కందుకూరు: పార్థీనియం కలుపు మొక్కను వయ్యారి భామ, అమెరికా అమ్మాయి, కాంగ్రెస్ గడ్డి, క్యారెట్ గడ్డి, నక్షత్రగడ్డి ఇలా వివిధ పేర్లతో పిలుస్తారు. ఇది మానవాళికి, పశువులకు హానికరమైన మొక్క. 1950 దశకంలో అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి మన దేశంలోకి ప్రవేశించి ఇక్కడా అక్కడా అనే తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ విస్తరించింది. ఇళ్ల మధ్య, వ్యవసాయ పొలాల్లో విస్తారంగా వయ్యారిభామ పెరగడంతో సాధారణ ప్రజలతో పాటు రైతులూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వయ్యారిభామ (పార్థీనియం) కలుపు మొక్కను సామాజిక ఆరోగ్య భద్రత దృష్ణ్యా సమర్థంగా నిర్మూలించడం ఎంతో అవసరమంటున్నారు జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు సీహెచ్ చిరంజీవి, పి.అమ్మాజీ, ఎన్ ప్రవీణ్. రైతులు ఈ మొక్కను నిర్మూలించేలా చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు.
నష్టాలు..
వయ్యారిభామ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటే నాలుగు వారాల్లో పుష్పించే దశకు చేరుకుంటుంది. ఒక్కో ఙమొక్క దాదాపు 10 వేల నుంచి 50 వేల వరకు విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది. హానికరమైన రసాయనాలతో ఉండే ఈ మొక్కలను జంతువులు తినలేకపోవడం, అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్ని తట్టుకునే వ్యవస్థ ఉండటంతో వయ్యారిభామ విస్తరించడానికి దోహదపడుతున్నాయి. ఈ మొక్క పంటలకే కాకుండా మనుషులకు, జంతువులకు హాని కలుగచేస్తుంది.
పక్కన మొలిచే ఇతర మొక్కలపైన దీని రసాయన ప్రభావంపడి ఎదుగుదల తగ్గుతుంది. పొలాల్లో 40 శాతం వరకు, పశుగ్రాస పంటల్లో 90 శాతం వరకు దిగుబడి తగ్గిస్తుంది. దీంతో పాటు కొన్ని రకాల వైరస్‌లకు ఈ మొక్క ఆశ్రయమిస్తూ పంటలకు వ్యాప్తిచెందడానికి కారణమవుతోంది. ఈ మొక్కతో మనుషులకు డెర్మాటైటిస్ లేదా ఎగ్జిమా, హైఫీవర్, ఉబ్బసం వంటి వ్యాధులు వస్తాయి. పుష్పాల పొడి పీలిస్తే జలుబు, కండ్లు ఎర్రబడటం వంటి లక్షణాలు కలుగుతాయి. ఆకులు రాసుకుంటే తామర వంటి వ్యాధి సంభవిస్తుంది. పశువుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. పశువులు పొరపాటున గడ్డితో పాటు మేస్తే పాల దిగుబడి తగ్గడంతో పాటు వాటి వెంట్రుకలు రాలిపోవడం, హైపర్‌టెన్షన్‌కు గురవుతాయి.
యాజమాన్య పద్ధతులు..
వయ్యారిభామ మొక్కను పూతకు రాకముందే పీకి తగులబెట్టడం లేదా కంపోస్ట్ తయారు చేయాలి. పంట మార్పిడి విధానాన్ని బంతి పంటతో చేయడంతో ఈ మొక్కల ఉద్ధృతిని తగ్గించవచ్చు. క్రైసోమిలిడ్ జాతికి చెందిన జైగోగ్రామ బైకొలరెటా అనే పెంకు పురుగులు ఈ మొక్కలను విపరీతంగా తిని ఈనెలు మాత్రమే వదిలిపెడతాయి. వయ్యారిభామ నివారణలో ఈ పెంకు పురుగులు ప్రముఖ పాత్ర వహిస్తాయి.
ఒక ఆడ పెంకు పురుగు ఆకుల అడుగు భాగంలో 1500 నుంచి 1800 వరకు గుడ్లు పెట్టి పొదగడంతో పిల్లలు నాలుగైదు రోజుల్లో బయటికి వస్తాయి. జూన్ నుంచి అక్టోబర్ వరకు మాత్రమే ఈ మొక్కలపై పెంకు పురుగులు కనిపిస్తాయి. రైతులు కలుపు మొక్కలపై వీటిని గమనిస్తే పురుగు మందులు చల్లకుండా అలాగే పెరగడానికి అవకాశం ఇవ్వాలి. వయ్యారిభామ మొక్కలకు కొన్ని రకాల ఆకుమచ్చ తెగుళ్లు, బూడిద తెగులు, ఎండు తెగులు ఆశిస్తాయి. వాటిని గుర్తించినప్పుడు ఆ మొక్కను పీకేయకుండా ఉంచాలి.
దీంతో ఇతర వయ్యారిభామ మొక్కలకు ఆ తెగుళ్లు ఆశించి నాశనం చేస్తాయి. కస్సివింద (కస్సియ సెరిషియా) జాతికి చెందిన కలుపు మొక్కలు వయ్యారిభామ మొక్కలతో పాటు పెరుగుతాయి. కస్సివింద మొక్కలు స్రవించే కొన్ని రసాయనాలు వయ్యారిభామ మొక్క పెరుగుదలను, బీజోత్పత్తి శక్తిని తగ్గిస్తాయి. కస్సివిందతో పాటు వెంపలి కూడా ఇదే రకమైన ప్రభావాన్ని కలిగించి ఆ మొక్కల పెరుగుదలను తగ్గిస్తాయి.
రసాయనిక పద్ధతులు..
రసాయనిక పద్ధతుల ద్వారా కలుపు మొక్కలను తాత్కాలికంగా మాత్రమే నిరోధించగలం. సాధ్యమైనంత వరకు తక్కువగా వాడాలి. కలుపు నాశక మందులు వాడాలంటే వాటికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యంతో పాటు చాలా జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం.
వయ్యారిభామ కలుపు నివారణకు గ్లైఫోసేట్ 10 మి.లీ లీటర్ నీటికి లేదా పారక్వాట్ 5 నుంచి 7 మి.లీ లీటర్ నీటికి కలిపి మొలకెత్తిన 15- 20 రోజుల్లో ఎకరా విస్త్రీర్ణంలో 200 లీటర్ల మందు ద్రావణాన్ని పిచికారీ చేయాలి. వయ్యారిభామ మొక్కల నిర్మూలన ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
‘వయ్యారిభామ’తో ముప్పు
Published Mon, Sep 8 2014 12:06 AM | Last Updated on Sat, Sep 2 2017 1:01 PM
Advertisement
Advertisement