
వాషింగ్టన్: హెచ్–1బీ, ఎల్1 వీసాల జారీ సంస్కరణలపై అమెరికా ఆర్థిక, వాణిజ్య శాఖ మంత్రులతో భారత ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చర్చించారు. వారం రోజుల అమెరికాలో పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారం అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్టీవెన్ మ్యుచిన్, వాణిజ్య శాఖ మంత్రి విల్బర్ రాస్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడుల వృద్ధితో పాటు భారత్–అమెరికాల మధ్య ఆర్థిక సహకారంపై జైట్లీ సమాలోచనలు చేశారు. జీఎస్టీ, అందరికీ ఆర్థిక వనరుల అందుబాటు, నల్లధనంపై చర్యలు వంటి సాహసోపేతమైన నిర్మాణాత్మక సంస్కరణల్ని భారత్‌లో అమలుచేస్తున్నామని వారికి వివరించారు.