
పశుసంవర్ధక శాఖకు పనేదీ?
బీవీపాళెం(తడ): బీవీపాళెం ఉమ్మడి తనిఖీ కేంద్రంలో ఉన్న ఏడు శాఖల్లో మిగిలిన ఆరు శాఖలకు అంతో ఇంతో పని ఉన్నా పశుసంవర్ధక శాఖకు మాత్రం ప్రస్తుతం ఎలాంటి పనులూ లేక నిరుపయోగంగా మారింది. ఇక్కడ ప్రధానంగా వాణిజ్య, రవాణా శాఖలు విధులు నిర్వర్తిస్తుండగా మైనింగ్, అటవీ శాఖల సేవలు కొంత వరకు అవసరం అవుతున్నాయి. ఎక్సైజ్, మార్కెటింగ్ శాఖలకు అప్పుడప్పుడు పనులు ఉంటుండగా పశుసంవర్ధక శాఖ మాత్రం తామూ ఉన్నామనేందుకు మినహా ఎలాంటి పనులకూ పనికిరావడం లేదు.
గతంలో అవసరం
గతంలో రాష్ట్రం నుంచి పొరుగు రాష్ట్రాలకు పశువులను తరలించే వాహనంలో దాణా, నీరు, గాలి వంటి సరైన వసతులు ఉన్నాయా? లేదా? అని పరిశీలించేవారు. పెద్ద లారీలో 10, 12 పశువులు మాత్రమే తరలించాల్సి ఉంటుంది. కానీ 25 నుంచి 30 వరకు పశువులను తీసుకువెళ్లడం జరుగుతుంది. దీనిని నివారించేందుకు కూడా తనిఖీలు అవసరమయ్యేవి. ఇక్కడి నుంచి వెళుతున్న పశువులకు వ్యాధులు ఉండి అవి ఇతర రాష్ట్రాల పశువులకు సోకకుండా ఉండేలా వ్యాక్సిన్ వేశారా? లేదా? అనే వివరాలను నమోదు చేశారు.
తగ్గిన రవాణా
ప్రస్తుతం పశువుల రవాణా తగ్గింది. గతంలో రోజుకు 70 నుంచి 80 లారీలు వస్తుండగా ప్రస్తుతం 20 నుంచి 25 లారీలు మాత్రమే కేరళ వెళుతున్నాయి. అవి కూడా నాయుడుపేట మీదుగా వెళుతుండటంతో ఒకటి, రెండు మాత్రమే చెక్‌పోస్టు మీదుగా వెళుతున్నాయి. ఏ వ్యాపారీ తగిన పత్రాలతో రాకపోవడంతో చెక్‌పోస్టు వద్ద తనిఖీలు, చిల్లర సమర్పణతోపాటు తమిళనాడులోనూ పోలీసులతో, ట్రాఫిక్‌తో తీవ్ర ఇబ్బంది నెలకొంటోంది. ఈ నేపథ్యంలో వ్యాపారులు రూటు మార్చి నాయుడపేట మీదుగా కేరళ చేరుకుంటున్నారు.
పాయింట్ మార్చితే ప్రయోజనం
చెక్‌పోస్టు మీదుగా రవాణా ఆగిన నేపథ్యంలో ఇక్కడ ఉన్న పాయింట్‌ను నాయుడుపేట సమీపంలోని పండ్లూరు గేటు వద్ద లేదా మనుబోలు వద్ద ఏర్పాటు చేస్తే ప్రయోజనం ఉంటుంది.