సాక్షి, హైదరాబాద్: టౌన్‌ప్లానింగ్, పశు సంవర్థక శాఖ పరిధిలోని వివిధ కేటగిరీల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఈవారం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) నిర్వహించాల్సిన అర్హత పరీక్షలు ఆకస్మికంగా వాయిదాపడ్డాయి. పరీక్షల నిర్వహణకు సంబంధించిన సమాచారం బయటకు పొక్కిందనే అనుమానంతో కమిషన్ ముందుజాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 12న రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. పరీక్ష నిర్వహణకు ముందే దానికి సంబంధించిన సమాచారాన్ని, పరీక్ష తీరును క్షుణ్ణంగా పరిశీలిస్తుంది.
ఈ క్రమంలో కమిషన్ అధికారుల కంటే ముందుగా ఈ వివరాలను ఎవరో పరిశీలించినట్లు అంచనాకు వచ్చారు. ఈ క్రమంలో ముందుజాగ్రత్తగా పరీక్షను వాయిదా వేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అభ్యర్థులకు సంక్షిప్త సమాచార రూపంలో రిజిస్టర్డ్ ఫోన్ నంబర్లకు ఆదివారంనాటి పరీక్ష రద్దు సమాచారాన్ని అందించినట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. దీంతోపాటు ఈ నెల 15, 16వ తేదీల్లో జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలను సైతం వాయిదా వేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. ఈ మేరకు శనివారం రాత్రి కమిషన్ ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది.
పోలీసు కేసు నమోదు
టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష నిర్వహణలో హ్యాకింగ్ జరిగినట్లు టీఎస్‌పీఎస్సీ అధికారులు అనుమానిస్తున్నారు. కమిషన్‌కు సంబంధించిన అత్యంత గోప్యతతో కూడిన ఫైళ్లు కంప్యూటర్‌లో తెరిచి ఉన్నట్లు అనుమానించిన అధికారులు తక్షణ చర్యల్లో భాగంగా పరీక్షను వాయిదా వేయడంతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదైంది. ఈ క్రమంలో పోలీసు అధికారులు, సైబర్ సెక్యూరిటీస్ విభాగం అధికారులతో కలిసి విచారణ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. పరీక్ష నిర్వహించిన తర్వాత సమస్య వెలుగు చూసే కంటే ముందస్తుగా దానిని వాయిదా వేయడం మంచిదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిషన్ అధికారులు చెబుతున్నారు.
అంతర్గత విచారణ షురూ
టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్షకు సంబంధించిన సమాచారం లీకైందనే అనుమానాలపై కమిషన్ అధికారులు అంతర్గత విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఓ సీనియర్ అధికారికి బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. మరోవైపు పోలీసులు సైతం ఈ అంశాన్ని సవాలుగా తీసుకున్నట్లు తెలిసింది. పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన తదితర అంశాల్లో దేశంలోనే ఆదర్శవంతంగా నిలిచిన టీఎస్‌పీఎస్సీలో ఇలాంటి అపశ్రుతులు రావడంతో పరపతి దెబ్బతింటుందనే భావనతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలనే సంకల్పంతోనే పరీక్షల వాయిదా వేసినట్లు ఓ అధికారి తెలిపారు.
టీఎస్‌పీఎస్సీ పరీక్షలు వాయిదా! హ్యాకింగ్ నేపథ్యంలో ఆకస్మిక నిర్ణయం
Published Sun, Mar 12 2023 2:15 AM | Last Updated on Sun, Mar 12 2023 3:15 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment