ఐఎస్‌వో, ఎన్‌ఏబీఎల్ గుర్తింపు పొందిన కృష్ణా జిల్లా పెడనలోని డాక్టర్ వైఎస్సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి మరో అరుదైన గౌరవం దక్కింది. రాష్ట్రంలోని 60 డాక్టర్ వైఎస్సార్ పశు సంవర్ధక వ్యాధి నిర్ధారణ ప్రయోగశాలలకు ఒకేసారి ఎన్‌ఏబీఎల్ (నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు లిమిటెడ్) గుర్తింపుతో పాటు ఐఎస్‌ఒ (ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్) సర్టిఫికెట్ లభించింది. వీటి ద్వారా సేవల్లో నాణ్యత పెరగడంతో పాటు ధ్రువీకరించిన నాణ్యమైన ఇన్‌పుట్స్ అందించేందుకు వీలవుతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పాడి రైతులకు నాణ్యమైన సేవలే లక్ష్యంగా పశు సంవర్ధక శాఖ ప్రత్యేకంగా అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేట్ రిఫరల్ ల్యాబ్‌ను, డాక్టర్ వైఎస్సార్ పశు సంవర్ధక ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తోంది. ప్రాంతీయ స్థాయిలో 4, జిల్లా స్థాయిలో 10, నియోజకవర్గ స్థాయిలో 154 ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తోంది.
రాష్ట్రంలోని ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్‌కు అనుబంధంగా ఇవి పనిచేస్తాయి. దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే నియోజకవర్గ స్థాయిలో ఇటువంటి ల్యాబ్‌లు ఉన్నాయి. ఇటీవలే 65 ల్యాబ్‌లు అందుబాటులోకి వచ్చాయి. మిగిలినవి కూడా త్వరలో రానున్నాయి. వీటిలో 20 రకాల పరీక్షలు చేస్తారు. వీటిలో 60 ల్యాబ్‌లకు ఐఎస్‌ఒ–9001:2015 సర్టిఫికేషన్‌తో పాటు ఎన్‌ఏబీఎల్ గుర్తింపు కూడా లభించింది. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 11, కర్నూలులో 7, విశాఖ, ప్రకాశం జిల్లాల్లో ఆరేసి, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ఐదేసి, శ్రీకాకుళంలో 4, పశ్చిమ గోదావరి, వైఎస్సార్ జిల్లాల్లో రెండేసి, విజయనగరం, చిత్తూరు జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ల్యాబ్‌లకు ఈ గుర్తింపు లభించింది.
గుర్తింపుతో ప్రయోజనాలెన్నో..
ఈ గుర్తింపుతో ల్యాబ్‌ల సామర్థ్యం పెరుగుతుంది. మరింత నాణ్యమైన సేవలకు అవకాశం ఏర్పడుతుంది. ధ్రువీకరించిన నాణ్యమైన దాణాను అందించవచ్చు. పాడి రైతులకు సరఫరా చేసే ఇన్‌పుట్స్ నాణ్యతను పరీక్షించి, ధ్రువీకరణ పత్రాలు జారీ చేయొచ్చు. రాష్ట్రంతోపాటు దక్షిణ భారత దేశంలోని ఇతర రాష్ట్రాల పాడి రైతుల అవసరాలను తీర్చ గలిగే స్థాయికి మన ల్యాబ్‌ల సామర్థ్యం పెరుగుతుంది.
కేంద్ర కార్యదర్శి ప్రశంసలు
దేశంలో ఎక్కడా లేని విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో నియోజకవర్గ స్థాయిలో పశు సంవర్ధక వ్యాధి నిర్ధారణ కేంద్రాలను ఏర్పాటు చేశారని కేంద్ర పశు సంవర్ధక శాఖ కార్యదర్శి అతుల్ చతుర్వేది ప్రశంసించారు. ఒకేసారి 60 ల్యాబ్‌లకు ఐఎస్‌ఓ, ఎన్‌ఎబీఎల్ గుర్తింపు లభించిన సందర్భంగా రాష్ట్ర పశు సంవర్ధక శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్యతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారని అభినందించారు.
ముఖ్యమంత్రి కృషి ఫలితమే
నాణ్యమైన ఇన్‌పుట్స్ అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పం మేరకు వ్యవసాయ, పాడి, ఆక్వా రైతుల కోసం ప్రత్యేకంగా నియోజకవర్గ స్థాయిలో ల్యాబ్‌లున్న ఏకైక రాష్ట్రం మనదే. అంతర్జాతీయ ప్రమాణాలతో వీటిని ఏర్పాటు చేశాం. అత్యుత్తమ సేవలందిస్తున్నాం. ఒకేసారి 60 ల్యాబ్‌లకు ఐఎస్‌ఓ, ఎన్‌ఏబీఎల్ గుర్తింపు లభించడం ముఖ్యమంత్రి కృషి ఫలితమే. మిగిలిన ల్యాబ్‌లకు కూడా త్వరలోనే గుర్తింపు సాధించేందుకు కృషి చేస్తున్నాం.
– డాక్టర్ సీదిరి అప్పలరాజు, పశు సంవర్ధక శాఖ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment