పచ్చిమేతతోనే పాడి
ఖమ్మం వ్యవసాయం: మన రాష్ట్రంలో పశుసంపదకు కావాల్సిన మేతలో మూడో వంతు మాత్రమే లభిస్తోంది. ఈ పశుగ్రాసం కొరత కారణంగానే పాల ఉత్పత్తి తక్కువగా ఉంది. రోజుకు ఒక పశువుకు 30 నుంచి 40 కిలోల పచ్చిమేత అవసరం. అంటే సంవత్సరానికి ఒక పశువు 10 నుంచి 14 టన్నుల పచ్చిమేత తింటుంది. పాడి రైతులకు ఇంత వరకు అనేక రకాలైన పశుగ్రాసాలు అందుబాటులో ఉన్నాయి.
కానీ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన సంకరజాతి పశుగ్రాసాల్లో ముఖ్యమైనవి ఒకటి షుగర్గ్రేజ్, రెండోది న్యూట్రిఫీడ్. ఈ రకాల పశుగ్రాసాలను ఇప్పటికే జిల్లాలోని మధిర, ఎర్రుపాలెం తదితర ప్రాంతాల్లో రైతులు సాగు చేస్తున్నారు. ఈ మేతనే పాడి పశువులకు మేపుతూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు.
షుగర్ గ్రేజ్
ఇది ఏక వార్షిక పశుగ్రాసం.
ఒక ఎకరానికి 4-5 కిలోలు పశుగ్రాసం విత్తనాలు వేసుకోవాలి.
షుగర్గ్రేజ్ వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది ఆరోగ్యకరమైన పిలకలు వస్తాయి. ఈ మేత విత్తనాలను 2-3 సెంటీమీటర్ల లోతులో విత్తుకోవాలి. సాలు నుంచి సాలుకు 30 సెంటీమీటర్ల నిడివి, మొక్క నుంచి మొక్కకు 25 సెం.మీ దూరం ఉండాలి.
ఇది నీటి ఎద్దడిని తట్టుకుని అధిక దిగుబడిని ఇచ్చే పంట. తేలికైన నేలల్లో 5-7 రోజుల్లో ఒక తడి, బరువు నేలల్లో 7-10 రోజుల్లో ఒక తడి పెట్టాలి.
అత్యధిక పశుగ్రాసం ఉత్పత్తి చేయడమే కాక కాండం మెత్తగా ఉండి చెరుకులాగా తీయగా రుచికరంగా ఉంటుంది. ఈ పశుగ్రాసం తీపిగా ఉండటం వల్ల పశువులు ఇష్టంగా తింటాయి. పశుగ్రాసం కూడా వృథా కాదు.
ఈ పశుగ్రాసాన్ని మేపడం వల్ల రోజుకు రెండు లీటర్ల పాలు పెరిగే అవకాశం ఉంది. జిల్లాలోని ఎర్రుపాలెం మండలానికి చెందిన రైతులు ఈ పశుగ్రాసాన్ని పెంచుతున్నారు. అధిక పాల ఉత్పత్తి సాధిస్తున్నారు.
పాతరగడ్డిగా కూడా షుగర్గ్రేజ్ను ఉపయోగించుకోవచ్చు.
న్యూట్రిఫీడ్
సజ్జ పశుగ్రాసం నుంచి అభివృద్ధి చేసిన సంకరజాతి గడ్డి రకం ఇది.
ఈ పశుగ్రాసంలో 14 నుంచి 16 శాతం మాంస కృత్తులు ఉంటాయి. అధికశక్తినిచ్చే ఖనిజ లవణాలనూ ఇది కలిగి ఉంటుంది.
ఈ పశుగ్రాసం మేపడం వల్ల గేదె, పాడిపశువులలో పాల ఉత్పత్తి, వెన్నశాతం పెరుగుతుంది.
ఒక ఎకరానికి 3 కిలోల విత్తనాలు సరిపోతాయి. బోదెలు తోలి బోదెల్లో ఈ విత్తనాలు విత్తుకోవడం మంచిది. ఈ విధానం వల్ల అధిక పశుగ్రాసం పొందవచ్చు.
బహువార్షిక పశుగ్రాసం విత్తితే 70-80 రోజులకు మొదటి కోత వస్తుంది. తర్వాత నత్రజని ఎరువులు, నీరు పెట్టడం వల్ల రెండో కోతను 40-45రోజుల్లో పొందవచ్చు. ఆరుతడులు ఇవ్వడం వల్ల చాలా కోతలకు అవకాశం ఉంది.
ఈ రెండు రకాల పశుగ్రాస విత్తనాలను పశుసంవర్థకశాఖ 75 శాతం సబ్సిడీపై రైతులకు అందజేస్తోంది.