
ఆర్టీసీలో ఎన్నికల హడావుడి
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల హడావుడి మొదలైంది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే విషయంలో ఇంకా స్పష్టత రానప్పటికీ ఇటీవల కార్మిక శాఖ ఆర్టీసీకి లేఖ రాయటంతో కార్మిక సంఘాలు అప్రమత్తమయ్యాయి. ఎన్నికల నిర్వహణ విషయంలో ఆర్టీసీ సంసిద్ధతను ఆ లేఖలో కార్మిక శాఖ ప్రశ్నించింది. దీంతో త్వరలో ఎన్నికలు జరుగుతాయన్న సంకేతాలు రావటంతో కార్మిక సంఘాలు బలం పెంచుకునే ప్రయత్నాలు ప్రారంభించాయి. గత ఎన్నికలు ఉమ్మడి రాష్ట్రంలో జరిగాయి. అప్పుడు ఎంప్లాయీస్ యూనియన్‌తో కలసి సంయుక్తంగా తెలంగాణ మజ్దూర్ యూని యన్ (టీఎంయూ) విజేతగా నిలిచింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావటంతో స్వతహాగానే టీఎం యూ బలంగా కనిపిస్తోంది. ఇటీవల ప్రభు త్వ ఉద్యోగులతో సమానంగా ఫిట్‌మెంట్ ఇవ్వాలని సమ్మె చేయ టం, ఫలితంగా ప్రభుత్వం 44 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించటంతో అది తన విజయంగా చెప్పుకుంటోంది. అయితే కొంతకాలంగా ఆర్టీసీలో కార్మిక సంక్షేమ నిధులకు కొరత ఏర్పడింది. కార్మికుల జీతాల నుంచి సమకూరే నిధులను ఆర్టీసీ వాడుకోవటంతో రుణాల కోసం కార్మికులు అల్లాడుతున్నారు. మరోవైపు నష్టాలతో కునారిల్లుతున్న ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి సాయం కూడా కరువైంది. ఇవి గుర్తింపు యూనియన్‌గా టీఎంయూకు బాగా నష్టం చేకూర్చే విషయాలు.
దీన్ని ఆధారంగా చేసుకుని వైరి యూనియన్‌లు బలాన్ని పుంజుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. రెండు వర్గాలుగా చీలిన ఎన్‌ఎంయూలో బలమైన నేతలు మళ్లీ ఒక్కటయ్యారు. గతంలో గుర్తింపు సంఘానికి నేతృత్వం వహించిన నాగేశ్వరరావు వర్గంలో మాజీ నేత మహమూద్ ఇటీవల మళ్లీ చేరారు. తాజాగా టీఎంయూపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు భాను, అశోక్, రాష్ట్ర కార్యదర్శులు కుమార్, సాయిలు, సికింద్రాబాద్ రీజియన్ అధ్యక్షుడు ఆర్.ఆర్.రెడ్డిలు, ఎన్‌ఎంయూలో చేరుతున్నట్టు ప్రకటన జారీ చేశారు.
ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం వైఖరితో విసిగి తాము నేషనల్ మజ్దూర్ యూనియన్‌లో చేరుతున్నామని, ఆ యూనియన్ నేతలకు పైరవీల కోసం మంత్రుల చుట్టూ తిరగటమే సరిపోతోందని వారు ఆరోపించారు. రాష్ట్ర విభజన జరిగినప్పటికీ ఆర్టీసీలో సరిగా విభజన జరగక టీఎస్‌ఆర్టీసీ నష్టపోతున్నా టీఎంయూ స్పందించటం లేదని, కార్మికుల సంక్షేమానికి ఉపయోగపడే చర్యలన్నీ ఆర్టీసీలో కుంటుపడ్డాయని వారు ఆరోపించారు. ఇక కార్మికుల నుంచి కంట్రిబ్యూషన్ రూపంలో రూ.కోట్లు వసూలు చేయటం కూడా విమర్శలకు కారణమవుతోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికలకోసం రాష్ట్రవ్యాప్తంగా డిపోలవారీగా ప్రచార కార్యక్రమాలకు కూడా కార్మిక సంఘాలు సిద్ధమవుతున్నాయి.