నాలుగు జిల్లాలను కలిపి మేడే సందర్భంగా క్రీడాపోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఆయా ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికులు రోజూ సాయంత్రం క్రీడల్లో పాల్గొనాలన్నారు.
ఈ పోటీల్లో విజేతలు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ప్రతి ఒక్కరు క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలన్నారు. కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ మల్లేశ్వర్ కుమార్ మాట్లాడుతూ ఏటా ప్రభుత్వ పరంగా కార్మికులకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా ఒలిపిక్ సంఘం అధ్యక్షుడు విజయకుమార్ మాట్లాడుతూ గెలుపోటముల కంటే క్రీడాస్ఫూర్తి ప్రదర్శించడం ముఖ్యమన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ లేబర్ కమిషనర్ శేషగిరిరావు, సహాయ కార్మిక అధికారులు సుందరేష్, సుబ్బారెడ్డి, కేషన్న, మురళీకృష్ణ, విల్సన్ సుధాకర్, శ్రీనివాసరెడ్డి, రెఫరీలుగా పాల్ విజయకుమార్, ఇస్మాయిల్, భీమన్ననాయుడు, నాగరాజు, శ్రీనివాసులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement