Milk yield
-
పాడి రంగానికీ ఆర్బీకేల దన్ను
అనకాపల్లి జిల్లా మునగపాక గ్రామానికి చెందిన ఇతడి పేరు ఉయ్యూరు రామనరేష్. రెండు గేదెలు, రెండు ఆవులున్నాయి. గతంలో మార్కెట్లో దొరికే నాసిరకం దాణా వినియోగించటం వల్ల ఆశించిన స్థాయిలో పాల దిగుబడి వచ్చేది కాదు. పైగా పశువులు తరచూ అనారోగ్యం బారిన పడేవి. దీంతో ఆర్బీకేల ద్వారా ఇస్తున్న నాణ్యమైన సంపూర్ణ మిశ్రమ దాణా (టీఎంఆర్) తీసుకోవడం మొదలుపెట్టాడు. అప్పుడు అతడి పశువులు రోజుకు 1–2 లీటర్ల పాలను అధికంగా ఇస్తున్నాయి. ఆ పాలలో వెన్న శాతం కూడా పెరగడంతో మంచి ఆదాయం వస్తోందని, తానిప్పటి వరకు కిలో రూ.6.50 చొప్పున 200 కిలోల టీఎంఆర్ తీసుకున్నానని రామనరేష్ ఆనందంతో చెబుతున్నారు. సాక్షి, అమరావతి: పాడి పశువులకు నాణ్యమైన పశుగ్రాసం, దాణా అందిస్తే అధిక దిగుబడితోపాటు నాణ్యమైన పాలను ఇస్తాయి. మరోవైపు రోగాల బారిన పడకుండా సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటాయి. నాణ్యమైన పాల దిగుబడి వస్తే పాడి రైతుల ఆదాయానికి ఢోకా ఉండదు. ఇన్నాళ్లూ పశుగ్రాసం, దాణా కోసం పాడి రైతులు పాట్లు పడేవారు. వాటికి చెక్ పెడుతూ ఏడాదిగా ఆర్బీకేల ద్వారా పంపిణీ చేస్తున్న పశుగ్రాసం విత్తనాలు, సంపూర్ణ మిశ్రమ దాణా (టీఎంఆర్), నాణ్యమైన ఖనిజ లవణ మిశ్రమాలు, లివర్ టానిక్స్ తదితర పోషక మిశ్రమాలతోపాటు గడ్డి కత్తిరించే యంత్రాలు (చాప్ కట్టర్స్) వంటి వాటిని సబ్సిడీపై ఇస్తుండటంతో రైతుల వెతలు తీరుతున్నాయి. ఇందుకోసం పశు సంవర్ధక శాఖ 11ఏజెన్సీలతో ఒప్పందం చేసుకుంది. సర్టిఫై చేసిన పశుగ్రాసం.. సంపూర్ణ మిశ్రమ దాణా పశుగ్రాసం కొరతకు చెక్ పెట్టేందుకు ఆర్బీకేల ద్వారా సర్టిఫై చేసిన నాణ్యమైన జొన్న (సీఎస్హెచ్–24 ఎంఎఫ్ రకం), మొక్కజొన్న (ఆఫ్రికన్ టాల్ రకం) పశుగ్రాస విత్తనాలను 75 శాతం రాయితీపై ప్రభుత్వం అందిస్తోంది. ఏడాదిలో 1.41 లక్షల మంది రైతులకు రూ.15.81 కోట్ల విలువైన 1,500 టన్నుల జొన్న, 489 టన్నుల మొక్కజొన్న పశుగ్రాస విత్తనాలు సరఫరా చేసింది. వీటిని 1,05,531 ఎకరాల్లో సాగు చేయడం ద్వారా 4.21 లక్షల మెట్రిక్ టన్నుల పశుగ్రాసాన్ని రైతులు ఉత్పత్తి చేసుకుని పశుగ్రాసం కొరతను అధిగమించారు. మరోవైపు అత్యంత పోషక విలువలు గల సంపూర్ణ మిశ్రమ దాణాæ(టీఎంఆర్)ను సైతం ఆర్బీకేల ద్వారా అందిస్తోంది. దీనిని వాడటం వల్ల పశువులకు పచ్చిగడ్డి, ఎండుగడ్డి, ఇతర దాణాలేవీ పెట్టాల్సిన అవసరం ఉండదు. సర్టిఫై చేసిన మిశ్రమ దాణా కిలో రూ.15.80 కాగా.. రైతులకు సబ్సిడీపై రూ.6.50కే ప్రభుత్వం సరఫరా చేస్తోంది. ప్రతి పాడి రైతుకు రెండు నెలలకు ఒకసారి 60 శాతం సబ్సిడీపై గరిష్టంగా 1,800 కిలోల చొప్పున ఇస్తోంది. ఇప్పటివరకు రూ.29.43 కోట్ల విలువైన 18,625 మెట్రిక్ టన్నుల టీఎంఆర్ దాణాను 46,563 మంది రైతులకు పంపిణీ చేసింది. మరోవైపు పశుగ్రాసం వృథాను అరికట్టేందుకు ఆర్బీకేల ద్వారా 40 శాతం రాయితీపై గడ్డి కత్తిరించే యంత్రాలు అందిస్తోంది. 2 హెచ్‌పీ 3 బ్లేడ్ చాప్ కట్టర్ ఖరీదు రూ.33,970 కాగా, సబ్సిడీ పోనూ రూ.20,382కే ఇస్తోంది. ఇప్పటివరకు రూ.4.52 కోట్ల విలువైన 2,173 చాప్ కట్టర్స్‌ను ఆర్బీకేల ద్వారా ప్రభుత్వం పంపిణీ చేసింది. 3 టన్నుల టీఎంఆర్ తీసుకున్నా గతంలో నాణ్యమైన దాణా దొరక్క చాలా ఇబ్బంది పడేవాళ్లం. ఆర్బీకే ద్వారా ఇప్పటివరకు 3 టన్నుల టీఎంఆర్ తీసుకున్నా. బుక్ చేసుకున్న వారం లోపే అందిస్తున్నారు. దీని వినియోగంతో పాల దిగుబడి, నాణ్యత కూడా పెరిగింది. – పద్మజా భాను, దేవికొక్కిరపల్లి, యలమంచిలి పశుగ్రాసం వృథా కావడం లేదు నాకు 12 గేదెలు, 3 ఆవులు, 4 దూడలు ఉన్నాయి. మాది కరువు ప్రాంతం కావడంతో పశుగ్రాసం కొరత ఎక్కువ. దూరప్రాంతాల నుంచి పశుగ్రాసం తెచ్చుకున్నా చాలావరకు వృథా అయ్యేది. 2 హెచ్‌పీ సామర్థ్యం గల చాప్ కట్టర్ కోసం ఆర్బీకేలో బుక్ చేశా. దీన్ని ఉపయోగించడం వల్ల పశుగ్రాసం వృథా కావడం లేదు. – డి.మోహన్‌దాస్, వీరుపాపురం, కర్నూలు జిల్లా ఆర్బీకేల ద్వారా సర్టిఫై చేసిన ఇన్పుట్స్ సరఫరా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయం మేరకు ఆర్బీకేల ద్వారా నాణ్యమైన, సర్టిఫై చేసిన పశుగ్రాసం విత్తనాలు, సంపూర్ణ మిశ్రమ దాణా, ఖనిజ లవణ మిశ్రమాలతో పాటు గడ్డి కత్తిరించే యంత్రాలు సబ్సిడీపై అందిస్తున్నాం. వీటివల్ల పాడి రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. పాల దిగుబడితో పాటు నాణ్యత కూడా పెరిగిందని రైతులు చెబుతున్నారు. – ఆర్.అమరేంద్రకుమార్, డైరెక్టర్, పశు సంవర్ధక శాఖ -
వరి గడ్డిని సుపోషకం చేయటం ఎలా?
తెలుగు రాష్ట్రాల్లో వరి గడ్డి ప్రధానమైన పశుగ్రాసం వరి గడ్డిని ఎండబెట్టి వాముగా వేసి వేసవిలో పశువుల మేతగా వాడుట సహజం. కానీ వరి గడ్డి పోషక పదార్థాల రీత్యా పాల దిగుబడికి అంత దోహదకారి కాదు. అంతేకాక వరి గడ్డిలో పశువు శరీరంలో ఉండే ముఖ్యమైన లవణ ధాతువు కాల్షియంను నష్టపరిచే లక్షణం ఉంది. వరి గడ్డిలో మాంసకృత్తులు లేవు. జీర్ణమవదగ్గ ఆహార పదార్థాలు కేవలం 45% ఉన్నాయి. కాబట్టి వరిగడ్డిని సుపోషకం చేయటం అవసరం. వరి గడ్డిని సుపోషకం చేయడానికి యూరియాని వాడుతారు. ఈ పద్ధతిని ‘యుటిపిఎస్’ అని కూడా అంటారు. వరి గడ్డిని యూరియాతో సుపోషకం చేసే పద్ధతి: ఒక రోజుకు ఒక పాడి పశువుకు 6 కేజీల సుపోషకం చేసిన వరి గడ్డిని ఆహారంగా ఇవ్వవచ్చు. దీని ప్రకారం ఒక పశువుకు ఒక వారానికి దాదాపు 50 కేజీల సుపోషకం చేసిన వరి గడ్డి అసవరమవుతుంది. రెండు పద్ధతులతో వరి గడ్డిని యూరియాతో సుపోషకం చేయవచ్చు. 100 కిలోల వరి గడ్డికి, 4 కిలోల యూరియా 60 లీటర్ల నీళ్లు అవసరమవుతాయి. మొదట యూరియాను నీళ్లలో బాగా కరిగేటట్లు చూడాలి. తరువాత వరి గడ్డిని నేల మీద పరచి యూరియా కరిగిన నీళ్లను గడ్డిపై పూర్తిగా తడిచేలా చల్లాలి. తరువాత యూరియా నీటితో తడిపిన గడ్డిని పాతర గోతిలో గాని, యూరియా బస్తాలలలో గాని లేదా ప్లాస్టిక్ షీట్‌తో గానీ గాలి చొరబడకుండా జాగ్రత్తగా భద్రపరచి వారం రోజుల పాటు మాగనిస్తే వరి గడ్డి వాడకానికి సిద్ధం అవుతుంది. వరి గడ్డిని సుపోషకం చేయడం వల్ల లాభాలు: 1 వరి గడ్డిలో ఉండే పీచు పదార్థం తగ్గి పశువులు ఎక్కువ మేతను తినగలవు, జీర్ణం చేసుకోవడం కూడా సులభం. 2 ఈ పద్ధతిలో వరి గడ్డిలో మాంసకృత్తులను 0 నుంచి 5% పెంచవచ్చు. 3 వరి గడ్డిలో ఉండే జీర్ణమవదగ్గ ఆహార పదార్థాలు 45% నుంచి 60% పెరుగుతాయి. 4 ఎండు వరి గడ్డిలో తేమ శాతం 10% ఉండి తినడానికి ఇబ్బంది ఉంటుంది. సుపోషకం చేయడం వలన తేమను 45–50% పెంచవచ్చు. 5 యూరియాతో సుపోషకం చేయటం వలన తక్కువ ఖర్చుతో మాంసకృత్తులను పొందవచ్చు. 6 ఈ పద్ధతి పాడి రైతులు అమలు చేయడానికి అనువైనది, సులభమైనది. 7 సుపోషకం చేయబడిన గడ్డి రంగు ముదురు గోధుమ రంగుగా మారి కొద్దిగా అమ్మోనియా వాసన వస్తుంది. ఈ గడ్డి వాడకం వలన పొల ఉత్పత్తి, పని చేసే శక్తి పెరుగుతాయి. కొన్ని పశువులు మొదట ఈ గడ్డిని తినడానికి ఇష్టపడకపోవచ్చు. అటువంటి వాటికి కొద్దికొద్దిగా మేపి అలవాటు చేయాలి. పశుపోషణలో పచ్చిమేత, దాణా ఎంత ముఖ్యమో.. వాటి ద్వారా ఖనిజ లవణాల లభ్యత కూడా అంతే ముఖ్యం. అంతేగాక పాడి పశువుల పాల ఉత్పత్తి స్థాయితో పాటు వాటి శరీర కార్యక్రమాలను నిర్వర్తిస్తూ నష్టాలను భర్తీ చేసుకుంటూ ఆరోగ్యవంతంగా ఉండడానికి అవసరమైనంత ఖనిజ లవణాలను అందించడం కూడా అంతే ముఖ్యం. -
డాక్టర్ లక్ష్మరెడ్డికి పదోన్నతి
పశుసంవర్ధక శాఖ రాష్ట్ర అదనపు సంచాలకుడిగా నియామకం జిల్లా జేడీగా విక్రంకుమార్.. ఉత్తర్వులు జారీ సాక్షి, సంగారెడ్డి: జిల్లా పశుసంవర్ధకశాఖ జాయింట్ డైరెక్టర్ వి.లక్ష్మారెడ్డికి ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఆయనను ఆ శాఖ రాష్ట్ర అదనపు సంచాలకులుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో వరంగల్ జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ విక్రంకుమార్ను జిల్లాకు బదిలీ చేసింది. ఈక్రమంలో లక్ష్మారెడ్డి వచ్చేవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. జిల్లాలో పాల దిగుబడి పెంచేందుకు కృషి చేయటంతో పాటు కరువు కాలంలో పశువులకు మేత సమస్య రాకుండా లక్ష్మారెడ్డి అవసరమైన చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా గోపాలమిత్ర సేవలను విస్తరింపజేసేందుకు కృషి చేశారు. తన సేవలను గుర్తించి ప్రభుత్వం పదోన్నతి కల్పించటం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. -
పాడి రైతుకు బాసట మొలక గడ్డి మూట!
ఇంటి దగ్గరే ట్రేలలో మొలక గడ్డిని పెంచుకోవచ్చు.. పాడి పశువులతోపాటు గొర్రెలకూ మేపొచ్చు మొక్కజొన్నలతో 8 రోజుల్లోనే పుష్టికరమైన మొలక గడ్డిని పెంచొచ్చు 15-20% వరకు పెరిగిన పాల దిగుబడి.. పాడి రైతులకు వరప్రసాదంగా మారిన మహబూబ్‌నగర్ పశుసంవర్థక శాఖ అధికారుల కృషి చిన్న, సన్నకారు రైతుల్లో చాలా మందికి పంటల ద్వారా కన్నా పాడి ద్వారానే అధిక నికరాదాయం వస్తున్న మాట వాస్తవం. అటువంటి పాడికి ఆధారం పచ్చిమేత. పశువులకు సంపూర్ణ ఆహారం అందించాలంటే పచ్చిమేత తప్పనిసరి. ఏడాదిలో 365 రోజులూ పచ్చిమేతను పాడి పశువులకు అందించడం చాలా వ్యయప్రయాసలతో కూడుకున్న పని. నేల, కూలీల కొరతకు కరువు తోడవడంతో పాడి రైతులు నానా కష్టాలు పడుతున్నారు. ఈ సమస్యలన్నిటికీ ఏకైక పరిష్కారం ‘మొలక గడ్డి’ సాగు! మొలక గడ్డిని తక్కువ ఖర్చుతో ఇంటి దగ్గరే సులభంగా పెంచుకునే పద్ధతిని మహబూబ్‌నగర్ పశుసంవర్థక శాఖ అధికారులు రైతులకు అందుబాటులోకి తెచ్చారు. దీంతో మొలకగడ్డిని నిక్షేపంగా పెంచుకొని అధికాదాయం పొందవచ్చని రుజువు చేస్తున్నారు పలువురు పాడి రైతులు. విస్తారమైన నేల అవసరం లేకుండానే ఇంటిపట్టున ఏడాది పొడవునా నిశ్చింతగా పచ్చిమేత పెంచుకునే కొత్త పద్ధతి అందుబాటులోకి వచ్చింది. కరువు బారిన పడి విలవిల్లాడుతున్న పాడి రైతులకు సులువైన ప్రత్యామ్నాయం అందించే లక్ష్యంతో మహబూబ్‌నగర్ పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ కోనేటి వెంకట రమణ మొలక గడ్డి(హెడ్రోపోనిక్ ఫాడర్) పెంపకాన్ని తొలుత ప్రయోగాత్మకంగా చేపట్టి సత్ఫలితాలు సాధించారు. ఆ తర్వాత ఈ పద్ధతిని రైతులకు అందుబాటులోకి తెచ్చారు. భూమి లేని నిరుపేదలు కూడా తక్కువ ఖర్చుతో పచ్చిమేతను పండించుకోవచ్చు. కిలో గింజలతో 10-12 కిలోల మొలకగడ్డి బార్లీ, సజ్జ, మొక్కజొన్నలతో మొలకగడ్డిని పెంచవచ్చు. కిలో మొక్కజొన్నలతో ఒక ట్రేలో 9 రోజుల్లో 10-12 కిలోల మొలక గడ్డిని పెంచవచ్చు. ఒక్కో పశువుకు రోజుకు 10-15 కిలోల మొలక గడ్డిని అందించవచ్చు. ప్రతి పశువుకూ రోజూ ఈ గడ్డి అందుబాటులో ఉండాలంటే.. 9 ట్రేలను సమకూర్చుకొని రోజుకో ట్రేలో మొలక కట్టిన గింజలను ట్రేలో వత్తుగా ఉండేలా పోయాలి. తరచూ నీటితో తడుపుతూ ఉండాలి. 9 రోజులు గడిచేటప్పటికి మొదటి రోజు పెట్టిన ట్రేలో మొలక గడ్డి వాడకానికి సిద్ధమవుతుంది. ఎటువంటి ఎరువులూ వేయనక్కర్లేదు. గింజల్లోని పోషకాలతోనే గడ్డి పెరుగుతుంది. అత్యధికంగా పోషకాలు ఈ మొలక గడ్డి దాణాతో సమానం. సాధారణ పచ్చిమేతలో 7-10% ప్రొటీన్లుంటాయి. కానీ, మొలక గడ్డిలో 17.2% ప్రొటీన్లున్నాయి. 25.4% పీచుపదార్థంతోపాటు ఏ, ఈ విటమిన్లు.. కాల్షియం, భాస్వరం తదితర లవణాలు అధికంగా ఉన్నాయి. పాల దిగుబడి 20-30 శాతం పెరుగుతుంది. పశువులు ఆరోగ్యంగా ఉంటాయి. తొందరగా ఎదకు వస్తాయి. గ్రీన్ షేడ్ నెట్‌తో షెడ్ ఏర్పాటు ఇలా.. నలువైపులా గ్రీన్ షేడ్ నెట్‌ను కప్పిన గదిలో మొలక గడ్డిని పెంచాలి. మొదట చతురస్రాకారంలో కర్రలు, తడికలు లేదా కొబ్బరి మట్టల సహాయంతో ఒక గదిని నిర్మించాలి. ద్వారం కూడా ఏర్పాటు చేయాలి. వాటి చుట్టూ గ్రీన్‌షేడ్ నె ట్ను కప్పాలి. ఉష్ణోగ్రత 25-30 డిగ్రీల మధ్య, గాలిలో తేమ 60-65% ఉండేలా చూడడానికి ఇది అవసరం. 5 పాడి పశువులకు 6్ఠ6్ఠ12 అడుగుల షెడ్ నిర్మించాలి. కట్టెలతో షెడ్ వేయడానికి రూ. 1,500, గ్రీన్ షేడ్‌నెట్‌కు రూ. 500, పశువుకు 8 ట్రేల చొప్పున 40 ట్రేలు, నీటి సరఫరా పైపులకు కలిపి రూ. 8,000 చొప్పున మొత్తం రూ. 10 వేలు ఖర్చవుతుంది. 10 పాడి పశువులకు 12్ఠ12్ఠ12 అడుగుల షెడ్ నిర్మించాలి. 80 ట్రేలు కావాలి. మొత్తం ఖర్చు రూ. 20 వేలవుతుంది. నానబెట్టి మొలక కట్టాలి.. నాణ్యమైన మొక్కజొన్న విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. వీటిని ట్రేలో వేయడానికి ముందు 5 లీటర్ల నీటిలో 100 గ్రాముల సున్నం కలిపి అందులో 10 నిమిషాలు నానబెట్టి రెండు సార్లు శుద్ధి చేయాలి. తర్వాత మంచినీటిలో 24 గంటలపాటు నానబెట్టాలి. నానిన గింజలను గోనె సంచిలో మూటగట్టాలి. 24 గంటల తర్వాత గింజలను ట్రేలో వత్తుగా పోసి.. ట్రేను 50% గ్రీన్ షేడ్ నెట్ చుట్టిన గదిలో పెట్టాలి. ట్రేలో నీరు నిలబడకుండా అడుగున అక్కడక్కడా బెజ్జాలు పెట్టాలి. రోజుకు 8 సార్లు నీరు చల్లాలి 8 రోజుల పాటు 2-3 గంటలకోసారి రాత్రి పూట 3 సార్లు, పగలు 5 సార్లు ట్రేలలో గింజలను నీటితో తడపాలి. 5-10 పశువులున్న రైతులు రోజ్ క్యాన్ ద్వారా లేదా నాలాను ఏర్పాటు చేసుకొని బాత్రూమ్ షవర్ ద్వారా నీరందించవచ్చు. 10-100 పశువులున్న పెద్ద రైతులు 3/4 ఇంచుల పైపులతో మైక్రో స్ప్రింక్లర్ల ద్వారా నీరందించవచ్చు. 2 గంటలకోసారి నీటిని పిచికారీ చేసేలా టైమర్‌ను అమర్చుకోవచ్చు. ఎటువంటి ఎరువూ వేయనవసరం లేకుండానే మొలక గడ్డి పెరుగుతుంది. అయితే, గింజలు వేసిన 6,7 రోజుల్లో 1 లీటరు నీటిలో 20 గ్రాముల యూరియా కలిపి 2% ద్రావణాన్ని తయారు చేసి, ఆ రెండు రోజుల్లో రోజుకోసారి పిచికారీ చేస్తే అధిక మొలక గడ్డి దిగుబడి వస్తున్నదని గుర్తించామని డా. వెంకటరమణ తెలిపారు. విత్తనాలు వేసిన తొమ్మిదో రోజు మొలక గడ్డిని పశువులకు ఏ వేళల్లోనైనా మేపవచ్చు. మహబూబ్‌నగర్ పశుసంవర్థక శాఖ కార్యాలయం వద్ద ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన మొలక గడ్డి పెంపకం షెడ్డును చూసి స్ఫూర్తిని పొందిన 25 మంది రైతులు ఈ పద్ధతిని అనుసరిస్తూ అధికాదాయం పొందుతుండడం విశేషం. - బొక్కలంపల్లి మల్లేష్ మహబూబ్‌నగర్ వ్యవసాయం పాడి పశువులతోపాటు మేకలకూ మేపొచ్చు! కరువు కాలంలో పాడి రైతుల ఇబ్బందులు చూడలేక మొలక గడ్డిపై ప్రయోగాలు చేశా. మంచి ఫలితాలు రావడంతో రైతులకు నేర్పించా. ఇప్పటికి 25 మంది రైతులు పెంచుతున్నారు. 6-8 లీటర్ల పాలిచ్చే ఆవుకు లేదా 6 లీటర్ల పాలిచ్చే గేదెకు రోజుకు 10-15 కిలోల మొలకగడ్డి పెడితే.. ఇక దాణా అక్కర్లేదు. కొంత ఎండు మేత వేస్తే చాలు. పొలంలో పచ్చి గడ్డి 90 రోజులకు కోతకొస్తే.. మొలక గడ్డి 9వ రోజే చేతికొస్తుంది. పొలంలేని, కరెంటు లేని నిరుపేదలూ ఈ గడ్డిని పెంచుకొని పాడి పశువులను పోషించుకోవచ్చు. పొట్టేళ్లు, గొర్రెలకు రోజుకు కనీసం 2 కిలోల మొలక గడ్డి వేస్తే మంచిది. - డా. కోనేటి వెంకట రమణ, సంయుక్త సంచాలకులు, పశుసంవర్ధక శాఖ, మహబూబ్‌నగర్ 99899 97489, 77026 44456 jdahmbnr @gmail.com ఖర్చు తగ్గి, ఆదాయం పెరిగింది! నాకు ఎకరం పొలముంది. పచ్చిగడ్డి లేక కొన్ని గేదెలు అమ్ముకున్నా. ఇప్పుడున్న 12 గేదెల్లో5 పాలిస్తున్నాయి. డా. వెంకటరమణ చెబితే 2 నెలల నుంచి మొలక గడ్డి పెంచుతున్నా. గేదెకు ఒక పూట దాణా, మరో పూట 10 కిలోల మొలకగడ్డిని మేపుతున్నా. గేదెకు 2 లీటర్ల పాల దిగుబడి పెరిగింది. వారం నుంచే తేడా కనిపించింది. ఖర్చు తగ్గి, ఆదాయం పెరిగింది. - జిల్లెల వెంకటేష్ (9441542969, 9032138211), యువ రైతు, చిన్నదర్పల్లి, మహబూబ్‌నగర్ జిల్లా -
పాల దిగుబడిని పెంచుకోండిలా..!
సాధారణంగా 12 గంటల వ్యవధిలో పాలు పితుకుతుంటారు. చలికాలంలో పగటి సమయం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఉదయం 6 గంటలనుంచి 7 గంటల మధ్య, సాయంత్ర 4గంటల నుంచి 5గంటల మధ్య పాలు పితకడం మంచిది. శీతాకాలంలో పశువుల శరీర ఉష్ణోగ్రత తగ్గకుండా చూసుకోవాలి. అందుకోసం అదనపు ఆహారం అందజేయాలి. లేకపోతే పశువు మేత సరిగ్గా తినక పాల దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. పశువులకందించే దాణలో పిండి పదార్థాలు అధికంగా, మాంసకృతులు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. లూసర్న్వంటి పశుగ్రాసం సాగు చేపట్టి పశువులకు అందజేస్తే పాల దిగుబడి అధికంగా ఉంటుంది. వరికోతలు పూర్తవగానే మిగిలిఉన్న తేమతో జనుము వంటి పశుగ్రాసాలను సాగు చేసుకోవాలి. శీతాకాలంలో ఎక్కువగా పశువులకు ఎదకు వచ్చి పొర్లుతాయి. పశువులను కనీసం రెండుమూడు సార్లైన ముందుభాగం, వెనుక భాగం పరిశీలించాలి. వెనుక భాగం పరిశీలిస్తే మూగ ఎదలో ఉన్న పశువులను గుర్తించడానికి వీలవుతుంది. గత ఎద పూర్తయిన తర్వాత 16-25 రోజుల వ్యవధిలో పశువుల ప్రవర్తనలో మార్పులు గుర్తించాలి. పాల ఉత్పత్తిలో తగ్గుదలను బట్టి ఎదను గుర్తించాలి. వెంటనే వీర్యదానం చేయించాలి. చలిగాలులు, మంచుకురవడం వల్ల పశువులకు న్యూమోనియా సోకే ప్రమాదం ఉంటుంది. గొంతువాపు, గిట్టలు మెత్తబడటం, మేత తినకపోవడం తదితర సమస్యలు ఉత్పన్నమవుతాయి. పశువులను, దూడలను ఆరుబయట కట్టేయకూడదు. ఈదురు గాలులు నివారించడానికి వాతవరణంలో ఉష్ణాగ్రత 10 డిగ్రీల కంటే తక్కువైన సందర్భాల్లో పశువుల పాకలకు పరదాలు కట్టాలి. లేగదూడల వెంట్రుకలు చలికాలంలో కత్తిరించకూడదు. రోజూ రెండుసార్లు పశువుల పాకలను శుభ్రం చేయాలి. సోడా, కార్బోనెట్, 10 శాతం బ్లీచింగ్ పౌడరు వంటి క్రిమి సంహారక మందులు వాడాలి. నీటి తొట్టెలను వారానికోసారి శుభ్రం చేయాలి. వాటికి తరచూ సున్నం వేస్తుండటం మరవద్దు. దీంతో పశువులకు కావాల్సినంత కాల్షియం, ఖనిజ లవణాలు లభ్యమవుతాయి. పశువులకు రోజుకు 50 నుంచి 60 లీటర్ల నీరు అవసరం. శీతాకాలంలో రెండుమూడు సార్లు నీరు అందజేయాలి. తాగేందుకు నీరు పుష్కలంగా అందిస్తే పాల దిగుబడి బాగుంటుంది. పాలు పితకడానికి రెండు గంటల ముందు, పితికిన తర్వాత మరో గంటకు పశువులకు దాణ ఇవ్వాలి. -
పాల దిగుబడిపై వ్యాధుల ప్రభావం
ఒంగోలు టూటౌన్ : ‘వాతావరణాన్ని బట్టి పశువులకు వ్యాధులు సోకుతుంటాయి. వ్యాధుల ప్రభావం పాల దిగుబడిపై పడుతుంది. దుక్కులు దున్నే పశువులు పని సామర్థ్యం కోల్పోవడం, పెయ్యలు ఎదకు రాకపోవడం లాంటి నష్టాలు వాటిల్లుతుంటాయి. వ్యాధులను సకాలంలో గుర్తించి, వైద్యం అందించకపోతే పశువులు చనిపోయే ప్రమాదం ఉంద’ని ఒంగోలు పశువైద్యాధికారి సురేంద్రప్రసాద్ తెలిపారు. రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో పశువులను పరిశీలించడం ద్వారా పశువుల అనారోగ్య సమస్యలు, ఎద లక్షణాలు గమనించవచ్చని చెప్పారు. అనారోగ్య లక్షణాలను గుర్తించడం ఇలా.. పశువులు నిలబడటం, కదలిక, ప్రవర్తనలో మార్పులు కనపడతాయి. యజమాని పిలిచినా స్పందించవు. పశువు నిలబడినప్పుడు వంగిపోయినట్లు, తలను నేలకు ఆనించి ఉంటాయి. నడకలో నెమ్మది ఉంటుంది. మేత, నీరు సక్రమంగా తీసుకోవు. నెమరు వేయవు. నోటి నుంచి సొంగ కారుతుంది. చర్మం సున్నితత్వాన్ని కోల్పోతుంది. వెంట్రుకలు (రోమాలు) పైకి లేస్తాయి. జ్వరం ఉంటుంది. ముట్టె తడారిపోయి, పొడిగా ఉంటుంది. శ్వాస వేగంగా లేదా కష్టంగా ఉంటుంది. నాడి వేగంగా కొట్టుకొంటుంది. కళ్లు ఎర్రబడి నీరు కారుతుంది. పుసులు వస్తాయి. పేడ పలుచగా లేదా గట్టిగా, రక్తంతో, జిగురుగా, నల్లగా ఉంటుంది. మూత్రం చిక్కగా, తక్కువ పరిమాణంలో, రంగుమారి, వాసనతో వస్తుంది. వ్యాధుల రకాలు వైరస్ ద్వారా గాలికుంటు, శ్వాసకోశ, మెదడువాపు, మశూచి, తలవాపు లాంటి వ్యాధులు వస్తాయి. నూతన కాంగో వైరస్ జ్వరం పొంచి ఉంది. సూక్ష్మజీవుల ద్వారా గొంతువాపు, జబ్బవాపు, దొమ్మ, బ్రూసెల్లోసీస్, లెప్టోస్పైరోసిస్ లాంటి వ్యాధులు వ్యాపిస్తాయి. పరాన్న జీవుల ద్వారా కుందేటి వెర్రి, బేబీ సియోసిస్, మైక్రోఫైలేరియా, కాలేయవుజలగ, జీర్ణాశయపు జలగ, మూగబంతి, తదిరర వ్యాధులు సోకుతాయి. జీర్ణక్రియలో లోపాల వల్ల పాలజ్వరం,పొదుగు వాపు, పడకజబ్బు, కిటోసిస్ వ్యాధులు వస్తాయి. ఈ వ్యాధులను సకాలంలో గుర్తించి పశువైద్యాధికారులను సంప్రదించడం ద్వారా నష్టాన్ని నివారించవచ్చు. -
లాభాల పాడి
లక్సెట్టిపేట : పాల ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉంది. దేశ జనాభా సుమారు 125 కోట్లు ఉంటే ప్రస్తుత పాల సగటు తలసరి వినియోగం 235 గ్రాములు మాత్రమే కావడం గమనార్హం. న్యూట్రిషనిస్టుల సూచనల ప్రకారం సగటు తలసరి వినియోగం రోజుకు 250 గ్రాముల పైనే ఉండాలని మండల పశువైద్యాధికారి శ్రీనివాస్ వివరించారు. ప్రస్తుతం దేశంలో పాల దిగుబడి 110మిలియన్ టన్నులు.. ఐదు శాతం వృద్ధి రేటుతో 2020వ సంవత్సరానికి మిలియన్ టన్నుల పాల ఉత్పత్తి పెరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి అధిక పాల దిగుబడికి ఎక్కువ పాలసార కలిగిన శ్రేష్టమైన జాతి పశువులు అవసరం. మనకున్న పశువుల్లో ఎక్కువ శాతం తక్కువ పాలసార ఉన్న నాటి జాతి పశువులు. కావున వీటిలో అధిక దిగుబడి ఆశించడం అసాధ్యం. దేశవాలి పశువుల స్థానంలో శ్రేష్టమైన జాతుల్ని పెంపొందించుకుని పోషించాల్సిన అవసరం ఉంది. రైతులు ముర్రాజాతి గేదెలను పెంచుకుంటే అధిక పాల దిగుబడితోపాటు ఆర్థికాభివృద్ధి సాధించవచ్చు. ముర్రాజాతి గేదెలను పొందే విధానం ముర్రాజాతి గేదెలను గ్రామీణ ప్రాంతాల్లో గౌడిగేదెలు అని కూడా పిలుస్తారు. కృత్రిమ గర్భోత్పత్తి విధానం ద్వారా మన దేశవాళి గేదెల నుంచి గ్రేడీడ్ ముర్రాజతి దూడలను పొందవచ్చు. పిండమార్పిడి ప్రక్రియ ద్వారా కూడా పొందవచ్చు. పశుక్రాంతి పథకం ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవచ్చు. ఈ మూడింటిలో ప్రస్తుతం కృత్రిమ గర్భోత్పత్తి, పశుక్రాంతి పథకం ద్వారా సులభంగా పొందవచ్చు. లాభాలు.. ముర్రా అంటే మెలివేయబడిన అని అర్థం. వీటి కొమ్ములు మెలివేయబడి పొట్టిగా ఉండి గట్టిగా లోపలి వైపునకు స్పైరల్ ఆకారంలో తిరిగి ఉంటాయి. అందుకే వీటిని ముర్రా అని పిలుస్తారు. దేశంలోని జీవ జాతుల్లో అత్యంత శ్రేష్టమైనది. పాడికి, వెన్న శాతానికి పేరెన్నిక కలిగినది. దీని పుట్టినిల్లు హర్యానా రాష్ట్రం. దేశవాలి గేదె జాతుల నుంచి అధిక పాల దిగుబడిని పొందడానికి వాటిని అప్‌గ్రేడ్ చేయడానికి ముర్రాజాతి వీర్యాన్ని దేశమంతటా విరివిగా వినియోగిస్తారు. దేశవాళి గేదెల కంటే ఎక్కువ పాలు ఇస్తాయి. రోజుకు సుమారు 10 నుంచి 12 లీటర్ల వరకు పాలు ఇస్తాయి. పాల ఉత్పత్తి ఖర్చు తక్కువ, లాభాలు ఎక్కువ(వెన్న శాతం అధికంగా ఉండడం వల్ల, ఎక్కువ కాలం పాడితో ఉండడం వల్ల). వీటికి ఋతుక్రమం సరిగా ఉంటూ జీవిత కాలంలో ఎక్కువ ఈతలు ఈనడంతోపాటు దృఢమైన దూడలనిస్తాయి. దూడబరువు రోజువారీగా 400 నుంచి 500 గ్రాములు పెరుగుతూ త్వరగా ఎదకు వస్తాయి. పొందే విధానం.. ముర్రాజాతి గేదెకు ఒక్కో దానికి సుమారు రూ.50వేలు ఉంటుంది. రవాణా ఖర్చు సుమారు రూ.6,500 అవుతుంది. గేదె బీమాకు రూ.2వేలు చెల్లించాలి. గేదె ధరను బట్టి 4 నుంచి 5 శాతం వరకు బీమా లెక్కిస్తారు. బీమా చేయించడం వల్ల ప్రమాదవశాత్తు చనిపోతే యజమాని నష్టపోకుండా ఉంటారు. బీమా కంపెనీలు నేషనల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ యునెటైడ్ ఇండియా ఇన్య్సూరెన్స్ కంపెనీ న్యూ ఇండియా ఇన్స్యూరెన్స్ కంపెనీ బ్యాంకు రుణాలు.. యజమాని ఒక గేదెను కొనడానికి సుమారు రూ.60వేల వరకు పెట్టుబడి పెట్టాలి. కానీ అంత పెట్టుబడి పెట్టలేని వారి కోసం ప్రభుత్వం సాధారణ, మధ్య తరగతి రైతులకు ఇతర రాష్ట్రాల నుంచి ముర్రాజాతి గేదెలను దిగుమ తి చేసుకునే అవకాశాన్ని బ్యాంకు రుణాల ద్వారా కల్పిస్తోంది. గేదె ధరకు మార్జిన్ మనీ కింద 20శాతాన్ని చెల్లిం చాలి. మిగితా మొత్తం బ్యాంకు చెల్లించి గేదెను దిగుమతి చేస్తుంది. ఇందులో సుమారు 25 నుంచి 50శాతం వరకు సబ్సిడీ కూడా వర్తిస్తుంది. మధ్య తరగతి కుటుంబాలు ఒ కేసారి ఐదు నుంచి పది గేదెలతో మినీ డెయిరీ ఏర్పాటు చేసుకోవడానికి బ్యాంకు అధికారులను సంప్రదిస్తే వివరాలు తెలియజేస్తారు. గేదె చనిపోతే బీమా కంపెనీ పరి హారం అందజేస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర విభజన దృష్ట్యా ఇంకా ఎటువంటి సబ్సిడీ, రుణాల సమాచారం రాలేదు. -
‘వయ్యారిభామ’తో ముప్పు
కందుకూరు: పార్థీనియం కలుపు మొక్కను వయ్యారి భామ, అమెరికా అమ్మాయి, కాంగ్రెస్ గడ్డి, క్యారెట్ గడ్డి, నక్షత్రగడ్డి ఇలా వివిధ పేర్లతో పిలుస్తారు. ఇది మానవాళికి, పశువులకు హానికరమైన మొక్క. 1950 దశకంలో అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి మన దేశంలోకి ప్రవేశించి ఇక్కడా అక్కడా అనే తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ విస్తరించింది. ఇళ్ల మధ్య, వ్యవసాయ పొలాల్లో విస్తారంగా వయ్యారిభామ పెరగడంతో సాధారణ ప్రజలతో పాటు రైతులూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వయ్యారిభామ (పార్థీనియం) కలుపు మొక్కను సామాజిక ఆరోగ్య భద్రత దృష్ణ్యా సమర్థంగా నిర్మూలించడం ఎంతో అవసరమంటున్నారు జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు సీహెచ్ చిరంజీవి, పి.అమ్మాజీ, ఎన్ ప్రవీణ్. రైతులు ఈ మొక్కను నిర్మూలించేలా చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. నష్టాలు.. వయ్యారిభామ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటే నాలుగు వారాల్లో పుష్పించే దశకు చేరుకుంటుంది. ఒక్కో ఙమొక్క దాదాపు 10 వేల నుంచి 50 వేల వరకు విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది. హానికరమైన రసాయనాలతో ఉండే ఈ మొక్కలను జంతువులు తినలేకపోవడం, అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్ని తట్టుకునే వ్యవస్థ ఉండటంతో వయ్యారిభామ విస్తరించడానికి దోహదపడుతున్నాయి. ఈ మొక్క పంటలకే కాకుండా మనుషులకు, జంతువులకు హాని కలుగచేస్తుంది. పక్కన మొలిచే ఇతర మొక్కలపైన దీని రసాయన ప్రభావంపడి ఎదుగుదల తగ్గుతుంది. పొలాల్లో 40 శాతం వరకు, పశుగ్రాస పంటల్లో 90 శాతం వరకు దిగుబడి తగ్గిస్తుంది. దీంతో పాటు కొన్ని రకాల వైరస్‌లకు ఈ మొక్క ఆశ్రయమిస్తూ పంటలకు వ్యాప్తిచెందడానికి కారణమవుతోంది. ఈ మొక్కతో మనుషులకు డెర్మాటైటిస్ లేదా ఎగ్జిమా, హైఫీవర్, ఉబ్బసం వంటి వ్యాధులు వస్తాయి. పుష్పాల పొడి పీలిస్తే జలుబు, కండ్లు ఎర్రబడటం వంటి లక్షణాలు కలుగుతాయి. ఆకులు రాసుకుంటే తామర వంటి వ్యాధి సంభవిస్తుంది. పశువుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. పశువులు పొరపాటున గడ్డితో పాటు మేస్తే పాల దిగుబడి తగ్గడంతో పాటు వాటి వెంట్రుకలు రాలిపోవడం, హైపర్‌టెన్షన్‌కు గురవుతాయి. యాజమాన్య పద్ధతులు.. వయ్యారిభామ మొక్కను పూతకు రాకముందే పీకి తగులబెట్టడం లేదా కంపోస్ట్ తయారు చేయాలి. పంట మార్పిడి విధానాన్ని బంతి పంటతో చేయడంతో ఈ మొక్కల ఉద్ధృతిని తగ్గించవచ్చు. క్రైసోమిలిడ్ జాతికి చెందిన జైగోగ్రామ బైకొలరెటా అనే పెంకు పురుగులు ఈ మొక్కలను విపరీతంగా తిని ఈనెలు మాత్రమే వదిలిపెడతాయి. వయ్యారిభామ నివారణలో ఈ పెంకు పురుగులు ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఒక ఆడ పెంకు పురుగు ఆకుల అడుగు భాగంలో 1500 నుంచి 1800 వరకు గుడ్లు పెట్టి పొదగడంతో పిల్లలు నాలుగైదు రోజుల్లో బయటికి వస్తాయి. జూన్ నుంచి అక్టోబర్ వరకు మాత్రమే ఈ మొక్కలపై పెంకు పురుగులు కనిపిస్తాయి. రైతులు కలుపు మొక్కలపై వీటిని గమనిస్తే పురుగు మందులు చల్లకుండా అలాగే పెరగడానికి అవకాశం ఇవ్వాలి. వయ్యారిభామ మొక్కలకు కొన్ని రకాల ఆకుమచ్చ తెగుళ్లు, బూడిద తెగులు, ఎండు తెగులు ఆశిస్తాయి. వాటిని గుర్తించినప్పుడు ఆ మొక్కను పీకేయకుండా ఉంచాలి. దీంతో ఇతర వయ్యారిభామ మొక్కలకు ఆ తెగుళ్లు ఆశించి నాశనం చేస్తాయి. కస్సివింద (కస్సియ సెరిషియా) జాతికి చెందిన కలుపు మొక్కలు వయ్యారిభామ మొక్కలతో పాటు పెరుగుతాయి. కస్సివింద మొక్కలు స్రవించే కొన్ని రసాయనాలు వయ్యారిభామ మొక్క పెరుగుదలను, బీజోత్పత్తి శక్తిని తగ్గిస్తాయి. కస్సివిందతో పాటు వెంపలి కూడా ఇదే రకమైన ప్రభావాన్ని కలిగించి ఆ మొక్కల పెరుగుదలను తగ్గిస్తాయి. రసాయనిక పద్ధతులు.. రసాయనిక పద్ధతుల ద్వారా కలుపు మొక్కలను తాత్కాలికంగా మాత్రమే నిరోధించగలం. సాధ్యమైనంత వరకు తక్కువగా వాడాలి. కలుపు నాశక మందులు వాడాలంటే వాటికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యంతో పాటు చాలా జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం. వయ్యారిభామ కలుపు నివారణకు గ్లైఫోసేట్ 10 మి.లీ లీటర్ నీటికి లేదా పారక్వాట్ 5 నుంచి 7 మి.లీ లీటర్ నీటికి కలిపి మొలకెత్తిన 15- 20 రోజుల్లో ఎకరా విస్త్రీర్ణంలో 200 లీటర్ల మందు ద్రావణాన్ని పిచికారీ చేయాలి. వయ్యారిభామ మొక్కల నిర్మూలన ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
పాడి పశువుల ఎంపికలో జాగ్రత్తలు...
పశుసంవర్ధక శాఖ అధికారి రమేష్‌బాబు వర్గల్: పాడి పశువులు రైతుకు జీవనోపాధిగా నిలుస్తున్నాయి. పాడి కోసం అనువైన ఆవులు, గేదెలను ఎంపిక చే సుకున్నపుడే తగిన పాల దిగుబడి సాధించవచ్చు. వ్యవసాయంతోపాటు పాడి ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించవచ్చని వర్గల్ మండల పశు సంవర్ధక శాఖాధికారి డాక్టర్ రమేష్‌బాబు సూచించారు. పాల దిగుబడికి ఉపయుక్తంగా ఉండే పశు జాతులు, నాణ్యమైన పాడి పశువు లక్షణాలను ఆయన వివరించారు. సంకర జాతి ఆవుల విషయంలో హోలిస్టయిన్ ఫ్రీజియన్, జెర్సీ జాతులకు మన వాతావరణాన్ని తట్టుకునే శక్తి ఉంటుందన్నారు. ఇవి అధిక పాలసారతో రైతుకు ఎక్కువ ఆదాయాన్ని తెచ్చి పెడతాయన్నారు. గేదెల విషయంలో ముర్రా, సూర్తీ, నాగపురి, జఫ్రాబాది, గ్రేడెడ్ జాతులు ఇక్కడి వాతావరణానికి అనుకూలమని వివరించారు. మంచి పాడి పశువుల లక్షణాలు... ూ పశువు ఆరోగ్యవంతమైనదై ఉండాలి. ూ శరీరం నిండుగా ఉండాలి. ూ గేదె లేదా ఆవును వెనుకనుంచి చూసినా ముందు నుంచి చూసినా త్రిభుజాకారంలో కనిపించాలి. ూ పొదుగు పెద్దదిగా ఉండాలి. పాలు తీసిన తరువాత ముడుచుకుపోవాలి. ూ నాలుగు చన్నులు చతురస్త్రాకారంగా ఉండాలి. అన్ని చన్నుల నుంచి పాలు వస్తుండాలి. ూ పాడికి పనికి వచ్చే పశువును ఎంపిక చేసుకున్న తర్వాత కనీసం వరుసగా మూడు రోజులు ఉదయం, సాయంత్రం పాల దిగుబడి పరీరక్షించిన తరువాత కొనుగోలు చేయాలి. సాగులో సమస్యలపై ఫోన్ ఇన్ నేడు సంగారెడ్డి రూరల్: పంటల సాగు, ఎరువుల వాడకంలో రైతులకు సూచనలు, సలహాలు అందించేందుకు జిల్లా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో గురువారం ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 7గంటల నుంచి 9 వరకు అన్నదాతలు తమ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు. సాగులో ఎదుర్కొం టున్న సమస్యలపై ఫోన్ ఇన్ ద్వారా శాస్త్రవేత్తలు, వ్యవసాయశాఖ అధికారులను నుంచి తగిన సమాధానాలు పొందవచ్చన్నారు. ఫోన్ చేయాల్సిన నంబర్ 08455-278272. సమాచారం మెదక్ డీఈ దుర్గామహేశ్వరరావు 9440813625 మెదక్ ఏడీ రామచంద్రయ్య 9440813652 మెదక్ రూరల్- 1 ఏఈ తిరుపతయ్య 9440813676 మెదక్ రూరల్- 2 ఏఈ శ్రీనివాస్‌రావు 9440813335 వరిలో ఎర్ర, పసుపు మచ్చలు ప్రశ్న: వరి నాటి వారం రోజులైతంది. శేనుపై ఎర్రటి, పసుపు రంగు కనిపిస్తున్నయ్. దీని నివారణకు ఏం చేయాలో తెలియజేయండి. - అంజిరెడ్డి, జిన్నారం, ఫోన్: 9963831117 జవాబు: సూక్ష్మధాతు లోపం వల్ల వరి పంటపై ఇలాంటి రంగు గల మచ్చలు వస్తాయి. వీటి నివారణకు రెండున్నర గ్రాముల జింక్ సల్ఫేట్‌ను ఒక లీటర్ నీటిలో కలిపి పంటకు సరిపోయే మేర పిచికారీ చేయాలి. లేదా 4 గ్రాముల ఫార్ములా-4 మందును ఒక లీటర్ నీటిలో కలిపి స్పే చేయాలి. ఇలా చేయటం వల్ల వరిపై ఎర్రటి, పసుపురంగు గల మచ్చలు తొలగిపోతాయి. - సాల్మన్‌నాయక్, ఏఓ జిన్నారం, సెల్: 8886612477