సాక్షి, హైదరాబాద్: రైతులకు రూ.ఐదు లక్షల వ్యక్తిగత బీమా పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం.. తాజాగా భూమి లేని రైతు కూలీలకూ మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టేందుకు కసరత్తు ప్రారంభించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాలతో వ్యవసాయశాఖ దీనికి సంబంధించి అధ్యయనం మొదలు పెట్టింది. భూమి కలిగిన రైతులకు ఇప్పటికే ప్రభుత్వం బీమా సదుపాయాన్ని ప్రకటించడమే కాకుండా బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే రైతు బీమాతో గ్రామాల్లో భూమి లేని కౌలు రైతులు, రైతు కూలీల్లో సర్కారుపై వ్యతిరేకత వస్తుందన్న ఉద్దేశంలో వారందరికీ బీమా సదుపాయం కల్పించాలని ఆలోచిస్తోంది. సెర్ప్, రవాణాశాఖ, గిరిజన సంక్షేమశాఖ, మైనారిటీ సంక్షేమ సంస్థ, కార్మికశాఖ, పౌరసరఫరాల సంస్థ తదితర వాటిల్లో అమలవుతున్న బీమా పథకాలను అధ్యయనం చేస్తుంది. ఆ సంస్థలు, శాఖలు బీమా పథకాలను ఎలా అమలు చేస్తున్నాయో వివరాలు సమర్పించాల్సిందిగా వ్యవసాయశాఖ కోరింది.
50 లక్షల మందికి ప్రయోజనం
రైతు బీమాను, రైతు కూలీ బీమాను వేర్వేరుగానే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. రైతు బీమా కింద అన్నదాతలు ఎవరైనా ప్రమాదవశాత్తు లేదా ఆత్మహత్య లేదా సాధారణ మరణం పొందినా రూ.5 లక్షలు బీమా కింద పరిహారం అందనుంది. అందుకోసం ప్రభుత్వం ప్రతీ రైతు పేరు మీద రూ.వెయ్యి వరకు బీమా కంపెనీలకు ప్రీమియం చెల్లించనుంది. అయితే రైతు కూలీలు, భూమిలేని కౌలుదార్లకు కూడా రూ.5 లక్షల బీమా వర్తింప చేస్తారా? లేకుంటే తక్కువ ఉంటుందా అన్న దానిపై మేధోమథనం జరుగుతోంది.
రాష్ట్రంలో ఒక అంచనా ప్రకారం 40 లక్షల మంది రైతు కూలీలున్నారు. అలాగే బ్యాంకర్ల లెక్కల ప్రకారం కౌలురైతులు 12 లక్షల మంది వరకు ఉన్నారు. కౌలు రైతుల్లో ఎవరైనా భూమి ఉన్న రైతులు కొందరిని తీసేస్తే సుమారు 50 లక్షల మంది వరకు ఈ కొత్త పథకం కింద బీమా కల్పించాల్సి ఉంటుంది. అయితే వీరిలో ఎవరైనా ఇతరత్రా పద్ధతుల్లో బీమా కిందకు వచ్చే వారుంటారా లేదా అన్న దానిపైనా వ్యవసాయశాఖ ఆరా తీస్తుంది. అందువల్ల వివిధ శాఖలు చేపడుతున్న బీమా పథకాల లబ్ధిదారులు, వారి ఆధార్ నంబర్లను కూడా తమకు ఇవ్వాలని వ్యవసాయశాఖ విజ్ఞప్తి చేసింది.
రైతు కూలీలకూ వ్యక్తిగత బీమా
Published Sun, Apr 1 2018 3:14 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment