విస‘వీసా’ జారుతున్నాం | Large Number Of US H1B Visa Application Rejected | Sakshi
Sakshi News home page

విస‘వీసా’ జారుతున్నాం

Published Wed, Nov 6 2019 1:55 AM | Last Updated on Wed, Nov 6 2019 4:18 AM

Large Number Of US H1B Visa Application Rejected - Sakshi

సాక్షి ప్రత్యేక ప్రతినిధి : అగ్రరాజ్యంలో ఉన్నత కొలువుల నిచ్చెన వేద్దామనుకునే మన టెకీల ఆశలను అమెరికా ఆవిరి చేస్తోంది. ‘బయ్‌ అమెరికన్‌... హైర్‌ అమెరికన్‌’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తలకెత్తుకున్న నినాదం ఇప్పుడు భారతీయ సాంకేతిక నిపుణులతోపాటు స్వదేశీ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు శాపంగా పరిణమిస్తోంది. అమెరికాలో పనిచేసేందుకు మంజూరు చేసే వర్క్‌ వీసాల (హెచ్‌–1బీ) విషయంలో యునైటెడ్‌ స్టేట్స్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎస్‌సీఐఎస్‌) నిబంధనలను కఠినతరం చేయడమే ఇందుకు కారణం. ట్రంప్‌ దేశాధ్యక్షుడయ్యాక 2017లో మొత్తం దరఖాస్తుల్లో 13 శాతం తిరస్కరణకు గురవగా ఈ ఆర్థిక సంవత్సరం (అక్టోబర్‌ 2018–సెప్టెంబర్‌–2019) మొదటి త్రైమాసికం (అక్టోబర్‌–డిసెంబర్‌ 18)లో ఏకంగా 32 శాతం దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. గత 20 ఏళ్లలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. విచిత్రం ఏమిటంటే తిరస్కరణకు గురవుతున్న హెచ్‌1బీ వీసాలలో 90 శాతానికిపైగా భారతీయ ఐటీ కంపెనీలవే. మొదటి త్రైమాసికంలో భారతీయ కంపెనీల దరఖాస్తులు కనిష్టంగా 37 శాతం నుంచి గరిష్టంగా 62 శాతం తిరస్కరణకు గురయ్యాయి. తొలి త్రైమాసికంలోనే ఈ పరిస్థితి నెలకొంటే ఏడాది ముగిసే సరికి పరిస్థితులు ఎలా ఉంటాయోనని కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. వీలైనంత త్వరగా ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు నాస్కామ్‌ ప్రతినిధి ఒకరు చెప్పారు.

అమెరికన్‌ కంపెనీలకు రెడ్‌ కార్పెట్‌...
హెచ్‌1బీ దరఖాస్తుల విషయంలో యూఎస్‌సీఐఎస్‌ అమెరికన్‌ కంపెనీలకు అండగా నిలుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో యాపిల్, ఫేస్‌బుక్‌లు సమర్పించిన హెచ్‌1బీ దరఖాస్తుల్లో 99 శాతం దరఖాస్తులకు ఆమోదం లభించింది. అలాగే గూగుల్‌ 2 శాతం, మైక్రోసాఫ్ట్‌ 5 శాతం, అమెజాన్‌ 3 శాతం, ఇంటెల్‌ 8 శాతం హెచ్‌1బీ దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. ఈ ఆరు ప్రధాన కంపెనీలు సమర్పించిన హెచ్‌1బీ దరఖాస్తుల్లో 67 శాతం భారతీయులవే కాగా వాటిలో 65 శాతం దరఖాస్తులకు ఆమోదం లభించింది. ఈ కంపెనీలు సమర్పించిన రెన్యువల్‌ హెచ్‌1బీ దర ఖాస్తుల ఆమోదం కూడా కనిష్టంగా 91 శాతం, గరిష్టంగా 98 శాతం దాకా ఉండటం గమనార్హం. అదే భారతీయ కంపెనీల దగ్గరకు వచ్చే సరికి ఆమోదం పొందిన  దరఖాస్తులు 82 శాతమే. గత పదేళ్ల గణాంకాలను తీసుకుంటే ఇదే ఆల్‌టైమ్‌ రికార్డు. 2009లో ఆరు శాతం రెన్యువల్‌ దరఖాస్తులు తిరస్కరణకు గురి కాగా 2019కు వచ్చేసరికి అది 18 శాతానికి ఎగబాకింది.

ప్రాజెక్టులకు అవాంతరం...
భారతీయ కంపెనీల హెచ్‌1బీ దరఖాస్తులు అత్యధికంగా తిరస్కరణకు గురికావడమే కాకుండా ఎల్‌–1 వీసాలను సైతం తక్కువ సంఖ్యలో ఇస్తుండటంతో ప్రాజెక్టులపై ప్రతికూల ప్రభావం పడుతోందని నాస్కామ్‌ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాలో ఉన్న భారతీయ కంపెనీల్లో పనిచేసేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానంగల అమెరికన్లు లేకపోవడం వల్ల ఆయా సంస్థలు భారతీయ నిపుణులను నియమించుకుంటున్నాయి. అయితే వారికి వర్క్‌ వీసాలు లభించకపోవడంతో ప్రాజెక్టులు మధ్యలో ఆగిపోవడం, ఖాతాదారులకు నాణ్యమైన సేవలు అందించని కారణంగా భారతీయ కంపెనీలు ఇబ్బందులు పడుతున్నాయి. ‘మాకు ఉన్న ప్రాజెక్టులు, వాటి కాలపరిమితిని దృష్టిలో ఉంచుకొని నిష్ణాతులైన ఇంజనీర్లను ఇక్కడి నుంచి పంపడమన్నది ఆనవాయితీగా వస్తోంది. కానీ ఇటీవల అమెరికా ఈ విషయంలో నిబంధనలను కఠినతరం చేస్తోంది. దీంతో కొన్ని ప్రాజెక్టులను అర్ధంతరంగా రద్దు చేసుకోవాల్సి వస్తోంది’ అని విప్రో సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఒకరు సాక్షి ప్రతినిధికి చెప్పారు.


ఉద్యోగులను ఇతర వ్యాపారాలకు వాడుకోవడం వల్లే...
అయితే ఎల్‌–1 వీసాల కట్టడిపై అమెరికా వాదన మరోలా ఉంది. ‘ఎల్‌–1 వీసాలపై అమెరికా వస్తున్న ఉద్యోగులను కంపెనీలు టెక్నాలజీ అవసరాలకు కాకుండా ఇతర వ్యాపారాలకు వాడుకుంటున్నాయి. అందుకే ఈ వీసాల తిరప్కరణ అధికమైంది. దీనికితోడు సరైన ధ్రువీకరణ పత్రాలు సమర్పించకపోవడం, ఇమ్మిగ్రేషన్‌ అధికారులు కోరిన ఇతర సమాచారం అందించడంలో వైఫల్యం వల్ల కూడా ఈ వీసాలు ఆమోదం లభించడంలేదు’ అని నార్త్‌ అమెరికన్‌ ఇమ్మిగ్రేషన్‌ లా కంపెనీ వ్యవస్థాపకుడు మార్క్‌ డేవిస్‌ అన్నారు.

ఎల్‌–1 వీసాలనూ వదిలిపెట్టని అమెరికా...
అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని తమ ఆఫీసులు లేదా క్లయింట్ల దగ్గర పని చేయడానికి భారతీయ కంపెనీలు ఉద్యోగులను ఎల్‌–1 వీసాలపై (తాత్కాలిక బదిలీపై అమెరికాలో పని చేయడానికి ఉద్దేశించిన వీసాలు) పంపుతుంటాయి. ప్రాజెక్టులు పూర్తి చేయడానికి అవసరమైన ఇంజనీర్లను ఇక్కడి నుంచి తరలిస్తుంటాయి. పని, హోదా, అవసరాన్నిబట్టి ఎల్‌–1 వీసాలను కనిష్టంగా ఏడాది నుంచి గరిష్టంగా మూడేళ్లు అనుమతిస్తారు. అయితే ఇటీవల అమెరికా ఈ వీసాలను కట్టడి చేయడం మొదలుపెట్టింది. భారతీయ కంపెనీలు 2018లో ఎల్‌–1 వీసా కోసం చేసిన దరఖాస్తుల్లో 77.8 శాతం ఆమోదం పొందగా 2019 ఆర్థిక సంవత్సరం (అక్టోబర్‌– డిసెంబర్‌ 18) మొదటి త్రైమాసికంలో 71.9 శాతం దరఖాస్తులనే ఆమోదించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement