
వాషింగ్టన్: హెచ్–1బీ, ఎల్1 వీసాల విషయం గురించి అమెరికాతో గట్టిగానే ప్రస్తావించామని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి సురేశ్ ప్రభు శనివారం చెప్పారు. భారత ఐటీ నిపుణుల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఎంతో లాభం చేకూరుతోందనీ, వీసా నిబంధనలు కఠినతరం చేసి వారు అమెరికా రాకుండా అవరోధాలు కల్పిస్తే ఆ దేశానికే నష్టమని వివరించినట్లు ఆయన వెల్లడించారు. సురేశ్ ప్రభు తన రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు.
భారత్–అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య విధాన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సదస్సుకు అమెరికా వాణిజ్య విభాగం ప్రతినిధి రాబర్ట్ లైజర్ హాజరయ్యారు. అనంతరం ప్రభు విలేకరులతో మాట్లాడుతూ ‘భారత ఐటీ నిపుణుల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ లబ్ధి పొందుతుండటంతోపాటు ఈ దేశ ఉత్పాదకత పెరుగుతోంది. భారతీయులు రాకపోతే అమెరికాకే కష్టం’ అని అమెరికా ప్రతినిధులకు స్పష్టంగా చెప్పినట్లు వెల్లడించారు.
విదేశీయులు అమెరికన్లకు దక్కాల్సిన ఉద్యోగాలను కొల్లగొడుతున్నారనీ, అమెరికాలో ఉద్యోగాల్లో అమెరికన్లకే ప్రాధాన్యత ఉండాలంటూ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మొదట్నుంచి కఠినంగా వ్యవహరిస్తుండటం తెలిసిందే. తాజాగా హెచ్–1బీ, ఎల్1 వీసాల పునరుద్ధరణ నిబంధనలను అమెరికా మరింత కష్టతరంగా మార్చింది. భారతీయులకు వీసాల విషయంలో నిబంధనల సడలింపు అంశాన్ని అమెరికా పరిశీలిస్తుందని ఆశిస్తున్నట్లు ప్రభు చెప్పారు.