పాలలోని వెన్న శాతాన్ని బట్టి డెయిరీ నిర్వాహకులు ధరను నిర్ణయిస్తారు.
వర్గల్: పాలలోని వెన్న శాతాన్ని బట్టి డెయిరీ నిర్వాహకులు ధరను నిర్ణయిస్తారు. సాధారణంగా పాడి గేదెలతో (బర్రెలు) పోల్చినపుడు ఆవు పాలలో వెన్న శాతం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే బర్రె పాలకు ధర ఎక్కువగా ఉంటుంది. పాడి పశువుల మేతలో జాగ్రత్తలు తీసుకుంటే పాలలో సరైన వెన్న శాతం వస్తుందని వర్గల్ మండల పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ రమేష్‌బాబు, 9849457404 అన్నారు. అందుకోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు.
పశువుల మేతలో 30 నుంచి 50 శాతం పప్పుజాతి పశుగ్రాసాలు ఉండేలా చూడాలి. ఇందుకోసం పూతదశలో ఉన్న గ్రాసం వినియోగించాలి.
గ్రాసాన్ని పెద్ద సైజు ముక్కలుగా కోసి పశువులకు అందించాలి.
మేతలో పచ్చగడ్డితోపాటు ఎండు గడ్డి ఉండేలా చూసుకోవాలి. దీంతో నమలడం, నెమరు వేసే సమయం పెరిగి లాలాజలం వృద్ధిచెందుతుంది.
ఎండుగడ్డి ఎక్కువగా ఇవ్వాల్సివస్తే పత్తి చెక్కను రాత్రి నానపెట్టి ఉదయం అందించాలి. తద్వారా ప్రొటీన్లు బాగా లభ్యమవుతాయి.
కొబ్బరి, వేరుశెనగ, పొద్దుతిరుగుడు చెక్కతో వెన్న శాతం బాగా వృద్ధి చెందుతుంది.
దాణాను ఉదయం, సాయంత్రం రెండు సార్లు కాకుండా కొద్దికొద్దిగా రోజుకు 4,5 పర్యాయాలు ఇస్తే మంచి ఫలితం ఉంటుంది.