సాక్షి, అమరావతి: ఏపీ తరహాలోనే దేశవ్యాప్తంగా జనరిక్ పశు ఔషధ కేంద్రాలను ఏర్పాటుచేయనున్నట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. మూగజీవాల ఆరోగ్య పరిరక్షణకు పెద్దపీట వేస్తూ అమలుచేస్తున్న సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వం ఇటీవలే వైఎస్సార్ పశు ఔషధ నేస్తం పథకానికి శ్రీకారం చుట్టింది.
పశు పోషకులకు నాణ్యమైన బ్రాండెడ్ మందులను కారుచౌకగా అందించడం ద్వారా వా రికి ఆర్థిక భారం తగ్గించడం, మరోవైపు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం ఈ పథకం ఉద్దేశం. అన్ని ప్రాథమిక పశు వైద్యశాలలు, పాలిక్లినిక్స్, డిస్పెన్సరీ ప్రాంగణాల్లో ఈ వైఎస్సార్ జనరిక్ పశు ఔషధ కేంద్రాలను ఏర్పాటుచేయాలని సంకల్పించి జనరిక్ మందుల తయారీదారులతో పశుసంవర్ధక శాఖ అవగాహనా ఒప్పందం చేసుకుంది.
విజయవాడలో తొలిసారిగా..
పైలెట్ ప్రాజెక్టుగా విజయవాడలోని పశుసంవర్థక శాఖ డైరెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో దేశంలోనే తొలి జనరిక్ పశు ఔషధ కేంద్రాన్ని ఈ ఏడాది మార్చి 23న రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. రూ.4.63 లక్షల అంచనా వ్యయంతో ఈ కేంద్రాలను ఏర్పాటుచేస్తుండగా, యూనిట్ కాస్ట్‌లో కేవలం 25 శాతాన్ని లబ్ది దారులు భరిస్తే చాలు.. రాష్ట్ర ప్రభుత్వం 75% సబ్సిడీని భరిస్తోంది. వీటి ద్వారా నిర్వాహకులతో పాటు కనీసం ముగ్గురు నుంచి నలుగురికి ఉపాధి లభిస్తుంది.
ఈ ఔట్‌లెట్లలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ధ్రువీకరించిన 70కు పైగా జీఎంపీ క్వాలిటీ బ్రాండెడ్ మందులను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటి ధరలు బహిరంగ మార్కెట్ ధరల కంటే 35–85% తక్కు వగా ఇక్కడ లభిస్తుండడంతో పశు పోషకులతో పాటు పెంపుడు జంతువులను పెంచుకునే వారి నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది.
ప్రతీరోజూ 300 మందికి పైగా వినియోగదారులు ఈ కేంద్రం సేవలను వినియో గించుకుంటుండగా, రోజుకు రూ.20 వేలకు పైగా అమ్మకాలు జరుగుతున్నాయి. పైలెట్ ప్రాజెక్టు విజ యవంతం కావడంతో మలివిడతలో రాష్ట్రవ్యాప్తంగా మరికొన్ని కేంద్రాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దశల వారీగా రూ.14.17 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 300 ప్రాథమిక పశు వైద్యశాల (పీవీసీ) ప్రాంగణాల్లో ఏర్పాటుచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.
ఇటీవల రాష్ట్రాల పశుసంవర్థక శాఖ మంత్రులతో జమ్మూకశ్మీర్‌లో నిర్వహించిన జాతీయ స్థాయి పశుసంవర్ధక శాఖ వర్కుషాపులో రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, డైరెక్టర్ డాక్టర్ రెడ్నం అమరేంద్రకుమార్‌లు ఏపీలో సీఎం జగన్ ఆలోచనల మేరకు పశుపోషకులకు ఆర్థిక భారం తగ్గించేందుకు దేశంలోనే తొలిసారి జనరిక్ పశుఔషధ కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నామని వివరించారు. రాష్ట్రస్థాయిలో వీటిని విస్తరించేందుకు ఆర్థిక చేయూతనివ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
సీఎం జగన్ కృషికి కేంద్ర బృందం కితాబు
సదస్సులో పాల్గొన్న కేంద్ర పశుసంవర్థక శాఖ మంత్రి పురుషోత్తమ్ రూపాలాతో పాటు కేంద్ర అధికారుల బృందం రాష్ట్ర ప్రభుత్వ కృషిని, సీఎం జగన్ చొరవను ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్ఫూర్తి తో దేశవ్యాప్తంగా ఏర్పాటుచేస్తే ఎలా ఉంటుందో పరిశీలించాలని అధికారులను కేంద్రమంత్రి ఆదేశించడమే కాక.. ప్రధాని దృష్టికి కూడా తీసుకెళ్లగా ఆ యన కూడా అంగీకారం తెలిపారు. దీంతో కేంద్ర బృందం శుక్రవారం మరోసారి భేటీ అయింది.
కేంద్రం ఆహ్వానంతో అమరేంద్రకుమార్ వైఎస్సార్ పశు ఔషధ నేస్తం పథకం లక్ష్యాలను వివరించారు. ఇదే తరహాలో దేశవ్యాప్తంగా ఏర్పాటుచేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో విధి విధానాల రూపకల్పనకు కేంద్రం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలో మలి విడతలో ఏర్పాటుచేయ తలపెట్టిన జనరిక్ పశు ఔషధ కేంద్రాలకు అవసరమైన ఆర్థిక చేయూతనిచ్చేందుకు అంగీకరించింది.
Comments
Please login to add a commentAdd a comment