అమెరికాలో చదువుకున్న వారికే తొలి ప్రాధాన్యం | H-1B legislations in US Congress to give priority to US-educated foreign workers | Sakshi
Sakshi News home page

అమెరికాలో చదువుకున్న వారికే తొలి ప్రాధాన్యం

Published Sun, May 24 2020 4:11 AM | Last Updated on Sun, May 24 2020 10:54 AM

H-1B legislations in US Congress to give priority to US-educated foreign workers - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా ప్రభుత్వం హెచ్‌–1బీ, ఎల్‌–1 వీసాల్లో కీలక సంస్కరణలకు తెర తీసింది. అమెరికన్ల ప్రయోజనాలు కాపాడుతూనే ఆ దేశంలో చదువుకున్న విదేశీ యువతకే తొలి ప్రాధాన్యం ఇచ్చేలా బిల్లును రూపొందించారు. ‘‘హెచ్‌–1బీ, ఎల్‌–1 వీసా సంస్కరణల చట్టం’’ పేరుతో ఈ బిల్లును రెండు పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధుల బృందం శుక్రవారం చట్ట సభల్లో ప్రవేశపెట్టింది. అమెరికాలో చదువుకున్న విదేశీ విద్యార్థుల్లో అద్భుతమైన ప్రతిభా పాటవాలు ప్రదర్శించేవారికి హెచ్‌–1బీ మంజూరులో ప్రాధాన్యతనిస్తారు.

అంతే కాకుండా ఉన్నత విద్యను అభ్యసించిన వాళ్లు, అధిక వేతనాలకు పనిచేసే నైపుణ్యం ఉన్నవారికి వీసా మంజూరు చేసేలా సంస్కరణలు చేశారు. సెనేట్‌లో చుక్‌ గ్రాస్లీ, డిక్‌ డర్బిన్, హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌లో పాస్క్రెల్, పాల్‌ గోసర్‌ తదితర ప్రజాప్రతినిధులు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ చర్య వల్ల అమెరికాలో ప్రస్తుతం చదువుకుంటున్న భారతీయ విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. అమెరికాలో చదివే విదేశీ విద్యార్థుల్లో చైనా తర్వాత స్థానం మనదే. భారత్‌కు చెందిన 2 లక్షల మందికిపైగా విద్యార్థులు ప్రస్తుతం అగ్రరాజ్యంలో విద్యనభ్యసిస్తున్నారు.  
 
లేబర్‌ శాఖకు మరిన్ని అధికారాలు
ఈ బిల్లు లేబర్‌ శాఖకు మరిన్ని అధికారాల్ని కట్టబెట్టింది. కంపెనీ యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వారిని శిక్షించే అధికారం కూడా లేబర్‌ శాఖకు ఉంటుంది. వివిధ కంపెనీలను పర్యవేక్షించడం ఏ వీసాపై ఎందరు ఉద్యోగులున్నారు , వారికిస్తున్న జీతభత్యాలు, వారు అభ్యసించిన విద్య వంటి గణాంకాలను సేకరిస్తే ఆయా కంపెనీల్లో జరిగే అక్రమాలు వెలుగు చూసే అవకాశాలుంటాయి. ఇక ఎల్‌–1 వీసాల నిబంధనల అమలుపై పర్యవేక్షించే అధికారం హోంల్యాండ్‌ సెక్యూరిటీకి అప్పగించింది.

బిల్లులో ఏం ఉందంటే..
► అమెరికాలో విద్యనభ్యసించే విదేశీ యువతలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచేవారికి తొలి ప్రాధాన్యం ఇస్తూనే అమెరికన్ల ప్రయోజన్ల కాపాడడం
► ఉన్నత విద్యనభ్యసించిన వారు, అత్యధిక వేతనాలు తీసుకునే నిపుణులైన పనివారికి ప్రాధాన్యం
► అమెరికా ఉద్యోగుల స్థానంలో హెచ్‌–1బీ, ఎల్‌–1 వీసాదారులతో భర్తీ చేయడంపై నిషేధం
► హెచ్‌1బీ వీసాదారులకు ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా అమెరికా ఉద్యోగులు, కార్మికుల పనుల్లోనూ, వారు పనిచేసే కార్యాలయాల్లో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు పడకుండా చర్యలు
► తక్కువ వేతనాలు ఇస్తూ ఔట్‌ సోర్సింగ్‌ ఇచ్చే ఉద్యోగులపై .హెచ్‌1–బీ, ఎల్‌–1 వీసాలపై తాత్కాలికంగా భారీ సంఖ్యలో విదేశాల నుంచి తీసుకువచ్చి వారికి శిక్షణ ఇచ్చాక, తిరిగి వారి దేశానికి అదే పనిచేయడానికి పంపే కంపెనీలపై ఆంక్షలు  
► 50 మందికంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉండే కంపెనీల్లో సగం మంది వరకు హెచ్‌–1బీ లేదంటే ఎల్‌–1 వీసా వినియోగదారులు పని చేస్తుంటే అదనంగా హెచ్‌–1బీ వినియోగదారుల నియామకాలపై నిషేధం.


అమెరికన్లకే తొలి ప్రాధాన్యం ఇస్తాం. మార్కెట్‌లో విదేశీ నిపుణులకు డిమాండ్‌ ఉంటే అమెరికా కాలేజీలు, యూనివర్సిటీల్లో చదివిన వారికి ప్రాధాన్యం ఇస్తాం. చట్టంలో లొసుగుల్ని ఆధారంగా చేసుకొని ఔట్‌ సోర్సింగ్‌ కంపెనీలు అమెరికన్ల ఉద్యోగాలకు కోత పెట్టి చీప్‌ లేబర్‌ని నియమించుకుంటున్నారు. ఇక నుంచి అలాంటివి కుదరవు. ఈ బిల్లు అమెరికన్ల ప్రయోజనాలను కాపాడడమే కాకుండా నిపుణులైన విదేశీయుల్ని తక్కువ వేతనానికి తీసుకొచ్చి పనిచేయిస్తున్న యాజమాన్యాల దోపిడీని కూడా అరికడుతుంది’    

–గ్రాస్లీ, కాంగ్రెస్‌ సభ్యుడు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement