ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: దేశీయ ఆవుల పెంపకం, ఏ–2 పాల ఉత్పత్తి, మార్కెటింగ్‌ను ప్రోత్సహించే లక్ష్యంతో 58 స్వదేశీ ఆవుల పెంపక క్షేత్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటి ఏర్పాటుకు సంబంధించిన విధివిధానాలను పశుసంవర్ధక, డెయిరీల అభివృద్ధి, మత్స్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య సోమవారం రాత్రి విడుదల చేశారు.
ఏ–2 పాల ఉత్పత్తిని పెంచడమే లక్ష్యం
రాష్ట్రంలో 30.50 లక్షల మంది పాడిరైతులున్నారు. వారివద్ద 13,56,523 ఆవులు, 21,46,695 గేదెలు ఉన్నాయి. వీటి ద్వారా 4.12 కోట్ల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోంది. జెర్సీ, హెచ్‌ఎఫ్ జాతి పశువుల పాలను ఏ–1 మిల్క్ గా పిలుస్తారు. గిర్ (గుజరాత్), షాహివాలా (హరియాణా, పంజాబ్), ఒంగోలు జాతి పశువుల పాలను ఏ–2 మిల్క్‌గా పిలుస్తారు. క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధి నివారణకు ఎంతో ఉపయోగపడే ఏ–2 పాల ఉత్పత్తిని, వినియోగాన్ని పెంచడం, స్వదేశీ జాతులను సంరక్షించడం, తద్వారా సేంద్రియ సాగును ప్రోత్సహించడం లక్ష్యాలుగా ప్రభుత్వం ఈ క్షేత్రాలను ఏర్పాటు చేస్తోంది. ఎన్‌ఏఎఫ్‌సీసీ ప్రాజెక్టు కింద నెల్లూరు జిల్లా నార్త్ ఆములూరు, బిరదవోలు, విజయనగరం జిల్లా పెరిమి, వీరసాగరం, అనంతపురం జిల్లా గొట్లూరు, వెంకటరాజుకాలువ ప్రాంతాల్లో రూ.5.40 కోట్లతో 18 యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటికి లబి్ధదారులు రూ.7.50 లక్షలు భరించాలి. మిగిలిన రూ.22.50 లక్షల్ని ఎన్‌ఏఎఫ్‌సీసీ నుంచి సమకూరుస్తారు.
లబ్ధిదారుల ఎంపిక ఇలా..
ఈ క్షేత్రాలు ఏర్పాటు చేయదలిచిన రైతులు, ఔత్సాహికులకు షెడ్ నిర్మాణానికి సొంతంగా లేదా కౌలుకు తీసుకున్న 2.5 ఎకరాల భూమి ఉండాలి. జాయింట్ లయబులిటీ గ్రూపు (జేఎల్‌జీ)లకు ప్రాధాన్యతనిస్తారు. జిల్లాస్థాయి మానిటరింగ్ కమిటీ ద్వారా గ్రామసభల్లో అర్హులను ఎంపిక చేస్తారు. జాయింట్ కలెక్టర్ (ఆర్‌బీకే) చైర్మన్‌గా ఉండే ఈ కమిటీకి పశుసంవర్ధక శాఖ జేడీ మెంబర్ కన్వీనర్‌గా, నాబార్డు ఎజీఎం, లీడ్ బ్యాంక్ మేనేజర్, వ్యవసాయశాఖ జేడీ సభ్యులుగా ఉంటారు.
Comments
Please login to add a commentAdd a comment