breaking news
Chemical methods
-
మునగ పెరిగితే ఎడారి తోక ముడుచును!
ట్యునీసియా.. ఉత్తర ఆఫ్రికాలోని ఎడారి దేశం. ఇటు సహారా ఎడారి, అటు మెడిటెర్రేనియన్ సముద్రానికి సరిహద్దుల్లో ఉంటుంది. తీవ్రమైన కరువు కాటకాలు, అధిక నీటి దాహం కలిగిన ఆలివ్, బాదం వంటి పంటలను రసాయనిక పద్ధతుల్లో సాగు చేయటం వల్ల మిగిలిన కాస్త పంట భూమి కూడా ఎడారిగా మారిపోతున్న దుస్థితి. ఇటువంటి గడ్డుకాలంలో ఖండాంతరాల నుంచి ఆశాకిరణంలా వచ్చిన ఒక చెట్టు ట్యునీసియాను తిరిగి పైరు పచ్చగా మార్చేస్తోంది. ఆశ్చర్యమేమిటంటే ఆ కల్పవృక్షం మన.. మునగ చెట్టే! ట్యునీసియా కరువు కోరల్లో ఉంది. ఎడారీకరణ అంచున వేలాడుతోంది. గత కొన్నేళ్లుగా వదలని వరుస కరువులు దేశాన్ని మరింత పేదరికంలోకి నెట్టాయి. ఉన్న కాస్త మంచినీటి వనరులలో 76 శాతాన్ని సాంద్ర రసాయనిక వ్యవసాయమే పీల్చేస్తోంది. వ్యవసాయంలో మౌలిక మార్పు తెస్తే తప్ప కరువు తీరదని సారా టౌమి అనే యువతి గుర్తించింది. సారా.. పారిస్‌లో సౌకర్యవంతమైన జీవితాన్ని వదిలి తన తండ్రి పుట్టిన దేశమైన ట్యునీసియాకు ఆరేళ్ల క్రితం తిరిగి వచ్చేసింది. ఇసుకను పంట భూముల్లోకి ఎత్తిపోసే గాలులను అడ్డుకోవడానికి మునగ చెట్లతో రక్షక వనాలను విరివిగా నాటాలని సారా ట్యునీసియా ప్రభుత్వానికి సూచించింది. ప్రభుత్వం తిరస్కరించినా నిరాశ చెందలేదు. తనే రైతులతో కలసి సహకార సంఘాలను ఏర్పాటు చేసి గత ఆరేళ్లుగా బహుళ ప్రయోజనకారి అయిన మునగ సాగుపై దృష్టి పెట్టారు. ‘అకాసియ ఫర్ ఆల్’ పేరిట సంస్థను నెలకొల్పి, మునగ నర్సరీని ప్రారంభించి రసాయన రహిత వ్యవసాయాన్ని వ్యాప్తిలోకి తేవడంలో సఫలీకృతమవుతున్నారు. మునగ ఆకుల పొడిని తయారు చేసి రైతుల సహకార సంఘాల ద్వారా విక్రయించడం ద్వారా అధిక నికరాదాయాన్ని పొందే మార్గాన్ని చూపారు. ఇప్పటికి 50 వేల మునగ మొక్కలు నాటారు. వచ్చే ఏడాది నాటికి 10 లక్షల మునగ మొక్కలు నాటాలన్నది ఆమె లక్ష్యం. మునగ మహాత్మ్యం.. ► మునగ చెట్లు పెరగడానికి నీరు పెద్దగా అక్కర్లేదు. రసాయనిక ఎరువులూ అవసరం లేదు. ఉప్పు నీరుతో కూడా పెరుగుతుంది. సాధారణ పంటలు లీటరు నీటిలో 3 గ్రాములకు మించిన ఉప్పదనం ఉంటే భరించలేవు. మునగ 8 గ్రాముల ఉప్పున్నా తట్టుకుంటుంది. ► మునగ చెట్టు వేర్లు 100 మీటర్ల వరకూ భూమి లోపలికి వెళ్లి నీటి తేమను తీసుకోగలవు. వేగంగా పెరుగుతుంది. ∙వాతావరణంలో నుంచి నత్రజనిని గ్రహించి భూమిని సారవంతం చేస్తుంది. కొమ్మలు నరికి నేలపై ఆచ్ఛాదనగా వేసి భూసారాన్ని పెంచుకోవడానికి అనువైనది మునగ. ► ఎటువంటి నేలల్లోనైనా సునాయాసంగా పెరగడంతోపాటు మానవాళి పౌష్టికాహార లోపాన్ని జయించడానికి దోహదపడే సూపర్ ఫుడ్ మునగ. గుప్పెడు తాజా మునగ ఆకుల్లో 4 కారెట్లలోకన్నా ఎక్కువగా విటమిన్ ఏ, ఏడు నారింజ పండ్లలో కన్నా ఎక్కువ విటమిన్ సీ ఉంది. ► మునగ విత్తనాల నూనె వంటల్లో వాడుకోవచ్చు. నూనె తీసిన చెక్కను తాగునీటిని శుద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. మునగ గింజల పొడి మంచి సహజ ఎరువుగా ఉపయోగపడుతుంది. ► తొలి సేంద్రియ వ్యవసాయ దేశమైన క్యూబా నేత ఫిడెల్ క్యాస్ట్రోకు మునగ అంటే అమిత ప్రేమ. ‘అన్ని రకాల అమినో యాసిడ్లు కలిగి ఉన్న ఏకైక చెట్టు మునగ. శ్రద్ధగా పెంచితే హెక్టారుకు ఏడాదిలో 300 టన్నులకు పైగా పచ్చి ఆకు దిగుబడి ఇవ్వగలదు. ఇందులో డజన్ల కొద్దీ ఔషధ గుణాలు ఉన్నాయి’ అని క్యాస్ట్రో చెప్పారు. – సాగుబడి డెస్క్ -
‘వయ్యారిభామ’తో ముప్పు
కందుకూరు: పార్థీనియం కలుపు మొక్కను వయ్యారి భామ, అమెరికా అమ్మాయి, కాంగ్రెస్ గడ్డి, క్యారెట్ గడ్డి, నక్షత్రగడ్డి ఇలా వివిధ పేర్లతో పిలుస్తారు. ఇది మానవాళికి, పశువులకు హానికరమైన మొక్క. 1950 దశకంలో అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి మన దేశంలోకి ప్రవేశించి ఇక్కడా అక్కడా అనే తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ విస్తరించింది. ఇళ్ల మధ్య, వ్యవసాయ పొలాల్లో విస్తారంగా వయ్యారిభామ పెరగడంతో సాధారణ ప్రజలతో పాటు రైతులూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వయ్యారిభామ (పార్థీనియం) కలుపు మొక్కను సామాజిక ఆరోగ్య భద్రత దృష్ణ్యా సమర్థంగా నిర్మూలించడం ఎంతో అవసరమంటున్నారు జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు సీహెచ్ చిరంజీవి, పి.అమ్మాజీ, ఎన్ ప్రవీణ్. రైతులు ఈ మొక్కను నిర్మూలించేలా చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. నష్టాలు.. వయ్యారిభామ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటే నాలుగు వారాల్లో పుష్పించే దశకు చేరుకుంటుంది. ఒక్కో ఙమొక్క దాదాపు 10 వేల నుంచి 50 వేల వరకు విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది. హానికరమైన రసాయనాలతో ఉండే ఈ మొక్కలను జంతువులు తినలేకపోవడం, అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్ని తట్టుకునే వ్యవస్థ ఉండటంతో వయ్యారిభామ విస్తరించడానికి దోహదపడుతున్నాయి. ఈ మొక్క పంటలకే కాకుండా మనుషులకు, జంతువులకు హాని కలుగచేస్తుంది. పక్కన మొలిచే ఇతర మొక్కలపైన దీని రసాయన ప్రభావంపడి ఎదుగుదల తగ్గుతుంది. పొలాల్లో 40 శాతం వరకు, పశుగ్రాస పంటల్లో 90 శాతం వరకు దిగుబడి తగ్గిస్తుంది. దీంతో పాటు కొన్ని రకాల వైరస్‌లకు ఈ మొక్క ఆశ్రయమిస్తూ పంటలకు వ్యాప్తిచెందడానికి కారణమవుతోంది. ఈ మొక్కతో మనుషులకు డెర్మాటైటిస్ లేదా ఎగ్జిమా, హైఫీవర్, ఉబ్బసం వంటి వ్యాధులు వస్తాయి. పుష్పాల పొడి పీలిస్తే జలుబు, కండ్లు ఎర్రబడటం వంటి లక్షణాలు కలుగుతాయి. ఆకులు రాసుకుంటే తామర వంటి వ్యాధి సంభవిస్తుంది. పశువుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. పశువులు పొరపాటున గడ్డితో పాటు మేస్తే పాల దిగుబడి తగ్గడంతో పాటు వాటి వెంట్రుకలు రాలిపోవడం, హైపర్‌టెన్షన్‌కు గురవుతాయి. యాజమాన్య పద్ధతులు.. వయ్యారిభామ మొక్కను పూతకు రాకముందే పీకి తగులబెట్టడం లేదా కంపోస్ట్ తయారు చేయాలి. పంట మార్పిడి విధానాన్ని బంతి పంటతో చేయడంతో ఈ మొక్కల ఉద్ధృతిని తగ్గించవచ్చు. క్రైసోమిలిడ్ జాతికి చెందిన జైగోగ్రామ బైకొలరెటా అనే పెంకు పురుగులు ఈ మొక్కలను విపరీతంగా తిని ఈనెలు మాత్రమే వదిలిపెడతాయి. వయ్యారిభామ నివారణలో ఈ పెంకు పురుగులు ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఒక ఆడ పెంకు పురుగు ఆకుల అడుగు భాగంలో 1500 నుంచి 1800 వరకు గుడ్లు పెట్టి పొదగడంతో పిల్లలు నాలుగైదు రోజుల్లో బయటికి వస్తాయి. జూన్ నుంచి అక్టోబర్ వరకు మాత్రమే ఈ మొక్కలపై పెంకు పురుగులు కనిపిస్తాయి. రైతులు కలుపు మొక్కలపై వీటిని గమనిస్తే పురుగు మందులు చల్లకుండా అలాగే పెరగడానికి అవకాశం ఇవ్వాలి. వయ్యారిభామ మొక్కలకు కొన్ని రకాల ఆకుమచ్చ తెగుళ్లు, బూడిద తెగులు, ఎండు తెగులు ఆశిస్తాయి. వాటిని గుర్తించినప్పుడు ఆ మొక్కను పీకేయకుండా ఉంచాలి. దీంతో ఇతర వయ్యారిభామ మొక్కలకు ఆ తెగుళ్లు ఆశించి నాశనం చేస్తాయి. కస్సివింద (కస్సియ సెరిషియా) జాతికి చెందిన కలుపు మొక్కలు వయ్యారిభామ మొక్కలతో పాటు పెరుగుతాయి. కస్సివింద మొక్కలు స్రవించే కొన్ని రసాయనాలు వయ్యారిభామ మొక్క పెరుగుదలను, బీజోత్పత్తి శక్తిని తగ్గిస్తాయి. కస్సివిందతో పాటు వెంపలి కూడా ఇదే రకమైన ప్రభావాన్ని కలిగించి ఆ మొక్కల పెరుగుదలను తగ్గిస్తాయి. రసాయనిక పద్ధతులు.. రసాయనిక పద్ధతుల ద్వారా కలుపు మొక్కలను తాత్కాలికంగా మాత్రమే నిరోధించగలం. సాధ్యమైనంత వరకు తక్కువగా వాడాలి. కలుపు నాశక మందులు వాడాలంటే వాటికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యంతో పాటు చాలా జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం. వయ్యారిభామ కలుపు నివారణకు గ్లైఫోసేట్ 10 మి.లీ లీటర్ నీటికి లేదా పారక్వాట్ 5 నుంచి 7 మి.లీ లీటర్ నీటికి కలిపి మొలకెత్తిన 15- 20 రోజుల్లో ఎకరా విస్త్రీర్ణంలో 200 లీటర్ల మందు ద్రావణాన్ని పిచికారీ చేయాలి. వయ్యారిభామ మొక్కల నిర్మూలన ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.