నో బీ(ధీ)మా | no insurance to animals | Sakshi
Sakshi News home page

నో బీ(ధీ)మా

Published Thu, Nov 13 2014 3:41 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

no insurance to animals

ఆదిలాబాద్ అగ్రికల్చర్ : మేత కోసం బయటికి వదిలిన పశువులు సాయంత్రం వరకు ఇంటి వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే.. ఏ కరెంటు తీగనో.. ఏ అటవీ జంతువో వాటి పాలిట మృత్యుపాశాలవుతున్నాయి. ఫలితంగా రైతులకు తీరని నష్టం మిగులుతోంది. పశువులకు బీమా సౌకర్యం లేక ఆర్థిక ఇబ్బంది పడుతున్నాడు. ప్రభుత్వం గతేడాది మార్చి నుంచి ఈ ఏడాది
 మార్చి వరకు న్యూఇండియా ఇన్సూరెన్స్ కంపెనీతో చేసుకున్న గడువు ముగియడం.. ఏడు నెలలకు పైగా గడుస్తున్నా ప్రీమియం సౌకర్యం లేకపోవడంతో చనిపోయిన మూగజీవాలకు పరిహారం దక్కడం లేదు. ప్రభుత్వం  అగ్రిమెంట్ చేసుకుంది. ఈ గడువు కాస్త మార్చితో ముగిసింది.

 పశుసంవర్ధక శాఖ లెక్కల ప్రకారం జిల్లాలో 1,09,175 ఆవులు, ఎడ్లు, 3,36,654 పాడిగేదెలు, 6,95,110 గొర్రెలు, 5,88,303 మేకలు ఉన్నాయి. జిల్లాలో విద్యుత్‌ఘాతంతో, రోడ్డు ప్రమాదంలో, ఇతరత్రా కారణాలతో రోజుకు 2 నుంచి 5 వరకు ఏదో రకంగా ప్రమాదంలో మూగజీవాలు మృతిచెందుతూనే ఉన్నాయి. ఆరు నెలల్లో 230 వరకు పశువులు బలి అయ్యాయి. రెండు నెలల క్రితం భైంసా, కడెం మండల పరిధిలో ఐదు పశువులు మృతిచెందాయి.

ఈ నేపథ్యంలో బీమా చెల్లింపు గడువు ముగియడంతో రైతులు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోంది. మరికొందరికేమో అసలు బీమా సౌకర్యం గురించి అవగాహన లేకుండాపోయింది. గతేడాది న్యూఇండియా బీమా కంపెనీ వద్ద 1210 పశువులకు మాత్రమే బీమా చేయించారు. ఈ బీమా ఒక్క ఏడాదికి మాత్రమే రైతులు ప్రీమియం చెల్లించారు. దాంతో మృతిచెందిన 17 పశువులకు పరిహారం అందింది. ఈ ఏడాది ఇంతవరకు బీమా కంపెనీ ప్రభుత్వంతో కాంట్రాక్టు ఒప్పందం కుదుర్చుకోలేదు. ఇప్పటికే బీమా సౌకర్యం కోల్పోయి ఏడు నెలలకు పైగా అవుతోంది.

 ఏటా అవగాహన కరువు..
 జిల్లాలో 52 మండలాలకు గాను 101 పశుైవె ద్యశాలలు ఉన్నాయి. గ్రామాల్లోని చాలా మంది రైతులకు, పెంపకం దారులకు పశువుల బీమా సౌకర్యం అందుబాటులో ఉన్న విషయమే తెలీదు. గ్రామాల్లో పశుమిత్రలు, గోపాలమిత్రలు పనిచేస్తున్నా అవగాహన కల్పించిన దాఖలాలు లేవు. బీమా సంస్థలు చొరవ తీసుకోకపోవడం.. బీమా పరిహారం చెల్లింపుల్లో జాప్యంతో రైతులు కూడా ముందుకు రావడం లేదు.

 బీమా సౌకర్యం ఇలా..
 పశువులకు బీమా చేయించే రైతులు 50 శాతం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. మిగితా 50 శాతం ప్రభుత్వం భరిస్తుంది.  పాడి గేదెలు, ఆవులు, గేదేలు, మేకలు, గొర్రెలకు బీమా చేయించుకోవచ్చు. రూ.10 వేల విలువైన పశువుకు బీమా ఏడాదికి రూ.202.67 పైసలు, ప్రభుత్వం రూ.202.67 పైసలు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

ఒకేసారి మూడేళ్లకు బీమా చేయించే అవకాశం కూడా మూడేళ్లకు కలిపి రూ.516 చెల్లించాల్సి ఉంటుంది. పశువు బీమా చేయాలనుకుంటే మండల పశు వైద్యాధికారులను, పశుమిత్రలను, గోపాలమిత్రలను సంప్రదించాలి. వారు బీమా కంపెనీల వివరాలు ఇస్తారు. బీమా చేయించిన పశువు చెవికి ట్యాగ్ వేస్తారు. అది ఉంటేనే బీమా వర్తిస్తుంది. బీమా చేయించిన పశువును అమ్ముకోవాల్సి వస్తే పశు వైద్యాధికారికి సమాచారం అందించి ధ్రువీకరణ పత్రం పొంది బీమా కంపెనీకి సమాచారం ఇవ్వాలి.

అప్పుడు రూ.100 చెల్లించి కొనుగోలు చేసిన రైతు పేర  మార్చుకోవచ్చు. పశువులు, జీవాలు ప్రమాదవశాత్తు మృతిచెందినా.. ప్రకృతి వైపరీత్యాలతో.. వ్యాధులతో మరణించినా పెంపకం దారులకు పరిహారం అందుతుంది. ప్రమాదవశాత్తు మరణించిన రైతుకు కూడా రూ.50 వేల వరకు బీమా మొత్తం లభిస్తుంది. దీని కోసం అదనపు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు.

 నాలుగేళ్లలో బీమా చేసిన పశువులు.. అందిన పరిహారం
 సంవత్సరం       పశువులు          పరిహారం
 2010-2011     1,115             15
 2011-2012     1,047             13
 2012-2013     6,75              18
 2013-2014     1,210            17
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement