లైఫ్ కిల్లర్స్ | heavy use of medication dangerous | Sakshi
Sakshi News home page

లైఫ్ కిల్లర్స్

Published Sun, Jun 14 2015 4:02 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

heavy use of medication dangerous

మితిమీరిన మందుల వాడకం నగరవాసుల ప్రాణాలను మింగేస్తోంది. చిన్నచిన్న సమస్యలకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడుతున్న పెయిన్ కిల్లర్స్ వల్ల కిడ్నీలు ఫెయిలై ప్రాణాపాయం సంభవిస్తోందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. గత మూడేళ్లలో నగరంలోని గణాం కాలను పరిశీలిస్తే.. కిడ్నీ ఫెయిల్యూర్, ఇతర కారణాలతో ఆస్పత్రులకు వచ్చే రోగుల్లో చాలా మంది పెయిన్ కిల్లర్స్ వాడకం వల్లే ఆ దుస్థితికి చేరారని తేలింది.
 
- విచ్చలవిడిగా మందుల వాడకం
- శరీరంలో కీలక అవయవాలపై ప్రభావం
- పాడైపోతున్న కిడ్నీలు
- మూడేళ్లలో నగరంలో రెట్టింపు సంఖ్యలో రోగులు

కంకిపాడుకు చెందిన వెంకటేష్  (పేరు మార్చాం)కు 45 సంవత్సరాలు. వ్యవసాయ కూలీ పనులకు వెళ్లే ఆయన రోజూ ఒంటినొప్పులతో బాధపడేవారు. దీంతో ఇంటి పక్కనే ఉన్న మందుల షాపుకు వెళ్లి నొప్పుల బిళ్లలు తెచ్చుకుని వేసుకునేవారు. ఇలా రెండేళ్లు గడిచాక ఆయన కిడ్నీలు పాడైపోయాయి. ప్రస్తుతం అంపశయ్యపై ఉన్న వెంకటేష్ వారానికి రెండుసార్లు డయాలజిస్ చేయించుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాడు.

లబ్బీపేటకు చెందిన రమేష్‌కు పంటి ఇన్‌ఫెక్షన్లు ఉండటంతో తరచూ యాంటీ బయోటిక్స్ వాడుతుండేవాడు. వైద్యుడి సూచనపై కాకుండా మందుల షాపుకు వెళ్లి వారు ఇచ్చే టాబ్లెట్లు వేసుకునేవాడు. క్రమేపీ అతని శరీరంలో ఇమ్యునిటీ పవర్ తగ్గిపోయి వ్యాధులు సోకడం ప్రారంభించాయి. అంతే కాకుండా మందులు వేసుకున్నా పనిచేయని స్థితికి చేరుకున్నాడు.

వెంకటేష్, రమేషే కాదు.. నగరంలో విచ్చలవిడిగా మందులు వాడుతుండటంతో అనేకమంది ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. యాంటి బయోటిక్స్‌కు సంబంధించి వ్యాధిని బట్టీ, వైద్యుల సూచన మేరకు తగిన మందులు వాడాల్సి ఉంది. కానీ, మితిమీరిన యాంటి బయోటిక్స్ వాడకం వల్ల శరీరంలో యాంటీ బయోటిక్ రెసిస్టెన్స్ పెరిగి బ్యాక్టీరియా, వైరల్ వ్యాధులు ప్రబలుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. మన శరీరంలో కొన్ని వేల బ్యాక్టీరియాలు ఉంటాయని, వ్యాధి నిరోధకశక్తి తగ్గిన సమయంలో వాటి ప్రభావం తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

మందులకు సంబంధించి కొన్ని పారా మీటర్స్‌ను పాటించాలని పేర్కొంటున్నారు. కొందరికీ జన్యుపరమైన కారణాల వల్ల కొన్ని రకాల మందులు పడవని, వాటిని గమనించాల్సిన అవసరం ఉందంటున్నారు. ఉదాహరణకు పెయిన్ కిల్లర్ బ్రూఫెన్ అందరికీ పడదని చెబుతున్నారు. ఇలా అనేక రకాల మందులు వైద్యుల సూచన లేకుండా వాడటం వల్ల ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నట్లు హెచ్చరిస్తున్నారు. మితిమీరిన మందుల వాడకం కారణంగా కిడ్నీ, గుండె, లివర్ వ్యాధులతో పాటు ఒక్కోసారి నరాలు, మెదడుపై తీవ్ర ప్రభావం పడుతుందని చెబుతున్నారు.

భయపెడుతున్న గణాంకాలు
మూడేళ్ల కిందటి వరకూ నగరంలోని ఆస్పత్రులకు వచ్చే కిడ్నీ పాడైన రోగుల్లో 3 నుంచి 4 శాతం మంది పెయిన్ కిల్లర్స్ వాడకం వల్లే ఆ స్థితికి వచ్చారని వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం 8 నుంచి 10 శాతం మందిలో అధికంగా మందులు వాడటమే కారణంగా చెబుతున్నారు. అంటే.. మూడేళ్లలో రెట్టింపు సంఖ్యలో కిడ్నీ వ్యాధులకు మందులే కారణంగా తెలుస్తోంది. అలాగే, ఏటా యాంటి బయోటిక్స్, ఇతర మందులు మితిమీరి వాడటం సుమారు వెయ్యి నుంచి 1,500 మంది వరకూ వివిధ ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నట్లు అంచనా. ఇతర దుష్ఫలితాలు చూపుతున్న వారి సంఖ్య వేలలో ఉంటుందని వైద్యులే చెబుతున్నారు.

మందులు వేసుకునే సమయం ముఖ్యం
మందులు వేసుకునేందుకు సమయం ఎంతో ముఖ్యమని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల కొలెస్ట్రాల్ మందులు, సిరాయిడ్స్ రాత్రి వేళల్లోనే వేసుకోవాలని చెబుతున్నారు. అలాగే, నొప్పుల బిళ్లలు, యాంటి బయోటిక్స్‌ను ఏదైనా తిన్న తర్వాతే వేసుకోవాలని పేర్కొంటున్నారు. అలాకాకుంటే గ్యాస్ట్రిక్ సమస్య తలెత్తుతుందని చెబుతున్నారు. మందులు వాడేటప్పుడు వైద్యుల సూచన తప్పనిసరి అని, ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇవ్వవద్దని అనేకసార్లు ఫార్మశిస్టులకు హెచ్చరికలు జారీ చేసినట్లు డ్రగ్ ఇన్‌స్పెక్టర్ డాక్టర్ బాలు ‘సాక్షి’కి తెలిపారు.
 - లబ్బీపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement