సాక్షి, తాడేపల్లి: పశు సంవర్ధక శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పశువుల ఆస్పత్రుల్లో నాడు– నేడు, పశువులకు బీమా, ఫ్యామిలీ డాక్టర్ తరహాలో పశువులకు వైద్య సేవలు తదితర అంశాలపై అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. స్వచ్ఛమైన పాల ఉత్పత్తికోసం అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఫెస్టిసైడ్స్, రసాయనాలు ఎక్కువగా వాడుతున్నందున అవి జంతువుల్లోకి ఆహారం, వివిధ రూపాల్లో చేరి, తద్వారా పాలల్లో వాటి అవశేషాలకు దారితీస్తున్నాయని, అందుకనే స్వచ్ఛమైన పాల ఉత్పత్తిపై రైతులకు అవగాహన పెంచాలని పేర్కొన్నారు.
ఆర్గానిక్ పాల ఉత్పత్తిపై దృష్టి సారించాలని సీఎం జగన్ తెలిపారు. దీని మీద సమగ్ర పద్ధతుల్లో ముందుకు వెళ్లాలన్నారు. అమూల్ ద్వారా రైతులకు మంచి అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. తక్కువ పెట్టుబడి, సేంద్రీయ ఉత్పత్తుల ద్వారా స్వచ్ఛమైన పాల ఉత్పత్తి సాధించే అంశంపై పరిశోధనలు, ఆ పరిశోధనల ఫలితాలను రైతులకు అందించే చర్యలు చేపట్టాలన్నారు. అమూల్ ద్వారా పరిశోధన కేంద్రం ఏర్పాటుకు ఆలోచన చేయాలని పేర్కొన్నారు.
పాలు, గుడ్లు వాడితే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని, కానీ అవే పాలలో రసాయనాల అవశేషాల కారణంగా పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుందనే పరిస్థితులను చూస్తున్నామని సీఎం అన్నారు. ఆరోగ్యవంతమైన పిల్లలు ద్వారానే మంచి భవిష్యత్తు తరాలు నిర్మాణం అవుతాయని పేర్కొన్నారు. పశు యాజమాన్యంలో ఉత్తమ పద్ధతులపై రైతులకు నిరంతరం అవగాహన కల్పించాలని ఆదేశించారు. పశుసంవర్థక శాఖ అసిస్టెంట్ పోస్టులను భర్తీని పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రతి ఆర్బీకేలో కూడా ఈ పోస్టులు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే..
►వైయస్సార్ చేయూత, ఆసరా ద్వారా కొనుగోలు చేసిన పశువులన్నింటికీ కూడా బీమా ఉందా? లేదా? అనేది మరోసారి పర్యవేక్షించాలి.
►పశువులన్నింటికీ బీమా సదుపాయం కల్పించాలి.
►ఆడిట్ చేసి అక్టోబరులో పథకం ప్రారంభానికి చర్యలు తీసుకోవాలి.
►ప్రమాదవశాత్తూ, రోగాల వల్ల పశువులు చనిపోతే రైతులు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితులు వస్తాయి.
►ఇలాంటి సమయంలో వారికి అండగా నిలిచేందుకు ఈ పథకం తోడ్పడుతుంది.
►80శాతం ప్రీమియంను ప్రభుత్వమే భరిస్తుంది
కేటిల్ డాక్టర్ కాన్సెప్ట్
►పశువులకు పౌష్టికాహారం అందించే విషయంలో కూడా రైతులకు తగిన అవగాహన కల్పించాలి.
►సాయిల్ డాక్టర్ మాదిరిగా కేటిల్ డాక్టర్ కాన్సెప్ట్ కూడా అమలు చేయాలి.
►ప్రతి ఏటా కూడా క్రమం తప్పకుండా పశువుల ఆరోగ్యాలను పరిశీలించి, పరీక్షించి వాటి వివరాలను పశు ఆరోగ్య కార్డుల్లో అప్‌గ్రేడ్ చేయాలి.
వెటర్నరీ ఆస్పత్రుల్లో నాడు-నేడు
►వెటర్నరీ ఆస్పత్రుల్లో నాడు – నేడు కింద పనులు చేపట్టాలి.
►ఆ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలి.
►మండలం ఒక యూనిట్‌గా తీసుకుని ప్రతిచోటా వెటర్నరీ వైద్య సదుపాయాలు ఉండేలా సమగ్ర ప్రణాళిక అమలు చేలి.
►వైయస్సార్ సంచార పశు ఆరోగ్య సేవలపై నిరంతరం సమీక్ష చేయాలి.
►సెకండ్ ఫేజ్ కింద అక్టోబరులో మరిన్ని పశు అంబులెన్స్‌లు ప్రారంభానికి సిద్ధంచేస్తున్నట్టు వెల్లడించిన అధికారులు.
►ఆర్బీకేల ద్వారా పశువులకు ఆరోగ్య సేవలను బలోపేతం చేయాలి.
►ఫ్యామిలీ డాక్టర్ తరహాలోనే గ్రామాల్లోని పశువులకూ వైద్య సేవలు అందాలి.
►ఈమేరకు మండలాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని ఆమేరకు కార్యాచరణ రూపొందించాలి. సిబ్బందిని కూడా నియమించుకోవాలి
►వచ్చే సమావేశంలో దీనికి సంబంధించిన కార్యాచరణను నివేదించాలి
గ్రామీణ ఆర్ధిక వ్యవస్ధ బలోపేతంపై దృష్టి
►రైతులకు ప్రత్యామ్నాయం ఆదాయాలు పశుపోషణ ద్వారా వచ్చేలా చూడాలి.
►పశుపోషణ విషయంలో వారికి అండగా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలి.
►దీనివల్ల వ్యవసాయంతోపాటు, పశుపోషణ ద్వారా అదనపు ఆదాయాలు లభిస్తాయి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది.
►ఆసరా, చేయూత కింద లబ్ధిదారులైన మహిళలకు పశువుల పెంపకంపై వారికి తోడుగా నిలవాలి.
►బ్యాంకర్లతో మాట్లాడి వారికి రుణాలు వచ్చేలా కృషిచేయాలి.
►ఆర్బీకేలలో, కమ్యూనిటి హైరింగ్ సెంటర్లలో పశుపోషణకు సంబంధించిన పరికరాలను అందుబాటులో ఉంచాలి.
లంపీ వైరస్‌పై ముందు జాగ్రత్త చర్యలు
►జంతువుల్లో లంపీ వైరస్ వ్యాపిస్తుందన్న సమాచారం వస్తోంది
►దీనిపై పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలి.
►వైరస్ జంతువులకు వ్యాపించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి.
►సరిపడా మందులను, వ్యాక్సిన్లను అందుబాటులో ఉంచాలి.
ఈ సమావేశంలో పశు సంవర్ధక, పాడి అభివృద్ది, మత్స్య శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, అగ్రి మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, పశు సంవర్ధక శాఖ స్పెషల్ సీఎస్ డాక్టర్ పూనం మాలకొండయ్య, ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి చిరంజీవి చౌదరి, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ ఆర్. అమరేంద్ర కుమార్, ఆ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment