ఉపాధి కల్పన తగ్గింది..
♦ కార్మిక శాఖ గణాంకాలే చెబుతున్నాయ్
♦ జేఎం ఫైనాన్షియల్ నివేదిక
ముంబై: భారీ ఆర్థిక వృద్ధి చూపిస్తున్నా.. ఉద్యోగాలు మాత్రం ఉండటం లేదంటూ వస్తున్న విమర్శలను ప్రభుత్వం తిప్పికొడుతున్నప్పటికీ ఉపాధి కల్పన తగ్గుతోందని కార్మిక శాఖ గణాంకాలే చెబుతున్నాయని బ్రోకరేజి సంస్థ జేఎం ఫైనాన్షియల్ పేర్కొంది. డిగ్రీ హోల్డర్లు, కొత్త ఉద్యోగాల కల్పన నిష్పత్తి వివరాలు చూస్తే ఇది తెలుస్తుందని ఒక నివేదికలో వివరించింది. 2011–13 మధ్య కాలంలో ఈ నిష్పత్తి 9 రెట్లు ఉండగా, 2014–16 మధ్య కాలంలో ఏకంగా 27 రెట్లకు పెరిగిందని జేఎం ఫైనాన్షియల్ పేర్కొంది. ‘నా ఈ డిగ్రీని ఏం చేసుకోను’ అనే శీర్షికతో జేఎం ఫైనాన్షియల్ ఈ నివేదికను రూపొందించింది.
జాబ్‌లెస్ వృద్ధి అంటూ కొందరు ఆర్థికవేత్తలు, విపక్షాలు చేస్తున్న విమర్శలన్నీ కూడా బోగస్ అంటూ నీతి ఆయోగ్ వైస్–చైర్మన్ అరవింద్ పనగారియా ఇటీవలే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ‘7–8 శాతం వృద్ధి సాధిస్తున్నామంటే.. లేబర్ మార్కెట్‌కు ఏమాత్రం ప్రయోజనాలు ఒనగూరకుండానే సాధ్యం కాదు. ఉద్యోగాల కల్పన జరగకుండా ఈ స్థాయి వృద్ధి వీలు కాదు. ఉద్యోగాల కల్ప న జరుగుతోంది’ అంటూ ఆయన పేర్కొన్నారు. అయితే, నిరుద్యోగిత రేటు సుమారు 3 శాతంగానే ఉందన్న మాట తప్ప తన వాదనలకు బలమిచ్చే ఇతరత్రా గణాంకాలేమీ ఆయన చూపలేదు.