l1 visa
-
అమెరికా వెళ్లేవారికి అలర్ట్: కొత్త ఫీజులు రేపటి నుంచే..
అమెరికా వెళ్లాలనుకుని వీసా ప్రయత్నాల్లో ఉన్నవారికి షాకింగ్ వార్త ఇది. ఏప్రిల్ 1 నుంచి వలసేతర అమెరికన్ వీసా కోసం వసూలు చేసే ఫీజులో భారీ పెరుగుదల ఉండబోతోంది. వీసా ఫీజు ఒకేసారి దాదాపు మూడు రెట్లు పెరగనుంది. ఈ పెంపు హెచ్-1బీ (H-1B), ఎల్-1 (L-1), ఈబీ-5 (EB-5) వీసాలకు వర్తిస్తుంది. 8 ఏళ్ల తర్వాత పెంపు అమెరికాలో నివసించడానికి వచ్చే భారతీయులు ఎక్కువగా హెచ్-1బీ, ఎల్-1, ఈబీ-5 వీసాలు తీసుకుంటారు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఈ ఫీజుల పెంపుదల జరుగుతోంది. గతంలో 2016లో ఫీజులు పెంచారు. వీసాల పెంపుదల తర్వాత ఏప్రిల్ 1 నుంచి కొత్త ఛార్జీలు వర్తిస్తాయని ఇప్పటికే జారీ చేసిన నోటిఫికేషన్లో యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) పేర్కొంది. వీసా కొత్త ఫీజులు ఇలా.. కొత్త హెచ్1బీ వీసా కోసం దరఖాస్తు చేయాలనుకుంటే, దీని కోసం ఫారమ్ I-129 ఉంటుంది. దీని రుసుము 460 డాలర్లు నుండి 780 డాలర్లకు పెరగనుంది. ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే రూ.38,000 నుంచి రూ.64,000కు పైగా పెరుగుతుంది. ఇది కాకుండా హెచ్1బీ రిజిస్ట్రేషన్ ఫీజు 10 డాలర్లు(రూ. 829) నుంచి 215 డాలర్లు (సుమారు రూ. 17,000) పెరుగుతుంది. ఇక ఎల్-1 వీసా రుసుము ఏప్రిల్ 1 నుంచి మూడు రెట్లు పెరగనుంది. ప్రస్తుతానికి ఇది 460 డాలర్లు (సుమారు రూ. 38,000) ఉంది. ఇది ఏప్రిల్ 1 నుండి 1385 డాలర్లకు (రూ. 1,10,000) పెరుగుతుందని అంచనా. ఎల్-1 అమెరికాలో నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా కేటగిరీ కింద వస్తుంది. కంపెనీలో పనిచేసే ఉద్యోగుల బదిలీ కోసం దీన్ని రూపొందించారు. అలాగే ఈబీ-5 వీసా ఫీజులు కూడా మూడు రెట్లు పెరుగుతాయని భావిస్తున్నారు. ఇది ప్రస్తుతం 3675 డాలర్లు (దాదాపు రూ. 3 లక్షలు) ఉండగా 11160 డాలర్లకు (దాదాపు రూ.9 లక్షలు) పెరగవచ్చని అంచనా. ఈబీ-5 వీసాను 1990లో యూఎస్ ప్రభుత్వం ప్రారంభించింది. దీని కింద అధిక ఆదాయ విదేశీ పెట్టుబడిదారులు అమెరికన్ వ్యాపారాలలో కనీసం 5 లక్షల డాలర్ల పెట్టుబడి పెట్టడం ద్వారా వారి కుటుంబాలకు వీసాలు పొందవచ్చు. కనీసం 10 మంది అమెరికన్లు ఉద్యోగాలు పొందగలిగేలా ఈ వ్యాపారం ఉండాలి. -
భారతీయులకు ఈసారి 10 లక్షలకుపైగా వీసాలు..!
వాషింగ్టన్: భారత్, అమెరికా సంబంధాలు మరింత బలపడుతున్నవేళ భారతీయుల వీసా ప్రక్రియను వేగిరం చేసి ఈ ఏడాది 10 లక్షలకుపైగా వీసాలు జారీచేస్తామని అమెరికా ఉన్నతాధికారి ఒకరు ప్రకటించారు. విద్యార్థి వీసాలకు అధిక ప్రాధాన్యతనిచ్చేందుకు బైడెన్ సర్కార్ కృత నిశ్చయంతో ఉందని అమెరికా సహాయ మంత్రి (దక్షిణ, మధ్య ఆసియా విభాగం) డొనాల్డ్ లూ పీటీఐ వార్తాసంస్థతో చెప్పారు. ‘ వీసా ప్రాసెసింగ్ ప్రక్రియలో హెచ్–1బీ, ఎల్–వీసాలకూ తగిన ప్రాధాన్యత కల్పిస్తాం. విద్యార్థి వీసాలు, ఇమిగ్రెంట్ వీసాలుసహా మొత్తంగా ఈ ఏడాది ఏకంగా 10 లక్షలకుపైగా వీసాలను మంజూరుచేస్తాం. ఈసారి సమ్మర్ సీజన్లో అమెరికాలో విద్యనభ్యసించనున్న భారతీయ విద్యార్థుల సౌలభ్యం కోసం అన్ని స్టూడెంట్ వీసాల ప్రాసెసింగ్‌ను పూర్తిచేస్తాం’ అని చెప్పారు. బీ1(వ్యాపారం), బీ2(పర్యాటక) కేటగిరీలుసహా తొలిసారిగా వీసా కోసం దరఖాస్తుచేసుకున్న వారి అప్లికేషన్ల వెరిఫికేషన్ వెయిటింగ్ పీరియడ్ చాలా ఎక్కువగా ఉన్న విషయం విదితమే. అమెరికాకు వస్తున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో సంఖ్య పరంగా ప్రపంచంలో భారత్ రెండోస్థానంలో ఉంది. కొన్ని చోట్ల 60 రోజుల్లోపే.. ‘హెచ్–1బీ, ఎల్ వీసాల జారీపైనా దృష్టిపెట్టాం. భారత్‌లోని కొన్ని కాన్సులేట్లలో ఈ వీసాల కోసం వేచిఉండే కాలం 60 రోజుల్లోపే. అమెరికా, భారత్ ఇరుదేశాల ఆర్థికవ్యవస్థకు ఈ వర్కింగ్ వీసాలు కీలకం. అందుకే వీటి సంగతీ చూస్తున్నాం’ అని వెల్లడించారు. ‘ పిటిషన్ ఆధారిత నాన్ఇమిగ్రెంట్ విభాగాల కింద దరఖాస్తుచేసిన వీసాదారులు తమ వీసా రెన్యువల్ కోసం మళ్లీ స్వదేశానికి వెళ్లిరావాల్సిన పనిలేకుండా అమెరికాలోనే పని పూర్తిచేసుకునేలా ఏర్పాటుచేయదలిచాం. ఇక ఆర్థిక అనిశ్చితి కారణంగా ఉద్యోగాలు కోల్పోయి 60 రోజుల్లోపు అమెరికాను వీడాల్సిన ప్రమాదం ఎదుర్కొంటున్న హెచ్–1బీ వీసాదారులకు.. అవకాశమున్న మరికొన్ని ‘వెసులుబాట్ల’ను వివరిస్తూ అదనపు సమాచారాన్ని హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ ఇచ్చింది’ అని వివరించారు. -
హెచ్–1బీ, ఎల్1 రెన్యువల్ ఇక అమెరికాలోనే
వాషింగ్టన్: ‘డొమెస్టిక్ వీసా రీవాలిడేషన్’ ప్రక్రియను పునఃప్రారంభించాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో అమెరికాలో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు, ప్రధానంగా భారతీయులకు ఎక్కువ మేలు జరుగనుంది. హెచ్–1బీ, ఎల్1 వంటి నాన్–ఇమ్మిగ్రెంట్ వీసాల గడువు ముగిస్తే స్వదేశానికి తిరిగి వెళ్లి, రెన్యువల్ చేసుకోవాల్సిన పని ఉండదు. అమెరికాలోనే ఆ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. 2004 వరకూ నాన్–ఇమ్మిగ్రెంట్ వీసాల రెన్యువల్, ఎక్సటెన్షన్ స్టాంపింగ్‌ను అమెరికాలోనే చేసేవారు. తర్వాత ఈ విధానాన్ని రద్దుచేశారు. ఇప్పుడు పునరుద్ధరించబోతున్నారు. త్వరలోనే ఇది అమల్లోకి రాబోతోంది. -
ఆన్లైన్ క్లాసులా...? మీ దేశాలకు వెళ్లిపోండి!
న్యూయార్క్: ఒకవైపు హెచ్–1బీ వీసాలపై తాత్కాలిక నిషేధం విధించిన అగ్రరాజ్యం అమెరికా తాజాగా విద్యార్థులపై తన ఆంక్షల కొరడా ఝళిపించింది. కోవిడ్–19 నేపథ్యంలో అమెరికా విశ్వవిద్యాలయాలు పూర్తిగా ఆన్లైన్ క్లాసులవైపు మొగ్గితే విదేశీ విద్యార్థులు వారి స్వదేశాలకు వెళ్లిపోవాల్సి ఉంటుందని‘ద ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్’(ఐసీఈ)ప్రకటించింది. ఒకవేళ విదేశీ విద్యార్థులు స్వదేశాలకు వెళ్లకపోతే బలవంతంగానైనా తరలిస్తామని, వర్సిటీ ఈ సెప్టెంబరులో ప్రారంభమయ్యే తరగతులను ఆన్లైన్ క్లాసుల ద్వారా మాత్రమే నిర్వహిస్తే ఇది తప్పదని స్పష్టం చేసింది. ఆన్లైన్ క్లాసులతో నడిచే కోర్సులకు ఇకపై వీసాల జారీ కూడా ఉండదని, సరిహద్దు రక్షణ విభాగం కూడా విద్యార్థులను దేశంలోకి అనుమతించరని ఐసీఈ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటన తెలిపింది. ఇప్పటికే వివిధ కోర్సుల్లో చేరిన విద్యార్థులు నేరుగా విద్యాబోధన చేసే చోటికి బదిలీ లేదా ఇతర చర్యలు తీసుకోవాలని సూచించింది. దీని ప్రభావం భారతీయ విద్యార్థులపై కూడా పడనుంది. అమెరికా విశ్వవిద్యాలయాల్లో చేరేందుకు కోర్సును బట్టి ఎఫ్–1 లేదా ఎం–1 వీసా అవసరమవుతుంది. 2017–18 విద్యా సంవత్సరానికిగాను భారత్ నుంచి సుమారు 2.51 లక్షల మంది అమెరికాలో చదువుతూండగా చైనా నుంచి 4.78 లక్షల మంది విద్యార్థులు వేర్వేరు కోర్సుల్లో చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఆన్‌లైన్‌తోపాటు ప్రత్యక్ష తరగతులు కూడా నిర్వహించే హైబ్రిడ్ కళాశాలు ఈ విషయాన్ని స్టూడెంట్ అండ్ ఎక్సే్ఛంజ్ విజిటర్ ప్రోగ్రామ్ అధికారులకు తెలియజేయాలని విద్యార్థులు తమ కోర్సు పూర్తి చేసేందుకు తగినన్ని ఆన్లైన్ తరగతులకు హాజరు కావాల్సి ఉంటుందని ఐసీఈ స్పష్టం చేసింది. ఐసీఈ జారీ చేసిన తాజా మార్గదర్శకాలు వేలాది మంది విద్యార్థు్థల్లో ఆందోళనకు కారణమవుతోంది. కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్‌లోనే ప్రారంభం కానుండగా అదే సమయంలో ఈ కొత్త తరహా ఆంక్షలు అమల్లోకి రానుండటంతో కోర్సుల్లో చేరడం ఎలా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా కారణంగా అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఆంక్షలు ఉన్న నేప«థ్యంలో స్వదేశాలకు తిరిగి వెళ్లడమూ కష్టమవుతుందని కొందరు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన తరువాత ఇమిగ్రేషన్ విధానాల్లో పలు తీవ్ర మార్పులు చేసిన విషయం తెలిసిందే. గత నెల 22వ తేదీన హెచ్–1బీ, ఎల్–1, హెచ్–2బీ, జే–1 వీసాలపై డిసెంబర్ 31వ తేదీ వరకూ నిషేధం విధించారు. యూఎస్ దృష్టికి భారత్ ఆందోళన ఆన్లైన్ క్లాస్‌లు మాత్రమే నిర్వహించే విశ్వవిద్యాలయాల్లో చదివే విదేశీ విద్యార్థుల వీసాలను ఉపసంహరిస్తామన్న అమెరికా ప్రకటనపై భారత్ ఆందోళన వెలిబుచ్చింది. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా మంగళవారం అమెరికా విదేశాంగ రాజకీయ వ్యవహారాల అండర్ సెక్రటరీ డేవిడ్ హేల్‌తో ఆన్లైన్ భేటీ సందర్భంగా లేవనెత్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. భారత్ ఆందోళనను పరిగణనలోకి తీసుకున్నారని, అమెరికాలోని భారతీయ విద్యార్థులపై ఈ నిర్ణయం ప్రభావం తక్కువగా ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారని తెలిపాయి. ఈ నిర్ణయానికి సంబంధించిన విధి విధానాలు ఇంకా ఖరారు కాలేదని చెప్పాయని వివరించాయి. -
అమెరికాలో చదువుకున్న వారికే తొలి ప్రాధాన్యం
వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వం హెచ్–1బీ, ఎల్–1 వీసాల్లో కీలక సంస్కరణలకు తెర తీసింది. అమెరికన్ల ప్రయోజనాలు కాపాడుతూనే ఆ దేశంలో చదువుకున్న విదేశీ యువతకే తొలి ప్రాధాన్యం ఇచ్చేలా బిల్లును రూపొందించారు. ‘‘హెచ్–1బీ, ఎల్–1 వీసా సంస్కరణల చట్టం’’ పేరుతో ఈ బిల్లును రెండు పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధుల బృందం శుక్రవారం చట్ట సభల్లో ప్రవేశపెట్టింది. అమెరికాలో చదువుకున్న విదేశీ విద్యార్థుల్లో అద్భుతమైన ప్రతిభా పాటవాలు ప్రదర్శించేవారికి హెచ్–1బీ మంజూరులో ప్రాధాన్యతనిస్తారు. అంతే కాకుండా ఉన్నత విద్యను అభ్యసించిన వాళ్లు, అధిక వేతనాలకు పనిచేసే నైపుణ్యం ఉన్నవారికి వీసా మంజూరు చేసేలా సంస్కరణలు చేశారు. సెనేట్‌లో చుక్ గ్రాస్లీ, డిక్ డర్బిన్, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో పాస్క్రెల్, పాల్ గోసర్ తదితర ప్రజాప్రతినిధులు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ చర్య వల్ల అమెరికాలో ప్రస్తుతం చదువుకుంటున్న భారతీయ విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. అమెరికాలో చదివే విదేశీ విద్యార్థుల్లో చైనా తర్వాత స్థానం మనదే. భారత్‌కు చెందిన 2 లక్షల మందికిపైగా విద్యార్థులు ప్రస్తుతం అగ్రరాజ్యంలో విద్యనభ్యసిస్తున్నారు. లేబర్ శాఖకు మరిన్ని అధికారాలు ఈ బిల్లు లేబర్ శాఖకు మరిన్ని అధికారాల్ని కట్టబెట్టింది. కంపెనీ యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వారిని శిక్షించే అధికారం కూడా లేబర్ శాఖకు ఉంటుంది. వివిధ కంపెనీలను పర్యవేక్షించడం ఏ వీసాపై ఎందరు ఉద్యోగులున్నారు , వారికిస్తున్న జీతభత్యాలు, వారు అభ్యసించిన విద్య వంటి గణాంకాలను సేకరిస్తే ఆయా కంపెనీల్లో జరిగే అక్రమాలు వెలుగు చూసే అవకాశాలుంటాయి. ఇక ఎల్–1 వీసాల నిబంధనల అమలుపై పర్యవేక్షించే అధికారం హోంల్యాండ్ సెక్యూరిటీకి అప్పగించింది. బిల్లులో ఏం ఉందంటే.. ► అమెరికాలో విద్యనభ్యసించే విదేశీ యువతలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచేవారికి తొలి ప్రాధాన్యం ఇస్తూనే అమెరికన్ల ప్రయోజన్ల కాపాడడం ► ఉన్నత విద్యనభ్యసించిన వారు, అత్యధిక వేతనాలు తీసుకునే నిపుణులైన పనివారికి ప్రాధాన్యం ► అమెరికా ఉద్యోగుల స్థానంలో హెచ్–1బీ, ఎల్–1 వీసాదారులతో భర్తీ చేయడంపై నిషేధం ► హెచ్1బీ వీసాదారులకు ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా అమెరికా ఉద్యోగులు, కార్మికుల పనుల్లోనూ, వారు పనిచేసే కార్యాలయాల్లో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు పడకుండా చర్యలు ► తక్కువ వేతనాలు ఇస్తూ ఔట్ సోర్సింగ్ ఇచ్చే ఉద్యోగులపై .హెచ్1–బీ, ఎల్–1 వీసాలపై తాత్కాలికంగా భారీ సంఖ్యలో విదేశాల నుంచి తీసుకువచ్చి వారికి శిక్షణ ఇచ్చాక, తిరిగి వారి దేశానికి అదే పనిచేయడానికి పంపే కంపెనీలపై ఆంక్షలు ► 50 మందికంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉండే కంపెనీల్లో సగం మంది వరకు హెచ్–1బీ లేదంటే ఎల్–1 వీసా వినియోగదారులు పని చేస్తుంటే అదనంగా హెచ్–1బీ వినియోగదారుల నియామకాలపై నిషేధం. అమెరికన్లకే తొలి ప్రాధాన్యం ఇస్తాం. మార్కెట్లో విదేశీ నిపుణులకు డిమాండ్ ఉంటే అమెరికా కాలేజీలు, యూనివర్సిటీల్లో చదివిన వారికి ప్రాధాన్యం ఇస్తాం. చట్టంలో లొసుగుల్ని ఆధారంగా చేసుకొని ఔట్ సోర్సింగ్ కంపెనీలు అమెరికన్ల ఉద్యోగాలకు కోత పెట్టి చీప్ లేబర్ని నియమించుకుంటున్నారు. ఇక నుంచి అలాంటివి కుదరవు. ఈ బిల్లు అమెరికన్ల ప్రయోజనాలను కాపాడడమే కాకుండా నిపుణులైన విదేశీయుల్ని తక్కువ వేతనానికి తీసుకొచ్చి పనిచేయిస్తున్న యాజమాన్యాల దోపిడీని కూడా అరికడుతుంది’ –గ్రాస్లీ, కాంగ్రెస్ సభ్యుడు -
విస‘వీసా’ జారుతున్నాం
సాక్షి ప్రత్యేక ప్రతినిధి : అగ్రరాజ్యంలో ఉన్నత కొలువుల నిచ్చెన వేద్దామనుకునే మన టెకీల ఆశలను అమెరికా ఆవిరి చేస్తోంది. ‘బయ్ అమెరికన్... హైర్ అమెరికన్’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తలకెత్తుకున్న నినాదం ఇప్పుడు భారతీయ సాంకేతిక నిపుణులతోపాటు స్వదేశీ సాఫ్ట్వేర్ కంపెనీలకు శాపంగా పరిణమిస్తోంది. అమెరికాలో పనిచేసేందుకు మంజూరు చేసే వర్క్ వీసాల (హెచ్–1బీ) విషయంలో యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) నిబంధనలను కఠినతరం చేయడమే ఇందుకు కారణం. ట్రంప్ దేశాధ్యక్షుడయ్యాక 2017లో మొత్తం దరఖాస్తుల్లో 13 శాతం తిరస్కరణకు గురవగా ఈ ఆర్థిక సంవత్సరం (అక్టోబర్ 2018–సెప్టెంబర్–2019) మొదటి త్రైమాసికం (అక్టోబర్–డిసెంబర్ 18)లో ఏకంగా 32 శాతం దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. గత 20 ఏళ్లలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. విచిత్రం ఏమిటంటే తిరస్కరణకు గురవుతున్న హెచ్1బీ వీసాలలో 90 శాతానికిపైగా భారతీయ ఐటీ కంపెనీలవే. మొదటి త్రైమాసికంలో భారతీయ కంపెనీల దరఖాస్తులు కనిష్టంగా 37 శాతం నుంచి గరిష్టంగా 62 శాతం తిరస్కరణకు గురయ్యాయి. తొలి త్రైమాసికంలోనే ఈ పరిస్థితి నెలకొంటే ఏడాది ముగిసే సరికి పరిస్థితులు ఎలా ఉంటాయోనని కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. వీలైనంత త్వరగా ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు నాస్కామ్ ప్రతినిధి ఒకరు చెప్పారు. అమెరికన్ కంపెనీలకు రెడ్ కార్పెట్... హెచ్1బీ దరఖాస్తుల విషయంలో యూఎస్సీఐఎస్ అమెరికన్ కంపెనీలకు అండగా నిలుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో యాపిల్, ఫేస్‌బుక్‌లు సమర్పించిన హెచ్1బీ దరఖాస్తుల్లో 99 శాతం దరఖాస్తులకు ఆమోదం లభించింది. అలాగే గూగుల్ 2 శాతం, మైక్రోసాఫ్ట్ 5 శాతం, అమెజాన్ 3 శాతం, ఇంటెల్ 8 శాతం హెచ్1బీ దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. ఈ ఆరు ప్రధాన కంపెనీలు సమర్పించిన హెచ్1బీ దరఖాస్తుల్లో 67 శాతం భారతీయులవే కాగా వాటిలో 65 శాతం దరఖాస్తులకు ఆమోదం లభించింది. ఈ కంపెనీలు సమర్పించిన రెన్యువల్ హెచ్1బీ దర ఖాస్తుల ఆమోదం కూడా కనిష్టంగా 91 శాతం, గరిష్టంగా 98 శాతం దాకా ఉండటం గమనార్హం. అదే భారతీయ కంపెనీల దగ్గరకు వచ్చే సరికి ఆమోదం పొందిన దరఖాస్తులు 82 శాతమే. గత పదేళ్ల గణాంకాలను తీసుకుంటే ఇదే ఆల్‌టైమ్ రికార్డు. 2009లో ఆరు శాతం రెన్యువల్ దరఖాస్తులు తిరస్కరణకు గురి కాగా 2019కు వచ్చేసరికి అది 18 శాతానికి ఎగబాకింది. ప్రాజెక్టులకు అవాంతరం... భారతీయ కంపెనీల హెచ్1బీ దరఖాస్తులు అత్యధికంగా తిరస్కరణకు గురికావడమే కాకుండా ఎల్–1 వీసాలను సైతం తక్కువ సంఖ్యలో ఇస్తుండటంతో ప్రాజెక్టులపై ప్రతికూల ప్రభావం పడుతోందని నాస్కామ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాలో ఉన్న భారతీయ కంపెనీల్లో పనిచేసేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానంగల అమెరికన్లు లేకపోవడం వల్ల ఆయా సంస్థలు భారతీయ నిపుణులను నియమించుకుంటున్నాయి. అయితే వారికి వర్క్ వీసాలు లభించకపోవడంతో ప్రాజెక్టులు మధ్యలో ఆగిపోవడం, ఖాతాదారులకు నాణ్యమైన సేవలు అందించని కారణంగా భారతీయ కంపెనీలు ఇబ్బందులు పడుతున్నాయి. ‘మాకు ఉన్న ప్రాజెక్టులు, వాటి కాలపరిమితిని దృష్టిలో ఉంచుకొని నిష్ణాతులైన ఇంజనీర్లను ఇక్కడి నుంచి పంపడమన్నది ఆనవాయితీగా వస్తోంది. కానీ ఇటీవల అమెరికా ఈ విషయంలో నిబంధనలను కఠినతరం చేస్తోంది. దీంతో కొన్ని ప్రాజెక్టులను అర్ధంతరంగా రద్దు చేసుకోవాల్సి వస్తోంది’ అని విప్రో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు సాక్షి ప్రతినిధికి చెప్పారు. ఉద్యోగులను ఇతర వ్యాపారాలకు వాడుకోవడం వల్లే... అయితే ఎల్–1 వీసాల కట్టడిపై అమెరికా వాదన మరోలా ఉంది. ‘ఎల్–1 వీసాలపై అమెరికా వస్తున్న ఉద్యోగులను కంపెనీలు టెక్నాలజీ అవసరాలకు కాకుండా ఇతర వ్యాపారాలకు వాడుకుంటున్నాయి. అందుకే ఈ వీసాల తిరప్కరణ అధికమైంది. దీనికితోడు సరైన ధ్రువీకరణ పత్రాలు సమర్పించకపోవడం, ఇమ్మిగ్రేషన్ అధికారులు కోరిన ఇతర సమాచారం అందించడంలో వైఫల్యం వల్ల కూడా ఈ వీసాలు ఆమోదం లభించడంలేదు’ అని నార్త్ అమెరికన్ ఇమ్మిగ్రేషన్ లా కంపెనీ వ్యవస్థాపకుడు మార్క్ డేవిస్ అన్నారు. ఎల్–1 వీసాలనూ వదిలిపెట్టని అమెరికా... అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని తమ ఆఫీసులు లేదా క్లయింట్ల దగ్గర పని చేయడానికి భారతీయ కంపెనీలు ఉద్యోగులను ఎల్–1 వీసాలపై (తాత్కాలిక బదిలీపై అమెరికాలో పని చేయడానికి ఉద్దేశించిన వీసాలు) పంపుతుంటాయి. ప్రాజెక్టులు పూర్తి చేయడానికి అవసరమైన ఇంజనీర్లను ఇక్కడి నుంచి తరలిస్తుంటాయి. పని, హోదా, అవసరాన్నిబట్టి ఎల్–1 వీసాలను కనిష్టంగా ఏడాది నుంచి గరిష్టంగా మూడేళ్లు అనుమతిస్తారు. అయితే ఇటీవల అమెరికా ఈ వీసాలను కట్టడి చేయడం మొదలుపెట్టింది. భారతీయ కంపెనీలు 2018లో ఎల్–1 వీసా కోసం చేసిన దరఖాస్తుల్లో 77.8 శాతం ఆమోదం పొందగా 2019 ఆర్థిక సంవత్సరం (అక్టోబర్– డిసెంబర్ 18) మొదటి త్రైమాసికంలో 71.9 శాతం దరఖాస్తులనే ఆమోదించింది. -
వీసాలపై గట్టిగా ప్రస్తావించాం
వాషింగ్టన్: హెచ్–1బీ, ఎల్1 వీసాల విషయం గురించి అమెరికాతో గట్టిగానే ప్రస్తావించామని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి సురేశ్ ప్రభు శనివారం చెప్పారు. భారత ఐటీ నిపుణుల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఎంతో లాభం చేకూరుతోందనీ, వీసా నిబంధనలు కఠినతరం చేసి వారు అమెరికా రాకుండా అవరోధాలు కల్పిస్తే ఆ దేశానికే నష్టమని వివరించినట్లు ఆయన వెల్లడించారు. సురేశ్ ప్రభు తన రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. భారత్–అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య విధాన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సదస్సుకు అమెరికా వాణిజ్య విభాగం ప్రతినిధి రాబర్ట్ లైజర్ హాజరయ్యారు. అనంతరం ప్రభు విలేకరులతో మాట్లాడుతూ ‘భారత ఐటీ నిపుణుల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ లబ్ధి పొందుతుండటంతోపాటు ఈ దేశ ఉత్పాదకత పెరుగుతోంది. భారతీయులు రాకపోతే అమెరికాకే కష్టం’ అని అమెరికా ప్రతినిధులకు స్పష్టంగా చెప్పినట్లు వెల్లడించారు. విదేశీయులు అమెరికన్లకు దక్కాల్సిన ఉద్యోగాలను కొల్లగొడుతున్నారనీ, అమెరికాలో ఉద్యోగాల్లో అమెరికన్లకే ప్రాధాన్యత ఉండాలంటూ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మొదట్నుంచి కఠినంగా వ్యవహరిస్తుండటం తెలిసిందే. తాజాగా హెచ్–1బీ, ఎల్1 వీసాల పునరుద్ధరణ నిబంధనలను అమెరికా మరింత కష్టతరంగా మార్చింది. భారతీయులకు వీసాల విషయంలో నిబంధనల సడలింపు అంశాన్ని అమెరికా పరిశీలిస్తుందని ఆశిస్తున్నట్లు ప్రభు చెప్పారు. -
హెచ్–1బీ సంస్కరణలపై జైట్లీ చర్చలు
వాషింగ్టన్: హెచ్–1బీ, ఎల్1 వీసాల జారీ సంస్కరణలపై అమెరికా ఆర్థిక, వాణిజ్య శాఖ మంత్రులతో భారత ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చర్చించారు. వారం రోజుల అమెరికాలో పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారం అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్టీవెన్ మ్యుచిన్, వాణిజ్య శాఖ మంత్రి విల్బర్ రాస్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడుల వృద్ధితో పాటు భారత్–అమెరికాల మధ్య ఆర్థిక సహకారంపై జైట్లీ సమాలోచనలు చేశారు. జీఎస్టీ, అందరికీ ఆర్థిక వనరుల అందుబాటు, నల్లధనంపై చర్యలు వంటి సాహసోపేతమైన నిర్మాణాత్మక సంస్కరణల్ని భారత్‌లో అమలుచేస్తున్నామని వారికి వివరించారు. -
హెచ్1బీ దుర్వినియోగం అడ్డుకుంటాం
వాషింగ్టన్: హెచ్1 బీ, ఎల్1 వీసాల దుర్వినియోగం అడ్డుకునేందుకు చట్టపరనమైనవి సహా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని అమెరికా తదుపరి అటార్నీ జనరల్ జెఫ్ సెషన్స్ స్పష్టం చేశారు. యూఎస్ అటార్నీ జనరల్ పదవికి ఇటీవలే జెఫ్‌ను డొనాల్డ్ ట్రంప్ ఎంపిక చేశారు. పదవికి లాంఛనప్రాయంగా ఎంపికయ్యే క్రమంలో గురువారం సెనేట్ జ్యుడిషియరీ కమిటీకి తన అభిప్రాయాల్ని వినిపించారు. ‘ప్రపంచంలో ఇతర ప్రాంతానికి చెందిన వ్యక్తులు తక్కువ జీతానికి పని చేసేందుకు సిద్ధంగా ఉంటే... ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న అమెరికన్లను తీసేయవచ్చు అనుకుంటే అది తప్పని’ అభ్యంతరం తెలిపారు. ‘మనకు హద్దులున్నాయి. మన పౌరుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. దాని కోసం మీతో కలిసి పనిచేయడాన్ని గౌరవంగా భావిస్తా’ అని కమిటీతో జెఫ్ అన్నారు. -
భారత్‌కి ఏటా 1.8 లక్షల కోట్ల నష్టం!
న్యూఢిల్లీ: అమెరికాలో ప్రతిపాదిత ఇమ్మిగ్రేషన్ బిల్లు .. భారత్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపనుంది. ప్రస్తుతం అమెరికా కాంగ్రెస్ పరిశీలనలో ఉన్న ఈ బిల్లు గానీ పాసయితే.. భారత ఎకానమీకి ఏటా సుమారు రూ.1.8 లక్షల కోట్ల మేర (30 బిలియన్ డాలర్లు) నష్టం వాటిల్లనుంది. అగ్రరాజ్యంపై ఆధారపడిన ఐటీ రంగం అత్యధికంగా నష్టపోనుంది. భారత్‌కి సంబంధించిన విషయాలపై అమెరికా ప్రతినిధుల సభకు సలహాలు, సూచనలు ఇచ్చే ఇండియన్ అమెరికన్ అడ్వైజరీ కౌన్సిల్ (ఐఏఏసీ) ఈ అంశాలు వెల్లడించింది. కొన్ని ప్రత్యేక కేటగిరీ వీసాలపై పనిచేసే ఉద్యోగులను టార్గెట్‌గా చేసుకున్న ఇమ్మిగ్రేషన్ బిల్లు గానీ అమల్లోకి వస్తే భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)పై ఏటా 30 బిలియన్ డాలర్ల మేర ప్రతికూల ప్రభావం పడుతుందని ఐఏఏసీ చైర్మన్ శలభ్ కుమార్ చెప్పారు. దీంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా తీవ్రంగా దెబ్బతింటాయన్నారు. దేశీయంగా సుమారు 1 కోటి ఐటీ ప్రొఫెషనల్స్‌పైన, అమెరికాలో 5,00,000 మంది నిపుణులపైన ప్రత్యక్షంగా ప్రభావం పడుతుందని, వారికి ఉపాధి లేకుండా పోతుందని కుమార్ పేర్కొన్నారు. నవంబర్‌లో అమెరికాలో మధ్యంతర ఎన్నికలు రానున్న నేపథ్యంలో బిల్లు ఏక్షణమైనా చర్చకు వచ్చే అవకాశం ఉందని.. ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా అధికార, ప్రతిపక్షాలు మూడు రోజుల్లో దీనిపై పరస్పర అంగీకారానికి రావొచ్చని కుమార్ పేర్కొన్నారు. సమయం మించిపోతున్నందున మరింత జాప్యం చేయకుండా భారత్ తన బాణీని గట్టిగా వినిపించాల్సిన అవసరం ఉందన్నారు. ఇమ్మిగ్రేషన్ బిల్లు వివాదం ఇదీ .. భారత ఐటీ రంగం ఆదాయాల కోసం అత్యధికంగా అమెరికాపైనే ఆధారపడిన సంగతి తెలిసిందే. మన వారు అక్కడ ఉద్యోగం చేసేందుకు ఉపయోగపడే వీసా కేటగిరీలు కొన్ని ఉన్నాయి. ఇందులో హెచ్1బీ వీసాల ద్వారా అమెరికా కంపెనీలు విదేశీ ప్రొఫెషనల్స్‌ని నియమించుకోవచ్చు. ఇక ఏదైనా అంతర్జాతీయ కంపెనీ.. అమెరికాలోని తమ అనుబంధ సంస్థకు ఉద్యోగిని తాత్కాలికంగా బదిలీ చేసేందుకు ఎల్1 వీసాలు ఉపకరిస్తాయి. ఈ రెండు కేటగిరీల వీసాలను అత్యధికంగా పొందుతున్నది భారత కంపెనీలే. అంతేగాకుండా చౌక సేవల కారణంగా ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు ఎక్కువగా ఇక్కడికి తరలివస్తున్నాయి. దీంతో తమ ఉద్యోగాలను భారత్ కొల్లగొడుతోందన్న ఆరోపణలు అమెరికాలో మొదలయ్యాయి. దానికి తగ్గట్లుగానే వీసాల వినియోగంపై ఆంక్షలు విధించేలా ఇమ్మిగ్రేషన్ చట్టాన్ని రాజకీయ పార్టీలు తెరపైకి తెచ్చాయి. బిల్లు కారణంగా భారతీయ కంపెనీలు.. అమెరికాలో ఎక్కువగా స్థానిక ఉద్యోగులను తీసుకోవాల్సి రానుంది. దీంతో ఆయా సంస్థల వ్యయాలు పెరిగి, మార్జిన్లు దెబ్బతింటాయి.