సాక్షి, అమరావతి: సన్న, చిన్న కారు రైతులకు మాదిరిగానే, పాడి రైతులకు కూడా అవసరమైన యంత్రాలను అద్దె ప్రాతిపదికన అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం కస్టమ్ హైరింగ్ సెంటర్లు (సీహెచ్‌సీలు) ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు మార్గదర్శకాలను జారీ చేస్తూ పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పశుసంవర్ధక శాఖ పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా 45 డివిజన్ల పరిధిలో 328 ఏరియా వెటర్నరీ ఆస్పత్రులు, 1,500కు పైగా వెటర్నరీ డిస్పెన్సరీలు ఉన్నాయి. పైలెట్ ప్రాజెక్టు కింద తొలుత డివిజన్ స్థాయిలో సీహెచ్‌సీలు ఏర్పాటు చేయబోతున్నారు. ఆ తర్వాత ఏరియా వెటర్నరీ ఆస్పత్రి, డిస్పెన్సరీ స్థాయికి విస్తరించాలని సంకల్పించారు. సీహెచ్‌సీల ఏర్పాటు కోసం జాయింట్ కలెక్టర్ (ఆర్‌బీకే) చైర్మన్‌గా, పశుసంవర్ధక శాఖ జేడీ సభ్య కార్యదర్శిగా, నాబార్డు ఏజీఎం తదితరులు సభ్యులుగా కమిటీలను ఏర్పాటు చేశారు.
సీహెచ్‌సీల నిర్వహణకు ఐదుగురికి తక్కువ కాకుండా పాడి రైతులతో గ్రూపులను (లబ్ధిదారులను) ఎంపిక చేసే బాధ్యతను జిల్లా స్థాయి కమిటీలకు అప్పగించారు. పాడిరైతులు ముందుకురాని చోట స్వయం సహాయక బృందాలు (ఎస్‌హెచ్‌జీలు), ఇతర గ్రూపులకు సీహెచ్‌సీల నిర్వహణా బాధ్యతలను అప్పగించనున్నారు. ఎంపికైన గ్రూపులకు వాణిజ్య బ్యాంకులు లేదా డీసీసీబీల ద్వారా అవసరమైన రుణ సహాయం అందించనున్నారు. పాడి రైతులతో ఏర్పడిన గ్రూపులు ఏపీ.ఏహెచ్‌డీఆన్‌లైన్.జీవోవీ.ఇన్ అనే పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కో సీహెచ్‌సీ పరిధిలో 8 రకాల పాడి రైతులకు ఉపయోగపడే యంత్రపరికరాలు అందుబాటులో ఉంచుతారు. వీటి కొనుగోలుకు గరిష్టంగా రూ.14.70 లక్షల రుణం ఇస్తారు. ఇందులో 50% బ్యాంకు రుణం కాగా, 40% రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక సాయం ఉంటుంది. 10% సంబంధిత గ్రూపు భరించాల్సి ఉంటుంది.
ఒక్కో సీహెచ్‌సీలో ఉండేవి..
1.గడ్డి కోసే యంత్రాలు –4
2.గడ్డిని ముక్కలు చేసే యంత్రాలు –2
3.గడ్డిని పొడి చేసే యంత్రాలు –2
4.గడ్డిని కట్టలు కట్టే యంత్రాలు – 2
5.దాణా తయారు చేసే యంత్రాలు –2
6.పచ్చగడ్డిని మాగుడి గడ్డిగా తయారు చేసి కట్టలు కట్టే యంత్రాలు (మినీ) –2
7.పశు పేడతో ముద్దల తయారీ యంత్రాలు –4
8.దోమల నివారణ యంత్రాలు –4
Comments
Please login to add a commentAdd a comment