రైతుకు రాయితీ.. పశువుకు గ్రాసం!
♦ కరువులో ఆలమందల పోషణకు ప్రత్యేక పథకం
♦ వందశాతం రాయితీతో సాగవుతున్న పశుగ్రాసం
♦ ఒక్కో రైతుకు రెండెకరాల విస్తీర్ణం వరకు ఉచితం
♦ సద్వినియోగంలో రాష్ట్రంలో జిల్లా మొదటిస్థానం
కరువు దాటికి రైతన్నలు మూగజీవాలను సాకలేక బలవంతంగా వదిలించుకోవాల్సి వస్తోంది. ముఖ్యంగా సాగునీటి వనరులు పూర్తిగా అడుగంటడం.. వరుసగా ప్రకృతి వైపరీత్యాల ప్రభావంతో కష్టజీవి ఆర్థికంగా చితికిపోయి పశువులకు గ్రాసం కూడా అందించలేని దుస్థితిలో ఉన్నాడు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు పశుసంవర్ధక శాఖ వందశాతం రాయితీతో పశుగ్రాసం విత్తనాలు అందిస్తూ రైతులను ప్రోత్సహిస్తోంది. కొద్ది మొత్తంలో నీటి సౌకర్యం ఉన్న రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటూ పశుగ్రాసం సమస్యను అధిగమిస్తున్నారు. - సాక్షి, రంగారెడ్డి జిల్లా
సాక్షి, రంగారెడ్డి జిల్లా : అధికారుల గణాంకాల ప్రకారం జిల్లాలో పశుసంపద 5.82 లక్షలు. సాగునీటి వనరులు లేకపోవడంతో జిల్లాలో కరువు ప్రభావం రోజురోజుకు పెరుగుతోంది. పాడి పరిశ్రమపై ఆధారపడిన రైతులు.. పశువులను సాకలేక అమ్ముకుంటున్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రభుత్వం ఉపాధి హామీ పథ కానికి అనుసంధానం చేస్తూ ‘రైసింగ్ ఆఫ్ ఫాడర్ ప్లాట్స్ ఫర్ డ్రౌట్ మిటిగేషన్’ పేరిట కొత్త పథకానికి రూపకల్పన చేసింది. ఇందులో భాగంగా పశుగ్రాసం సాగుకు ఉచితంగా విత్తనాలు అందించడంతోపాటు సాగుకు అవసరమైన సౌకర్యాల కల్పనకు ఆర్థిక చేయూత ఇస్తోంది. ఎకరా పశుగ్రాసం సాగుకు ప్రభుత్వం రూ.11,434 ఖర్చు చేస్తోంది. ఈ అంశంపై అవగాహన కల్పించడంతో రైతులు జిల్లాలో ఇప్పటివరకు 1,082 ఎకరాల్లో పశుగ్రాసాన్ని సాగుచేశారు. ఇందుకుగాను ప్రభుత్వం రూ.1.237 కోట్లు ఖర్చు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక విస్తీర్ణంలో పశుగ్రాసాన్ని సాగు చేసి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది.
జిల్లా నుంచే మొదలు.
జిల్లా పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు వి.వరప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో పశుగ్రాసం సాగుపై ఓ ప్రణాళిక తయారుచేసి ప్రభుత్వానికి నివేదించారు. తక్కువ నీటిని వినియోగించి జొన్నరకం గడ్డిని సాగుచేసే విధానాన్ని ఇందులో పొందుపరిచారు. దీన్ని పరిశీలించిన రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ఉచిత పశుగ్రాసం సాగుకు పచ్చజెండా ఊపింది. దీంతో జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా గ్రాసం సాగును ప్రోత్సహించాలని సూచించింది. కొద్దిపాటి నీటి సౌకర్యంతోపాటు జాబ్‌కార్డు ఉన్న పాడిరైతుకు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,702 ఎకరాల్లో పశుగ్రాసాన్ని సాగు చేస్తున్నారు. ఇందుకుగాను ప్రభుత్వం రూ.2 కోట్లు ఖర్చు చేసింది. పేద పాడిరైతులు ముందుకొస్తే సంఖ్యతో సంబంధంలేకుండా ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి చేకూరుస్తామని, రైతులనుంచి డిమాండ్ కూడా పెరుగుతోందని రంగారెడ్డి జిల్లా పశుసంవర్ధక శాఖ రీజినల్ జాయింట్ డెరైక్టర్ వరప్రసాద్‌రెడ్డి ‘సాక్షి’తో అన్నారు.
గడ్డి దొరకడం కష్టంగా ఉంది
కరువు కాలంలో పాడిపశువులకు గడ్డి దొరకడం కష్టంగా ఉంది. ప్రభుత్వం ఇచ్చిన గడ్డి విత్తనాలు తీసుకున్నా. ఉ పాధిహామీ కింద పశుగ్రాసాన్ని పెంచుతున్నా. నాకు పది గేదెలున్నాయి. పచ్చిగడ్డి వేయడంతో రోజుకు పొద్దు, మాపు 60 లీటర్ల పాలు ఇస్తున్నాయి. గడ్డి విత్తనాలు నాణ్యమైనవి కావడంతో దిగుబడి బాగుంది. - రమావత్ కృష్ణ, పాడి రైతు, కేవీ తండా, ఇబ్రహీంపట్నం
వృథా నీటితో గడ్డి పెంచుతున్నా
పశుసంవర్ధక శాఖ అధికారుల సలహా మేరకు వృథా నీటితో గడ్డి పెంచుతున్నా. ఎకరా పొలంలో గడ్డి వేసిన. ఆరు పాడి పశువులకు ఈ గడ్డి సరిపోతుంది. రోజుకు 30 లీటర్ల పాలు ఇస్తున్నాయి. ప్రస్తుతం నేను సాగు చేస్తున్న గడ్డి రకం పేరు కేటు.
- భిక్షపతి, పాడి రైతు, ఇబ్రహీంపట్నం