సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా పర్మిట్‌లు ఉండి కనీసం 8 గంటలకు మించి నడిచే ప్రైవేటు వాహనాలను కార్మిక శాఖలో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి వాహనాలు 2.44 లక్షలుండగా, ఇప్పటివరకు కార్మిక శాఖతో రిజిస్ట్రేషన్ చేయించుకుని టోకెన్ తీసుకున్న వాహనాల సంఖ్య చాలా తక్కువగా ఉండటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంగళవారం ఆర్టీఏ కేంద్ర కార్యాలయంలో రవాణా, కార్మిక శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. హైకోర్టు సూచించిన విధంగా మోటారు ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ యాక్ట్–1961ని అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించవద్దని పేర్కొన్నారు. టోకెన్‌లు తీసుకున్న వాహనాలకు మాత్రమే త్రైమాసిక పన్ను కట్టించుకోవాలని తెలిపారు. రోడ్డు భద్రతా నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రోడ్డు రవాణా పన్నుల లక్ష్యం ఈ ఏడాది రూ.3,401 కోట్లు ఉండగా, ఇప్పటివరకు రూ.2,436 కోట్లు వసూలయిందని అధికారులు మంత్రికి వివరించారు. మహబూబ్‌నగర్, కొమురం భీం ఆసిఫాభాద్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ జిల్లాల్లో పన్నుల వసూలు తక్కువగా ఉండటం పట్ల మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. అద్దె భవనాల్లో నడుస్తున్న 12 రవాణా శాఖ కార్యాలయాలకు సొంత భవనాల నిర్మాణం కోసం జనవరి నాటికి స్థలాన్ని గుర్తించి కలెక్టర్లకు ప్రతిపాదనలు పంపాలని అధికారులకు సూచించారు. పర్మిట్‌ల మోసాలకు పాల్పడే వారు ఎంతటి పలుకుబడి ఉన్న వారైనా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment