
ప్రభుత్వ ఉద్యోగిపై జనసేన నేత వీరంగం విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమంలో
ఆ పార్టీలోని ఇరు వర్గాల మధ్య ఘర్షణ
అడ్డువచ్చిన పంచాయతీ కార్యదర్శి విద్యాధర్‌పై బూతు పురాణం
కాలర్ పట్టుకుని లాగిన చలమలశెట్టి రమేష్
ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన కార్యదర్శి విద్యాధర్
రామవరప్పాడు: ‘ఒరేయ్.. తోలు తీస్తా, నువ్వు ఎవడవిరా మాకు చెప్పడానికి.. ఉద్యోగం నుంచి తీయించేస్తా, మా కింద పాలేరువి’ అంటూ జనసేన నేత చలమలశెట్టి రమేష్ ఎనికేపాడు పంచాయతీ కార్యదర్శి విద్యాధర్‌ను బూతులు తిట్టడం తీవ్ర దుమారం రేపింది. విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడు శివాలయం పల్లాల్లో ఏర్పాటు చేసిన వంగవీటి మోహన రంగా, మహత్మా గాంధీ విగ్రహాల ఆవిష్కరణలో మంగళవారం జనసేన నాయకులు రణరంగం సృష్టించారు.
ఈ విగ్రహాల ఆవిష్కరణకు హాజరైన చలమలశెట్టి రమేష్ రంకెలేస్తూ వీధి గూండా మాదిరి పంచాయతీ కార్యదర్శిని బూతులు తిట్టి, కాలర్ పట్టుకుని తొయ్యడం కలకలం రేపింది. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై ఈ రీతిగా చేయడాన్ని పలువురు గ్రామస్తులు ప్రశ్నించడంతో గొడవ కాస్తా పెద్దదైంది.
అసలు ఏం జరిగిందంటే..
ఇటీవల జనసేన పారీ్టలో చేరిన గ్రామానికి చెందిన టంకసాల సుబ్బారావు, ఆయన కుమారుడు ఉపసర్పంచ్ టంకసాల శివ ప్రసాద్ వంగవీటి మోహన్ రంగా, గాంధీ విగ్రహాల ఏర్పాటుకు పూనుకున్నారు. బీసీ నాయకుడైన జ్యోతిరావు పూలే విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని జనసేన మండల నాయకుడు పొదిలి దుర్గారావు సూచించారు.
అయితే టంకసాల సుబ్బారావు, టంకసాల శివప్రసాద్‌లు ఎవరికి సమాచారం ఇవ్వకుండా రాత్రికి రాత్రి రంగా, గాంధీ విగ్రహాల ఆవిష్కరణకు ఏర్పాట్లు చేశారు. ఈ విగ్రహాల ఆవిష్కరణకు నియోజకవర్గ జనసేన నేత చలమలశెట్టి రమేష్‌ను ఆహ్వనించారు. గ్రామంలోని జనసేన నాయకులకు గాని, పక్క గ్రామాల్లోని నాయకులు, కార్యకర్తలకు గాని సమాచారం ఇవ్వకుండా ఆవిష్కరణ పూర్తి చేశారు.
దీనిని జనసేన పార్టీలోని మరో వర్గం ప్రశ్నించడంతో ఘర్షణ ప్రారంభమైంది. రెండు వర్గాలు ఒకరినొకరు దూషించుకుంటూ తీవ్ర స్థాయిలో తోసుకున్నారు. ఈ గొడవ గురించి సమాచారం అందుకున్న పంచాయతీ కార్యదర్శి విద్యాధర్ ఘటనా స్థలానికి చేరుకుని సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించగా.. రెచ్చిపోయిన చలమలశెట్టి రమేష్ కార్యదర్శిపై విరుచుకుపడ్డారు. షర్టు కాలర్ పట్టుకొని దుర్భాషలాడారు.
బుజ్జగిస్తున్న కూటమి నాయకులు
గ్రామస్తుల మధ్య ప్రభుత్వ ఉద్యోగికి తీవ్ర అవమానం జరగడంతో కార్యదర్శి విద్యాధర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న కూటమి నాయకులు కలుగజేసుకుని బుజ్జగిస్తున్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని కేసుల వరకూ వెళ్ల వద్దని సముదాయించారు. దీంతో తనపై జరిగిన దాడిని వివరిస్తూ మండలాధికారులకు విద్యాధర్ ఫిర్యాదు చేశారు.