హోమియోతో చీడపీడలకు చెక్‌!  | Pest Control With Homeopathic Remedies In Sagubadi | Sakshi
Sakshi News home page

హోమియోతో చీడపీడలకు చెక్‌! 

Published Tue, Oct 27 2020 11:01 PM | Last Updated on Tue, Oct 27 2020 11:08 PM

Pest Control With Homeopathic Remedies In Sagubadi - Sakshi

మనుషులు, జంతువులకే కాదు పంటలకూ హోమియో ఔషధాలు తక్కువ ఖర్చుతో రైతులకు ఎక్కువ ఫలితం వరిలో అగ్గి, కాటుక తెగుళ్లకు.. ఉరకెత్తిన మెట్ట పంటల రక్షణకు హోమియో ఔషధాలు వివిధ పంటలపై గత కొన్నేళ్లుగా హోమియో ఔషధాలు వాడుతూ సత్ఫలితాలు సాధిస్తున్న వైనం రైతు శాస్త్రవేత్త జిట్టా బాల్‌రెడ్డి సూచనలు

మారిన వాతావరణ పరిస్థితిలో వరి పంటకు తెగుళ్లు ఆశించి తీవ్రమైన నష్టాలను ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా కాటుక తెగులు, అగ్గి తెగులు రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోనూ ఈ తెగుళ్లు తీవ్రంగా ఉన్నాయి. తెగుళ్లకు రసాయనిక మందులు పిచికారీ చేసే రైతు సోదరులు మరణించిన దృష్టాంతాలున్నాయి. చేతికొచ్చిన పంట చేజారుతుంటే పంట కాపాడుకోవటానికి రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. అందినకాడికి అప్పులు చేస్తున్నారు. అయినా, ఫలితం లేక చివరాఖరికి పంటకు అగ్గిపెడుతున్నారు. ఈ పరిస్థితి నుంచి బయటపడడానికి ప్రత్యామ్నాయ విధానం రైతులకు తోడునిలుస్తుంది. అగ్గి తెగులుకు మారేడు తులసి కషాయం అద్భుతంగా పనిచేస్తుంది. వ్యవసాయ క్షేత్రాల్లో మొక్కలు కనుమరుగైన పరిస్థితిలో మారేడాకులు శివరాత్రి నాడు శివయ్యకు పెట్టడానికి దొరకవు. ఇక కషాయాలు చేసుకోవడానికేడయితది. ఇగ రైతుకున్న మరో ప్రత్యామ్నాయం హోమియో ఔషధం. అగ్గి తెగులు నివారణకు రైతు సోదరులు ‘బెల్లడోనా 200’, దాని కొనసాగింపుగా ‘కల్కేరియా కార్బ్‌ 200’ పిచికారీ చేసుకుంటే పంటను నిక్షేపంగా కాపాడుకోవచ్చు. దీనికి ఖర్చు కూడా అతి స్వల్పమే అవుతుంది. ఇక తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న కాటుక తెగులుకు ‘తూజా 200’ పిచికారీ చేసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది. 

మిర్చి, కూరగాయ పంటలకు..
ఇటీవల కురిసిన వర్షాల ధాటికి రైతు బతుకు అతలాకుతలమైంది. మాగాణి పంటలు పూర్తిగా దెబ్బతినిపోయాయి. మెట్ట పంటలు, మిర్చి, కూరగాయ పంటలు నీట మునిగి తేలి నీరు చిచ్చు పట్టి (ఉరకెత్తి) వడలిపోతున్నాయి. నీరు చిచ్చుతో దెబ్బతిన్న పంట చేలను కాపాడుకోవచ్చు. ఈ మందులకు ఖర్చు కూడా అతి తక్కువ. రూ. వేలు ఖర్చు చేసినా సాధించలేని ఫలితాన్ని కేవలం రూ. వందల ఖర్చుతో పొందవచ్చు. 

వరద తాకిడికి గురై నీట మునిగి తేలిన పంటలకు మొదట ‘ఫెర్రమ్‌ మెటాలికం 30’ పిచికారీ చేయండి. రెండు రోజుల గడువుతో ‘కార్బోవెజ్‌ 30’ పిచికారీ చేయండి. పంట ఊపిరి పోసుకుంటుంది. కాస్త తేరుకున్న వెంటనే ‘మ్యాగ్ఫాస్‌ 30’ని పిచికారీ చేసుకుంటే పంట పూర్తిగా శక్తిని సంతరించుకుంటుంది. తదుపరి పంట పోషణకు అవసరమైన పోషకాలు మీ మీ పద్ధతిలో అందించండి. ఈ హోమియో ఔషధాలను ఉపయోగిస్తే ఎటువంటి ఇబ్బందీ లేకుండా ఫలసాయం అందుకోగలుగుతారు.  

హోమియో ఔషధాలు వాడే విధానం
ద్రవరూపంలో ఉండే హోమియో మదర్‌ టించర్లను పంటలకు ఉపయోగించాలి. 20 లీటర్ల నీటికి 2.5 మిల్లీ లీటర్ల చొప్పున హోమియో ఔషధం కలిపి పంటలపై పిచికారీ చేసుకోవాలి. ముందుగా లీటరు సీసాను తీసుకొని.. అందులో సగం వరకు నీటిని తీసుకొని, దానిలో 2.5 ఎం.ఎల్‌. హోమియో మందు కలుపుకోవాలి. సీసా మూత బిగించి, 50 సార్లు గట్టిగా కుదుపుతూ ఊపాలి. ఆ మందును పూర్తిగా శుభ్రం చేసుకున్న స్రేయర్‌లో పోసుకోవాలి. ఇప్పుడు స్ప్రేయర్‌లో దాని సామర్థ్యాన్ని బట్టి మిగతా నీరు నింపుకొని పిచికారీ చేసుకోవాలి. ఏ పంట మీదైనా ఏ హోమియో ఔషధాన్నయినా పిచికారీ చేసుకునేందుకు ఇదే పద్ధతిని అనుసరించాలి. 
– జిట్టా బాల్‌రెడ్డి (89782 21966), 
రైతు శాస్త్రవేత్త, అమేయ కృషి వికాస కేంద్రం, 
రామకృష్ణాపురం, యాదాద్రి భువనగిరి జిల్లా

ఆరెకరాల్లో వరి సాగు చేస్తున్నా. రసాయనిక ఎరువులు వాడుతున్నా. రసాయనిక పురుగుమందులు వాడటం ఆపేసి.. వాటికి బదులు మూడేళ్లుగా హోమియో మందులను వాడుతున్నా. అగ్గితెగులుకు బెల్లడోనా30 పిచికారీ చేస్తే చాలు. మొగి పురుగు, ఆకుచుట్టు తెగులు, పోషకాల లోపంతో పండాకు సమస్యకు తూజా30 పిచికారీ చేస్తే సరిపోతుంది. కాండం కుళ్లు వస్తే బావిస్టా 30 చల్లితే చాలు. ఇటువంటి మూడు, నాలుగు మందులు ఉంటే చాలు.. వరి పంటను ఏ చీడపీడలూ దెబ్బతీయకుండా కాపాడుకొని మంచి దిగుబడి పొందవచ్చు అని జిట్టా బాల్‌రెడ్డి సూచన మేరకు అమలు పరచి నా అనుభవంలో గ్రహించా. వరికి ఇతర రైతులు వర్షాకాలంలో ఎకరానికి రూ.3,500–4,000 వరకు రసాయనిక పురుగుమందులకే ఖర్చు పెడుతున్నారు. రబీలో అయితే వీళ్లకు రూ. 2,500 నుంచి 3,000 వరకు కేవలం పురుగుమందుల ఖర్చు వస్తుంది. నాకైతే ఏ కాలంలో అయినా ఎకరానికి అవుతున్న హోమియో మందుల ఖర్చు రూ. 200 లోపే! వేపనూనె, ఇతరత్రా కషాయాలు చల్లాల్సిన అవసరమే లేదు. అయితే, రైతు పంటను గమనించుకుంటూ ఉండి.. పురుగులు, తెగుళ్లు ఆశిస్తున్న తొలి దశలోనే గుర్తించి, పంట మొక్కలు నిలువెల్లా తడిచేలా జాగ్రత్తగా చల్లుకోవాలి. అంతే! హోమియో మందులంత మేలైన ప్రత్యామ్నాయం మరొకటి లేదు. 
– గోడదాటి దశరథ్‌ (93980 49169), 
రత్నాపురం, సూర్యాపేట మండలం/జిల్లా

పంటలకు పదేళ్లుగా హోమియో వాడుతున్నా!
ఐదెకరాల్లో వరి (మొలగొలుకులు 3 రకాలు, నెల్లూరు 40054 రకాలు) సాగు చేస్తున్నా. రసాయనిక ఎరువులు, రసాయనిక పురుగుమందులు వాడకుండా పదేళ్లుగా వరి సాగు చేస్తున్నా. పచ్చిరొట్టను కలియదున్ని దమ్ము చేయటం, పుంగనూరు ఆవుల పేడ ఎరువు వేస్తుంటా. చీడపీడలకు హోమియో మందులు వాడుతున్నా. 22–23 బస్తాల దిగుబడి వస్తుంటుంది. తొలుత విజయవాడ వన్‌టౌన్‌లోని రామకృష్ణ హోమియో స్టోర్‌లో డా. వెలివల రాజేంద్రప్రసాద్‌ సూచన మేరకు పంటలకు, పశువులకూ హోమియో మందులు వాడటం ప్రారంభించాను. వ్యవసాయంలో హోమియోకు డా. వైకుంఠనాథ్‌ రచించిన పుస్తకం ప్రామాణికం. దీని ఆధారంగా జిట్టా బాల్‌రెడ్డి సూచనల ప్రకారం హోమియో మందుల ద్వారా అతి తక్కువ ఖర్చుతో పిచికారీలను పూర్తి చేసుకుంటున్నాం.

రూ. 30ల ఖర్చుతో ‘తూజా’ మందు చల్లి మొలగొలుకుల్లో కాండం తొలిచే పురుగును అరికట్టా. పంట ఎర్రబడినప్పుడు మెగ్నీషియా ఫాస్‌ వాడుతున్నా. దోమ మా పొలంలో ఎప్పుడూ కనపడలేదు. సరైన కంపెనీ మందును, సరైన సమయం (ఉ.8 గం. లోపు లేదా సా. 4 గం. తర్వాత)లో, సరైన మోతాదులో, సరిగ్గా పంట మొక్కలు పూర్తిగా తడిచేలా హోమియో మందులును చల్లుకోవటం అవసరం. మా పొలంలో కలుపు కూడా తియ్యం. ఎలుకల సమస్య తప్ప మరే సమస్యా లేదు. జీవామృతం పిచికారీకి పిలిస్తే వాసన అని కూలీలు రాని పరిస్థితులున్నాయి. హోమియో మందులు వాసన రావు. కాబట్టి ఆ బాధ కూడా లేదు. వీటి అవశేషాలు కూడా పంట దిగుబడుల్లో ఉండవు. ఖర్చు కూడా బాగా తక్కువ.
– పంచకర్ల విష్ణువర్థనరావు (94405 02130), 
అరిసేపల్లి, మచిలీపట్నం మండలం, కృష్ణా జిల్లా

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement