పాడి రైతుకు బాసట మొలక గడ్డి మూట! | A sprig of grass bale to support the dairy farmer! | Sakshi
Sakshi News home page

పాడి రైతుకు బాసట మొలక గడ్డి మూట!

Published Wed, Dec 24 2014 11:30 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

పాడి రైతుకు బాసట  మొలక గడ్డి మూట! - Sakshi

పాడి రైతుకు బాసట మొలక గడ్డి మూట!

ఇంటి దగ్గరే ట్రేలలో మొలక గడ్డిని పెంచుకోవచ్చు.. పాడి పశువులతోపాటు గొర్రెలకూ మేపొచ్చు
మొక్కజొన్నలతో 8 రోజుల్లోనే పుష్టికరమైన మొలక గడ్డిని పెంచొచ్చు
15-20% వరకు పెరిగిన పాల దిగుబడి..
పాడి రైతులకు వరప్రసాదంగా మారిన
మహబూబ్‌నగర్ పశుసంవర్థక శాఖ అధికారుల కృషి

 
చిన్న, సన్నకారు రైతుల్లో చాలా మందికి పంటల ద్వారా కన్నా పాడి ద్వారానే అధిక నికరాదాయం వస్తున్న మాట వాస్తవం. అటువంటి పాడికి ఆధారం పచ్చిమేత. పశువులకు సంపూర్ణ ఆహారం అందించాలంటే పచ్చిమేత తప్పనిసరి. ఏడాదిలో 365 రోజులూ పచ్చిమేతను పాడి పశువులకు అందించడం చాలా వ్యయప్రయాసలతో కూడుకున్న పని. నేల, కూలీల కొరతకు కరువు తోడవడంతో పాడి రైతులు నానా కష్టాలు పడుతున్నారు. ఈ సమస్యలన్నిటికీ ఏకైక పరిష్కారం ‘మొలక గడ్డి’ సాగు! మొలక గడ్డిని తక్కువ ఖర్చుతో ఇంటి దగ్గరే సులభంగా పెంచుకునే పద్ధతిని మహబూబ్‌నగర్ పశుసంవర్థక శాఖ అధికారులు రైతులకు అందుబాటులోకి తెచ్చారు. దీంతో మొలకగడ్డిని నిక్షేపంగా పెంచుకొని అధికాదాయం పొందవచ్చని రుజువు చేస్తున్నారు పలువురు పాడి రైతులు.
 
విస్తారమైన నేల అవసరం లేకుండానే ఇంటిపట్టున ఏడాది పొడవునా నిశ్చింతగా పచ్చిమేత పెంచుకునే కొత్త పద్ధతి అందుబాటులోకి వచ్చింది. కరువు బారిన పడి విలవిల్లాడుతున్న పాడి రైతులకు సులువైన ప్రత్యామ్నాయం అందించే లక్ష్యంతో మహబూబ్‌నగర్ పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ కోనేటి వెంకట రమణ మొలక గడ్డి(హెడ్రోపోనిక్ ఫాడర్) పెంపకాన్ని తొలుత ప్రయోగాత్మకంగా చేపట్టి సత్ఫలితాలు సాధించారు. ఆ తర్వాత ఈ పద్ధతిని రైతులకు అందుబాటులోకి తెచ్చారు. భూమి లేని నిరుపేదలు కూడా తక్కువ ఖర్చుతో పచ్చిమేతను పండించుకోవచ్చు.

కిలో గింజలతో 10-12 కిలోల మొలకగడ్డి

బార్లీ, సజ్జ, మొక్కజొన్నలతో మొలకగడ్డిని పెంచవచ్చు. కిలో మొక్కజొన్నలతో ఒక ట్రేలో 9 రోజుల్లో 10-12 కిలోల మొలక గడ్డిని పెంచవచ్చు. ఒక్కో పశువుకు రోజుకు 10-15 కిలోల మొలక గడ్డిని అందించవచ్చు. ప్రతి పశువుకూ రోజూ ఈ గడ్డి అందుబాటులో ఉండాలంటే.. 9 ట్రేలను సమకూర్చుకొని రోజుకో ట్రేలో మొలక కట్టిన గింజలను ట్రేలో వత్తుగా ఉండేలా పోయాలి.  తరచూ నీటితో తడుపుతూ ఉండాలి. 9 రోజులు గడిచేటప్పటికి మొదటి రోజు పెట్టిన ట్రేలో మొలక గడ్డి వాడకానికి సిద్ధమవుతుంది. ఎటువంటి ఎరువులూ వేయనక్కర్లేదు. గింజల్లోని పోషకాలతోనే గడ్డి పెరుగుతుంది.
 
అత్యధికంగా పోషకాలు
 
ఈ మొలక గడ్డి దాణాతో సమానం. సాధారణ పచ్చిమేతలో 7-10% ప్రొటీన్లుంటాయి. కానీ, మొలక గడ్డిలో 17.2% ప్రొటీన్లున్నాయి. 25.4% పీచుపదార్థంతోపాటు ఏ, ఈ విటమిన్లు.. కాల్షియం, భాస్వరం తదితర లవణాలు అధికంగా ఉన్నాయి. పాల దిగుబడి 20-30 శాతం పెరుగుతుంది. పశువులు ఆరోగ్యంగా ఉంటాయి. తొందరగా ఎదకు వస్తాయి.
 
గ్రీన్ షేడ్ నెట్‌తో షెడ్ ఏర్పాటు ఇలా..
 
నలువైపులా గ్రీన్ షేడ్ నెట్‌ను కప్పిన గదిలో మొలక గడ్డిని పెంచాలి. మొదట చతురస్రాకారంలో కర్రలు, తడికలు లేదా కొబ్బరి మట్టల సహాయంతో ఒక గదిని నిర్మించాలి. ద్వారం కూడా ఏర్పాటు చేయాలి. వాటి చుట్టూ గ్రీన్‌షేడ్ నె ట్‌ను కప్పాలి. ఉష్ణోగ్రత 25-30 డిగ్రీల మధ్య, గాలిలో తేమ 60-65% ఉండేలా చూడడానికి ఇది అవసరం.
   
5 పాడి పశువులకు 6్ఠ6్ఠ12 అడుగుల షెడ్ నిర్మించాలి. కట్టెలతో షెడ్ వేయడానికి రూ. 1,500, గ్రీన్ షేడ్‌నెట్‌కు రూ. 500, పశువుకు 8 ట్రేల చొప్పున 40 ట్రేలు, నీటి సరఫరా పైపులకు కలిపి రూ. 8,000 చొప్పున మొత్తం రూ. 10 వేలు ఖర్చవుతుంది. 10 పాడి పశువులకు 12్ఠ12్ఠ12 అడుగుల షెడ్ నిర్మించాలి. 80 ట్రేలు కావాలి. మొత్తం ఖర్చు రూ. 20 వేలవుతుంది.
 
నానబెట్టి మొలక కట్టాలి..


నాణ్యమైన మొక్కజొన్న విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. వీటిని ట్రేలో వేయడానికి ముందు 5 లీటర్ల నీటిలో 100 గ్రాముల సున్నం కలిపి అందులో 10 నిమిషాలు నానబెట్టి రెండు సార్లు శుద్ధి చేయాలి. తర్వాత మంచినీటిలో 24 గంటలపాటు నానబెట్టాలి. నానిన గింజలను గోనె సంచిలో మూటగట్టాలి. 24 గంటల తర్వాత గింజలను ట్రేలో వత్తుగా పోసి.. ట్రేను 50% గ్రీన్ షేడ్ నెట్ చుట్టిన గదిలో పెట్టాలి. ట్రేలో నీరు నిలబడకుండా అడుగున అక్కడక్కడా బెజ్జాలు పెట్టాలి.
 
రోజుకు 8 సార్లు నీరు చల్లాలి

8 రోజుల పాటు 2-3 గంటలకోసారి రాత్రి పూట 3 సార్లు, పగలు 5 సార్లు ట్రేలలో గింజలను నీటితో తడపాలి. 5-10 పశువులున్న రైతులు రోజ్ క్యాన్ ద్వారా లేదా నాలాను ఏర్పాటు చేసుకొని బాత్రూమ్ షవర్ ద్వారా నీరందించవచ్చు. 10-100 పశువులున్న పెద్ద రైతులు 3/4 ఇంచుల పైపులతో మైక్రో స్ప్రింక్లర్ల ద్వారా నీరందించవచ్చు. 2 గంటలకోసారి నీటిని పిచికారీ చేసేలా టైమర్‌ను అమర్చుకోవచ్చు. ఎటువంటి ఎరువూ వేయనవసరం లేకుండానే మొలక గడ్డి పెరుగుతుంది. అయితే, గింజలు వేసిన 6,7 రోజుల్లో 1 లీటరు నీటిలో 20 గ్రాముల యూరియా కలిపి 2% ద్రావణాన్ని తయారు చేసి, ఆ రెండు రోజుల్లో రోజుకోసారి పిచికారీ చేస్తే అధిక మొలక గడ్డి దిగుబడి వస్తున్నదని గుర్తించామని డా. వెంకటరమణ తెలిపారు. విత్తనాలు వేసిన తొమ్మిదో రోజు మొలక గడ్డిని పశువులకు ఏ వేళల్లోనైనా మేపవచ్చు. మహబూబ్‌నగర్ పశుసంవర్థక శాఖ కార్యాలయం వద్ద ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన మొలక గడ్డి పెంపకం షెడ్డును చూసి స్ఫూర్తిని పొందిన 25 మంది రైతులు ఈ పద్ధతిని అనుసరిస్తూ అధికాదాయం పొందుతుండడం విశేషం.    
 
 - బొక్కలంపల్లి మల్లేష్  మహబూబ్‌నగర్  వ్యవసాయం
 
పాడి పశువులతోపాటు మేకలకూ మేపొచ్చు!

కరువు కాలంలో పాడి రైతుల ఇబ్బందులు చూడలేక మొలక గడ్డిపై ప్రయోగాలు చేశా. మంచి ఫలితాలు రావడంతో రైతులకు నేర్పించా. ఇప్పటికి 25 మంది రైతులు పెంచుతున్నారు. 6-8 లీటర్ల పాలిచ్చే ఆవుకు లేదా 6 లీటర్ల పాలిచ్చే గేదెకు రోజుకు 10-15 కిలోల మొలకగడ్డి పెడితే.. ఇక దాణా అక్కర్లేదు. కొంత ఎండు మేత వేస్తే చాలు. పొలంలో పచ్చి గడ్డి 90 రోజులకు కోతకొస్తే.. మొలక గడ్డి 9వ రోజే చేతికొస్తుంది. పొలంలేని, కరెంటు లేని నిరుపేదలూ ఈ గడ్డిని పెంచుకొని పాడి పశువులను పోషించుకోవచ్చు. పొట్టేళ్లు, గొర్రెలకు రోజుకు కనీసం 2 కిలోల మొలక గడ్డి వేస్తే మంచిది.
 - డా. కోనేటి వెంకట రమణ, సంయుక్త సంచాలకులు, పశుసంవర్ధక శాఖ, మహబూబ్‌నగర్
 99899 97489, 77026 44456 jdahmbnr
 @gmail.com
 
 ఖర్చు తగ్గి, ఆదాయం పెరిగింది!  
 నాకు ఎకరం పొలముంది. పచ్చిగడ్డి లేక కొన్ని గేదెలు అమ్ముకున్నా. ఇప్పుడున్న 12 గేదెల్లో5 పాలిస్తున్నాయి. డా. వెంకటరమణ చెబితే 2 నెలల నుంచి మొలక గడ్డి పెంచుతున్నా.  గేదెకు ఒక పూట దాణా, మరో పూట 10 కిలోల మొలకగడ్డిని మేపుతున్నా. గేదెకు 2 లీటర్ల పాల దిగుబడి పెరిగింది. వారం నుంచే తేడా కనిపించింది. ఖర్చు తగ్గి, ఆదాయం పెరిగింది.     
 - జిల్లెల వెంకటేష్ (9441542969,
 9032138211), యువ రైతు, చిన్నదర్పల్లి, మహబూబ్‌నగర్ జిల్లా
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement