సాక్షి, హైదరాబాద్: పై ఫొటోలో కన్పిస్తోన్న పాడి రైతు పేరు పర్నె నర్సిరెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామం. ఇతనికి రెండు గేదెలు, ఒక ఆవు ఉన్నాయి. గేదెల లో ఒకదానిని ప్రభుత్వం ఇచ్చిన 50% రాయితీతో కొనుగోలు చేశాడు. వీటి పోషణ కోసం తన పొలంలో లభించే ఎండుగడ్డి, పచ్చిగడ్డి, తవుడుతోపాటు నెలకు ఒక బస్తా పచ్చిచెక్క (రూ.1800), అరబస్తా కొబ్బరిపిట్టు (రూ. 2100), బస్తా దాణా (రూ.710) అవసరమవుతుంది. తన వద్ద ఉన్న పాడి సంపదతో రోజుకు సరాసరి 10 లీటర్ల పాలను గ్రామంలోనే ఉన్న సెంటర్‌కు పోస్తాడు. నెలకు 300 లీటర్ల చొప్పున 18 నెలలకు సంబంధించి 5,400 లీటర్లకు గాను రూ.21,600 ఈ రైతుకు ప్రోత్సాహకంగా రావాల్సి ఉంది. ఆ డబ్బులు వస్తే తన వద్ద ఉన్న గేదెలు, ఆవుకు కావాల్సిన దాణా కొనుగోలుకు వెసులుబాటు కలుగుతుందనే అభిప్రాయం ఆ రైతుది. కానీ, 18 నెలలు గా ఆ రైతుకు నిరీక్షణే మిగులుతోంది.
ఇదే వెల్లంకి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘంలో 120 మంది రైతులున్నారు. ఈ కేంద్రం ద్వారా ఆవు, గేదె పాలు కలిపి రోజుకు 350 లీటర్ల పాలు సేకరిస్తారు. వీటిని మదర్ డెయిరీకి పంపుతారు. ఈ సంఘానికి 2018 ఏప్రిల్ వరకు ప్రభుత్వం ప్రకటించిన లీటర్‌కు రూ.4 ప్రోత్సాహకం వచ్చింది. ఆ తర్వాత నిలిచిపోయింది. మే 2018 నుంచి అక్టోబర్ 2019 వరకు 1.83 లక్షల లీటర్ల పాలను ఈ సంఘం సభ్యులు సేకరించారు. వీటికి గాను రూ.7.32 లక్షలు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకంగా రావా ల్సి ఉంది. ఈ మొత్తం వస్తే పాడి రైతుకు ఊరట లభించనుంది. ఈ సమస్య ఒక్క పర్నె నర్సిరెడ్డి, వెల్లంకి పాల ఉత్పత్తిదారుల సంఘానిదే కాదు..రాష్ట్రంలోని 3 లక్షల మంది పాడిరైతులు ఈ ప్రోత్సాహకం కోసమే ఎదురుచూస్తున్నారు. 18 నెలలుగా రూ.120 కోట్లకు పైగా రావాల్సిన ప్రోత్సాహక బకాయిలు ఎప్పుడొస్తాయా అని నిరీక్షిస్తున్నారు.
అసలీ ప్రోత్సాహకం ఎందుకు?
విజయ డెయిరీ, ముల్కనూరు డెయిరీ, రంగారెడ్డి–నల్లగొండ డెయిరీ, కరీంనగర్ డెయిరీల పరిధిలోని పాడి రైతులకు, పాల సంఘాల సభ్యులకు లీటరుకు రూ.4 చొప్పున ప్రభుత్వం ప్రోత్సాహకం ఇస్తోంది. ఈ ప్రోత్సా హకం వల్ల పాడి రైతులు ఆయా డెయిరీలకే పాలు పోస్తారన్న భావనతో ప్రభుత్వం ఈ పథకానికి రూపకల్పన చేసింది. మొదట్లో కేవలం విజయ డెయిరీకే పరిమితమైన ఈ పథకం, రెండేళ్ల నుంచి మిగిలిన మూడు డెయిరీలకూ వర్తింపజేసింది. అయితే ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో 2018 మే నుంచి ప్రోత్సాహకం చెల్లింపులు జరగడం లేదు. ఈ ప్రోత్సాహక బకాయిలు వస్తే పశువుల దాణాకు, ఇతర కుటుంబ ఖర్చులకు అవసరం అవుతాయని పాడి రైతులు చెబుతున్నారు. సగటున ఒక్కో రైతుకు కనీసం రూ. ఐదారువేలు వస్తే ఆర్థికంగా కొంత ఉపశమనం కలుగుతుందని, ప్రభుత్వ డెయిరీలకే పాలు పోయాలన్న భావన మెరుగవుతుందంటున్నారు.
ప్రభుత్వం ఏం చేస్తోంది?
నిధుల లేమితోనే ప్రభుత్వం ఈ ప్రోత్సాహక నిధులు ఇవ్వడం లేదని పశుసంవర్థక శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నిధుల విడుదల కోసం ప్రయత్నాలు ప్రారంభించామని, ప్రభుత్వం కూడా ఈ నిధుల విడుదలకు అనుమతినిచ్చిందని నేడో, రేపో ప్రస్తుతమున్న బకాయిల్లో 40% డబ్బులు వచ్చే అవకాశం ఉందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. గతేడాది డిసెంబర్ వరకు ఉన్న బకాయిలు చెల్లిస్తామని చెప్పారు. 2018 ఏప్రిల్ నెలలో చివరిసారి ప్రోత్సాహకం చెల్లించగా, అప్పటికే బకాయి ఉన్న నాలుగు నెలల ప్రోత్సాహకాలు ఒకేసారి ఇచ్చారని, అప్పుడు కూడా రావాల్సిన మొత్తంలో కొంతమాత్రమే ఇచ్చారని పాడి రైతులంటున్నారు. 2018 జనవరి–ఏప్రిల్ వరకు ఒక్కో రైతుకు రావాల్సిన దాంట్లో ఇంకా పెండింగ్ ఉందని, ఇప్పుడు మళ్లీ 18 నెలల బకాయిలున్నాయని, వీలున్నంత ఎక్కువ నిధులు మంజూరు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరి ప్రభుత్వం పాల ప్రోత్సాహకాన్ని ఏం చేస్తుందో... ఎన్ని నిధులిస్తుందో నేడో, రేపో తేలనుంది.
పాడి ప్రోత్సాహకం వచ్చేదెన్నడు?
Published Sun, Nov 17 2019 2:56 AM | Last Updated on Sun, Nov 17 2019 3:01 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment