సాక్షి, హైదరాబాద్: దేశంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షే మం కోసం వసూలు చేసే సెస్ దుర్వినియోగం అవుతోంది. సుమారు రూ.28 వేల కోట్లు వృథాగా పడిఉన్నాయని అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తెలిపింది. సరైన వైద్య సేవలు, రక్షణ అందక నిర్మాణ కార్మికుడు పూర్తి నిస్సహాయ స్థితిలో ఉన్నాడని.. ఇకనైనా కేంద్రం దృష్టి సారించాలని సూచించింది. 1996 భవన, ఇతర నిర్మాణ కార్మికుల ఉపాధి, రక్షణ, ఆరోగ్యం, సంక్షేమ చట్టాన్ని రూపొందించారు.
నిర్మాణ వ్యయంలో 1% సెస్ రూపంలో కట్టాల్సి ఉంటు ంది. గతేడాది డిసెంబర్ నాటికి దేశంలో కార్మిక శాఖ వద్ద నమోదైన నిర్మాణ కార్మికుల సంఖ్య 2.8 కోట్లు. తెలంగాణలో కార్మిక శాఖ వద్ద నమోదైన సంఖ్య 10 లక్షలు. అదనంగా మరో 7 లక్షల వరకుంటారని తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు మెంబర్ గంధం అంజన్న తెలిపారు. అవగాహన లేకే చాలా మంది నిర్మాణ కార్మికులు నమోదు చేయించుకోవట్లేదు.
2022 నాటికి దేశంలో భవన నిర్మాణ రంగంలో 76.5 మిలియన్ మంది కార్మికుల అవసరం ఉంటుందని అన్‌రాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్ చైర్మన్ అనూజ్‌పురి తెలిపారు. నిర్మాణ కార్మికుల్లో ఎక్కువ మంది వలసదారులే ఉంటారు. బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ వంటి ఇతర రాష్ట్రాల నుంచి వలసలెక్కువగా ఉంటుంటాయి. వలస నిర్మాణ కార్మికులు కనీస వేతనాలు, ఓవర్ టైం చెల్లింపులు, సెలవులు వంటి గృహ, సాంఘిక భద్రత ప్రయోజనాలకు అర్హులు. కానీ, వాస్తవానికి దేశంలో కార్మిక చట్టం అమలు సవ్యంగా జరగట్లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
నిర్మాణ రంగంలో కార్మికులు అత్యంత కీలకం. ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేసే వీళ్ల రక్షణ, వైద్య సేవలు దీర్ఘకాలంగా నిర్లక్ష్యంగా చేయబడ్డాయి. దీనికి పరిష్కారం చూపించేందుకే భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) దృష్టిసారించిందని క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షుడు ఎస్. రాంరెడ్డి తెలిపారు. దుర్వినియోగమవుతున్న లేబర్ సెస్ సద్వినియోగానికి ప్రత్యేకంగా ఒక పథకం ఉండాల్సిన అవసరముందని ఆయన సూచించారు.
‘‘సెస్ సొమ్మును నేరుగా కార్మికుని బ్యాంక్ ఖాతాలో జమ చేయవచ్చు. లేకపోతే ఆరోగ్యశ్రీ లాగానే లేబర్ వైద్య పథకం వంటి దాన్ని ఏర్పాటు చేసి సెస్ సొమ్మును అందులో జమ చేస్తే.. కార్మికునితో పాటూ కుటుంబంలోని ఇతర సభ్యుల వైద్య సేవల సమయంలోనూ వినియోగించుకునే వీలుంటుందని’’ ఆయన వివరించారు. దీంతో మరింత మంది నిర్మాణ కార్మికులు నమోదయ్యే అవకాశంతో పాటూ వారి ఆరోగ్యం, సంక్షేమం కూడా మెరుగవుతుందని పేర్కొన్నారు. సాధ్యాసాధ్యాలపై క్రెడాయ్ సభ్యులతో చర్చించి.. 2 నెలల్లో కార్మిక శాఖ మంత్రితో సంప్రదింపులు జరుపుతామని ఆయన తెలియజేశారు.
మే 1 నుంచి కొత్త పథకాలు..
నిర్మాణ పనుల్లో కాళ్లు, చేతులు విరిగి వికలాంగులైన కార్మికులకు ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం నెలకు రూ.1,500 పెన్షన్ ఇస్తోంది. దీనికి అదనంగా మరో రూ.3,000 ఇవ్వనున్నట్లు సమాచారం. కార్మిక దినోత్సవం (మే1)న దీన్ని సీఎం ప్రారంభించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నమోదు చేసుకున్న కార్మికుల్లో వికలాంగులుగా ఉన్న వాళ్లు 225 మందిగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో పాటూ వలస కార్మికుల పిల్లలను బడికి పంపిస్తే 1–6వ తరగతి వరకు ఏడాదికి రూ.2 వేలు, 7–10 వరకు రూ.3 వేల ప్రోత్సాహకంగా ఇవ్వనున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment