మేధా టవర్స్‌లోనే సచివాలయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర నూతన రాజధానిలో తాత్కాలిక సచివాలయాన్ని కృష్ణా జిల్లా గన్నవరంలోని మేధా టవర్స్‌లోనే ఏర్పాటు చేయాలని జవహర్‌రెడ్డి నేతృత్వంలోని రాజధాని తరలింపు కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. సచివాలయం అంతా ఒకే ఆవరణలో ఉండాలని పేర్కొంది. సచివాలయ విభాగాలు వేర్వేరు చోట్ల ఉంటే పరిపాలనకు విఘాతం కలుగుతుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఏపీ సచివాలయం 5.65 లక్షల చదరపు అడుగుల నిర్మాణ స్థలంలో ఉంది. మేధా టవర్స్ ప్రస్తుతం 1.75 లక్షల చదరపు అడుగుల నిర్మాణ స్థలంలో ఉంది. ఈ స్థలం సరిపోకపోతే మేధా టవర్స్ ఆవరణలో ఖాళీగా ఉన్న 30 ఎకరాల స్థలంలో తాత్కాలిక షెడ్లను నిర్మించి, అందులో సచివాలయ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని జవహర్‌రెడ్డి కమిటీ సూచించింది.
పోలీసు విభాగానికి సమస్య
ఇప్పటికే పాఠశాల విద్య, ఉన్నత విద్య, వ్యవసాయ, రెవెన్యూ, పశు సంవర్థక శాఖలు విజయవాడలో కార్యాలయ వసతులను చూసుకున్నాయి. పోలీసు విభాగానికి వసతి సమస్యగా తయారైంది. పోలీసు విభాగానికి భవనాల్లో వసతిని గుర్తిస్తామని, అయితే పోలీసుల శిక్షణకు గ్రౌండ్‌తోపాటు జాగిలాలకు అవసరమైన స్థలం, వసతిని గుర్తించడం తమ వల్ల కాదని జవహర్‌రెడ్డి కమిటీ స్పష్టం చేసింది. గొల్లపూడిలో మూతపడిన ఇంజనీరింగ్ కళాశాల భవనంలోకి వెళ్లాలని వాణిజ్య పన్నులు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, ఎక్సైజ్ విభాగాలు భావిస్తున్నాయి. అయితే, ఆ భవన పటిష్టతను పరిశీలించిన తరువాతే వెళ్లాలని జవహర్‌రెడ్డి కమిటీ సూచించింది. వైద్య ఆరోగ్యం, ఇరిగేషన్, రోడ్లు-భవనాలు, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖాధిపతులతో జవహర్‌రెడ్డి కమిటీ త్వరలో సమావేశం కానుంది.
స్కూళ్లలో అడ్మిషన్లు దొరుకుతాయా?
నూతన రాజధానిలోని తాత్కాలిక కార్యాలయాల్లో మార్పులు చేర్పులతోపాటు ఇతర సౌకర్యాల కల్పనకు రూ.100 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. తాత్కాలిక కార్యాలయాల అద్దె చెల్లింపునకు ఏడాదికి రూ.50 కోట్లు అవసరమని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మంత్రులు, అఖిల భారత సర్వీసు అధికారుల నివాస వసతిని రెయిన్ ట్రీ పార్కులో చూసింది. అయితే, నూతన రాజధానికి తరలి వెళ్లే ఉద్యోగులకు, ఇతర అధికారులకు మాత్రం నివాస వసతిని ప్రభుత్వం చూడబోదని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఉద్యోగులు, అధికారులు ఎవరి నివాస వసతిని వారే చూసుకోవాలని చెప్పారు. రాజధానికి తరలివెళ్తే వసతితోపాటు తమ పిల్లలందరికీ అక్కడి పాఠశాలల్లో ప్రవేశాలు దొరుకుతాయా? అని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఆచితూచి వ్యవహరిస్తున్న కేంద్రం
మరోవైపు గన్నవరంలోని మేధా టవర్స్‌ను ప్రత్యేక ఆర్థిక మండలి (ఎస్‌ఈజెడ్) పరిధి నుంచి డీ నోటిఫై చేసే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. ఇందుకు ప్రధాన కారణం తమిళనాడు సహా పలు రాష్ట్రాలు ఎస్‌ఈజెడ్‌ల నుంచి డీ నోటిఫికేషన్‌ను కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆచితూచి వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. మేధా టవర్స్‌ను ఎస్‌ఈజెడ్ పరిధి నుంచి డీ నోటిఫై చేస్తే మిగతా రాష్ట్రాలు కూడా ఇదే ప్రాతిపదికన డీ నోటిఫై కోసం పట్టుపడతాయనేది కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే మేధా టవర్స్ డీ నోటిఫై వ్యవహారంలో జాప్యం జరుగుతున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఎస్‌ఈజెడ్ పరిధిలో ఉన్న మేధా టవర్స్‌ను కేంద్రం టీనోటిఫై చేస్తేనే అందులో రాష్ట్ర సచివాలయాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది.