తూమునూర్‌లో ఎద్దును చంపిన పెద్దపులి (సీసీ కెమెరాకు చిక్కిన దృశ్యం)
కాళేశ్వరం: తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు గడ్చిరోలి జిల్లా సిరొంచ తాలూకా తూమునూర్–అరుడ ఫారెస్ట్ బీట్‌లో పెద్దపులి జాడ కన్పించింది. అంతేకాదు అడవిలో మేతకు వెళ్లిన ఎద్దుపై దాడి చేసి చంపేసింది. తూమునూర్ ఉప సర్పంచ్ వేముల కిరణ్, సిరొంచ అటవీ అధికారుల సమాచారం ప్రకారం.. తూమునూర్ గ్రామానికి చెందిన ఒక ఎద్దు ఈ నెల 12న అడవిలో మేతకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఉప సర్పంచ్‌తో పాటు మరికొందరు స్థానికులు 13న అడవిలోకి వెళ్లి గాలించగా ఎద్దు కళేబరం కన్పించింది. చుట్టుపక్కల పులి పాదముద్రలు కన్పించడంతో ఎద్దుపై పులి దాడి చేసిందని భావించారు.
దీంతో వారు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. సిరొంచ రేంజర్ కటుకు శ్రీనివాస్ తన సిబ్బందితో కలిసి అడవిలోకి వెళ్లి మూడుచోట్ల ట్రాకింగ్ కెమెరాలు అమర్చారు. కాగా అదేరోజు రాత్రి 9.30 గంటలకు ఎద్దు వద్దకు వచ్చిన పెద్దపులి కొంత మాంసాన్ని తినడం ఆ కెమెరాల్లో రికార్డయ్యింది. దీంతో చుట్టుపక్కల గ్రామాల సమీప అటవీ ప్రాంతాల్లో పులి తిరుగుతోందని, ప్రజలు అడవుల్లోకి వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. తూమునూర్ నుంచి తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్, కుదురుపల్లి, ఎడపల్లి, బీరసాగర్, కాళేశ్వరం ప్రాంతాలకు 8–12 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉండగా మధ్యలో గోదావరి అడ్డుగా ఉంది. పులి ఈ ప్రాంతాల వైపు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఎస్–8 పనేనా?
గతేడాది అక్టోబర్ చివరి వారంలో ఎస్–8గా పేరు పెట్టిన పెద్దపులి సుమారు నెలన్నరపాటు నాలుగు జిల్లాల్లో తిరిగింది. భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో సంచరించి అక్కడక్కడా బీభత్సం సృష్టించింది. చివరకు కాటారం మండలం వీరాపూర్‌లో రెండు రోజులపాటు గడిపి డిసెంబర్ 13న మహదేవపూర్ మండలం అన్నారం మీదుగా కుంట్లం వద్ద గోదావరి దాటి మంచిర్యాల, కొమురంభీం జిల్లాలకు వెళ్లింది. కాగా అదే పులి ఇక్కడికి వచ్చి ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. పులి తిరుగుతున్న సమాచారంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment