Grass fields
-
సాగుబడి: హైడ్రోపోనిక్స్ పద్ధతిలో గడ్డిసాగుతో మంచి ఆదాయం
ప్రపంచంలోనే అత్యధిక పాలను ఉత్పత్తి చేస్తున్న మన దేశంలో పచ్చిగడ్డి లభ్యత 11 శాతం తక్కువగా ఉందని భారతీయ గడ్డి నేలలు, పశుగ్రాస పరిశోధనా సంస్థ లెక్కగట్టింది. భూతాపం ప్రమాదకరమైన రీతిలో పెరుగుతున్న ప్రస్తుత కాలంలో పచ్చి గడ్డి సాగుకు హైడ్రోపోనిక్స్ పద్ధతి చక్కని ప్రత్యామ్నాయంగా మారుతోంది. ఈ పద్ధతిలో తక్కువ స్థలంలో, పది శాతం నీటితోనే ఏడాది పొడవునా మొలక గడ్డిని పెంచుకోవచ్చు. మొలక గడ్డిని పాడి ఆవులు, గొర్రెలు, మేకలకు మేపటం మన రాష్ట్రాల్లోనే కాదు.. రాజస్థాన్‌లోని థార్ ఎడారి ప్రాంత పశుపోషకులను సైతం ఆకర్షిస్తోంది. అక్కడ ఏడాదిలో రెండు నెలలే వర్షం పడుతుంది. మండు వేసవిలో ఎండ వేడి 120 డిగ్రీల సెల్షియస్‌కు చేరుతుంటుంది. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో జీవించే థార్ ప్రాంత రైతులు, సంచార పశుపోషకులు స్వచ్ఛంద సంస్థలు, స్టార్టప్‌ల తోడ్పాటుతో ఇటీవల హైడ్రోపోనిక్ మొలక గడ్డి సాగు చేపట్టారు. సునాయాసంగా నాణ్యమైన పాల దిగుబడితో పాటు ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. స్వచ్ఛంద సంస్థలు, స్టార్టప్‌లు ఎడారి ప్రాంత రైతులు, పశుపోషకుల కోసం హైడ్రోపోనిక్ మొలక గడ్డిని పెంచే షెడ్లను నెలకొల్పుతున్నాయి. రైతులే వాటిలో మొక్కజొన్నలు, గోధుమలను నానబెట్టి, వర్టికల్ గార్డెన్ మాదిరిగా అనేక దొంతర్లలో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ ట్రేలలో మొలక గడ్డిని పెంచుతున్నారు. సాధారణంగా పొలంలో పచ్చి గడ్డిని పెంచడానికి 2 నెలలు పడుతుంది. మొలక గడ్డి 8 రోజుల్లో పెరుగుతుంది. ముఖ్యంగా పది శాతం నీటితోనే ఈ గడ్డి పెరగటం థార్ ఎడారి ప్రాంత రైతులు, పశుపోషకులకు ఉపయుక్తంగా మారింది. ఏడాది పొడవునా ఆదాయం స్వచ్ఛంద సంస్థ ఉర్ముల్ సీమంత్ సమితి, డిజర్ట్ రిసోర్స్ సెంటర్‌తో కలసి హైడ్రోగ్రీన్స్, బహుళ నేచురల్స్ స్టార్టప్‌లు మొలక గడ్డి ఉత్పత్తి యూనిట్లను థార్ ఎడారి గ్రామాల్లో ఏర్పాటు చేస్తుండటంతో కొందరు మహిళా రైతులు హాయిగా ఊపిరిపీల్చుకుంటున్నారు. బహుళ నేచురల్స్ వీరి వద్ద నుంచి దేశీ ఆవు పాలను, ఒంటె పాలను సేకరించి, విలువ జోడించి ఆన్లైన్లో విక్రయిస్తోంది. వెయ్యి మంది పాడి రైతులు, 4 వేల మంది పశుపోషకులు తమ ఆవులు, మేకలకు మొలక గడ్డిని మేపుకుంటూ ఏడాది పొడవునా స్థిరమైన ఆదాయం పొందుతున్నారు. పశుపోషణ కోసం గొడ్డు చాకిరీ చేసే మహిళా రైతులకు మొలక గడ్డి అందుబాటులోకి రావటం గొప్ప ఊరటనిస్తోంది. మొలక గడ్డి మేపుతో దేశీ ఆవు పాల దిగుబడి మూడింట ఒక వంతు పెరగడంతో పాటు, నాణ్యత కూడా పెరిగిందని రాజస్థాన్‌లోని ఘంటియాలి గ్రామానికి చెందిన దళిత మహిళా పశుపోషకురాలు ‘పలు’, ఆమె భర్త హెమారామ్ సంతోషంగా చెబుతున్నారు. వీరికి 8 ఆవులు, మేకలు ఉన్నాయి. 4 మైళ్ల దూరంలో ఉన్న పొలానికి వెళ్లి గడ్డి కోసుకొని, ఎండలో నెత్తిన పెట్టుకొని మోసుకు రావటం ఆమెకు కనాకష్టంగా ఉండేది. రెండేళ్ల క్రితం ఇంటి పక్కనే మొలకగడ్డి ఉత్పత్తి యూనిట్‌ను ఏర్పాటు చేసుకున్నాక ఆ బాధ తప్పింది. మిగులు గడ్డిని, గోధుమ గడ్డి పొడిని అమ్ముతూ ఆదాయం పొందుతుండటం విశేషం. హైడ్రోపోనిక్స్.. ఎంత ఖర్చవుతుందంటే.. దూడలకు పెట్టే కాన్సంట్రేట్ మిక్చర్ దాణాను 75% తగ్గించి మొక్కజొన్న మొలక గడ్డిని మేపటం వల్ల మంచి ఫలితం కనిపించిందని బికనెర్ వెటరినరీ కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్.కె. ధురియా అన్నారు. హైడ్రోపోనిక్ మొలక గడ్డి వల్ల మేకల్లో జీర్ణశక్తి, పెరుగుదల బాగుందని సౌదీ అరేబియాలోని కింగ్ సౌద్ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడైంది. మొలకగడ్డి యూనిట్ ఏర్పాటుకు రూ. 18 లక్షల నుంచి 25 లక్షల వరకు ఖర్చవుతోంది. అయితే, ఇసుక తుఫాన్లకు మొలకగడ్డి షెడ్లు దెబ్బతినటం వల్ల నష్టం జరుగుతోంది. అందుకని, మున్ముందు షిప్పింగ్ కంటెయినర్లలో మొలకగడ్డి ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయటమే దీనికి పరిష్కారమని బహుళ నేచురల్స్ భావిస్తోంది. లక్షల ఖర్చుతో కూడిన పని కావటంతో రైతులను బృందాలుగా ఏర్పాటు చేసి మొలకగడ్డి యూనిట్లను నెలకొల్పితే మేలు. అయితే, రూ. 17.500 ఖర్చుతో చిన్నపాటి మొలకగడ్డి యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చని హైడ్రోగ్రీన్స్ స్టార్టప్ చెబుతోంది. బయోచార్‌తో సేంద్రియ ఇంటిపంటల సాగుపై శిక్షణ సేంద్రియ ఇంటిపంటల సాగుపై పట్టణ/నగర వాసులపై ఆసక్తి పెరుగుతోంది. బయోచార్ (బొగ్గుపొడి) కలిపిన మట్టి మిశ్రమంతో టెర్రస్ గార్డెన్లు, పెరటి తోటలు, బాల్కనీలలో కూరగాయల పెంపకంపై ఈ నెల 24, 25 తేదీల్లో హైదరాబాద్ మలక్‌పేటలోని న్యూలైఫ్ ఫౌండేషన్ శిక్షణ ఇవ్వనుంది. మిగులు పంట దిగుబడులను సోలార్ డ్రయ్యర్‌తో ఎండబెట్టే విధానం కూడా వివరిస్తామని న్యూలైఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శివ షిండే తెలిపౠరు. వివరాలకు.. 81210 08002. 17న అమలాపురంలో ప్రకృతి సేద్యంపై శిక్షణ శ్రీనివాస సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 17న కోనసీమ జిల్లా అమలాపురంలోని (ముక్తేశ్వరం– కొత్తపేట రోడ్డు) శ్రీసత్యనారాయణ గార్డెన్స్‌లో ప్రకృతి వ్యవసాయంపై నిపుణులు విజయరామ్ రైతులకు అవగాహన కల్పిస్తారని నిర్వాహకులు నిమ్మకాయల సత్యనారాయణ తెలిపౠరు. ప్రవేశం ఉచితం. ముందుగా పేరు నమోదు చేసుకోవాలి. వివరాలకు.. 64091 11427 (సా. 3 గం. నుంచి 6 గం. వరకు మాత్రమే). -
పొదల చాటున సంతాన వృద్ధి
జన్నారం (ఖానాపూర్): కవ్వాల్ టైగర్ జోన్లో అటవీశాఖ అధికారులు చేపట్టిన గడ్డి క్షేత్రాల పెంపకం సత్ఫాలితాలను ఇస్తోంది. గడ్డి మైదానాల పెంపకంతో రెండేళ్లలో టైగర్‌జోన్ పరిధి లో 40శాతం శాఖాహార జంతువులు పెరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో పులికి సమృద్ధిగా ఆహారం అందుబాటులో ఉంటుందని వారు భావిస్తున్నారు. అడవిలో వన్యప్రాణుల జనాభా వాటి ఆవాస ప్రాంతాల్లో విస్తరించి ఉన్న గడ్డి ప్రాంతాలపై ఆధారపడి ఉంటుంది. శాఖాహార జంతువులు అధికంగా ఉంటే వాటిపై ఆధారపడిన మాంసాహార జంతువుల జనాభా కూడా పెరుగుతోంది. చదవండి: బంగారు చేప.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన మత్య్సకారుడు 2018లో ప్రారంభం.. కవ్వాల్ టైగర్ జోన్ 893 హెక్టర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ ప్రాంతాన్ని 2012లో కేంద్ర ప్రభుత్వం టైగర్‌జోన్‌గా ప్రకటించింది. అప్పటి నుంచి అడపాదడపా పులులు రాకపోకలు సాగిస్తున్నా.. స్థానికంగా స్థిర నివాసం ఏర్పర్చుకున్న దాఖలాలు లేవు. జీవావరణ వ్యవస్థలో గడ్డి జాతుల ప్రాధాన్యం అధికంగా ఉంటుంది. ఆహారపు గొలుసులో మొక్కలు ప్రథమ ఉత్పత్తి దారులుగా నిలుస్తాయి. వీటిపై జింకలు, దుప్పులు, సాంబర్లు, నీలుగాయిలు, కొండగొర్రెలు, అడవి దున్నలు, ఇతర వన్యప్రాణులు ఆధారపడి ఉంటాయి. శాఖాహార జంతువులపై ఆధారపడి పెద్ద పులులు, చిరుతలు, నక్కలు, అటవీ కుక్కలు, తోడేళ్లు తదితర జంతువులు మనుగడ సాగిస్తాయి. పులులకు స్థానికంగా తగినంత ఆహారాన్ని వృద్ధి చేయాలనే ఉద్దేశంతో కవ్వాల్ టైగర్ జోన్లో గడ్డి క్షేత్రాల పెంపకానికి అధికారులు శ్రీకారం చుట్టారు. 2018 సంవత్సరంలో మహారాష్ట్రకు చెందిన గడ్డి క్షేత్రాల నిపుణుడు డాక్టర్ జీడీ మురత్కర్ జన్నారం డివిజన్లోని టీడీసీ టైగర్‌జోన్‌లో అటవీశాఖ అధికారులకు గడ్డి పెంపకంపై శిక్షణ ఇచ్చారు. సహజ గడ్డి క్షేత్రాలు, విత్తనాల సేకరణ, ముళ్ల కంచెల తొలగింపు, కలుపుమొక్కల నివారణ, గడ్డి విత్తనాల నిల్వ, సస్యరక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అదే ఏడాది 600 ఎకరాల్లో గడ్డి మైదానాల పెంపకానికి శ్రీకారం చుట్టారు. ఏటా పెంపకం.. శిక్షణ అనంతరం గడ్డి క్షేత్రాల పెంపకంలో స్థానిక అధికారులు చురుగ్గా పనిచేయడంతో దేశంలోని టైగర్‌జోన్‌లో కవ్వాల్జోన్కు మంచిపేరు వచ్చింది. 2018 సంవత్సరంలో 600 ఎకరాల్లో గడ్డి మైదానాలు పెంచగా.. 2019లో 130 హెక్టర్లలో, 2020లో 200 హెక్టార్లలో, ఈ ఏడాది మరో 180 హెక్టార్లలో గడ్డి మైదానాల పెంపకంపై దృష్టి సారించారు. కొన్ని ప్రాంతాలలో గడ్డి విత్తనాలను చల్లి సహజసిద్ధంగా గడ్డిని పెంచుతున్నారు. మరికొన్ని ప్రాంతాలలో సహజసిద్ధంగా మొలిచిన గడ్డి చుట్టూ కంచె వేసి, కలుపు తొలగిస్తారు. అడవిలోని వన్యప్రాణులకు ఆహారం, నీరు ఒకచోట అందుబాటులో ఉండేవిధంగా అధికారులు చొరవ తీసుకుంటున్నారు. నీటి కుంట ఉన్న ప్రాంతంలోనే గడ్డి పెంపకం చేపడితే వన్యప్రాణులు అహారం తిని అక్కడే నీరు తాగి సేదదీరేందుకు వీలుంటుందని వారు భావిస్తున్నారు. పెరుగుతున్న శాఖాహారులు.. గడ్డి క్షేత్రాల పెంపకంతో రెండేళ్లుగా శాఖాహార జంతువుల సంఖ్య 40 శాతం పెరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. పెరుగుదల ఇదేవిధంగా ఉంటే పది పులులకు సరిపడా ఆహారం స్థానికంగా లభిస్తుందని వారు అంటున్నారు. ప్రస్తుతానికి రెండు పులులు కవ్వాల్ టైగర్‌జోన్‌లోని జన్నారం అటవీ డివిజన్‌లోకి రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే స్థానికంగా దట్టమైన అడవులు, సరిపడా శాఖాహార జంతువులు ఉన్నా పులులు స్థిర ఆవాసం ఏర్పాటు చేసుకోవడం లేదు. తిప్పేశ్వర్, తాడోబా టైగర్‌జోన్‌ల నుంచి కూడా పులుల రాకపోకలు ఉన్నాయి. దట్టమైన అటవీప్రాంతం, గడ్డి మైదానాలు, వేటాడేందుకు సరిపడా వన్యప్రాణుల అభివృద్ధిపై అధికారులు దృష్టి సారించారు. అటవీ ప్రాంతంలో అలికిడిని తగ్గించి పులులు స్థానికంగా ఆవాసం ఏర్పాటు చేసుకునేందుకు ఈ ప్రాంతాన్ని అధికారులు తీర్చిదిద్దుతున్నారు. విరివిగా గడ్డి మైదానాలు 2018 నుంచి గడ్డి క్షేత్రాలను విరివిగా పెంచుతున్నాం. గతేడాది 200 హెక్టర్లలో గడ్డి మైదానాలు పెంచాం. దాని నిర్వహణ చూస్తూనే ఈ ఏడాది మరో 180 హెక్టార్లలో గడ్డిక్షేత్రాలను విస్తరిస్తున్నాం. కచ్చితమైన సంఖ్య తెలియకున్నా.. డివిజన్ పరిధిలో వన్యప్రాణుల సంతతి పెరుగుతోంది. రాత్రిపూట అడవి గుండా రాకపోకలు నిషేధించాం. వన్యప్రాణులు స్వేచ్ఛగా తిరిగేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. - మాధవరావు, డివిజన్ ఫారెస్టు అధికారి -
పచ్చి మేత కొరత తీర్చే ‘జూరీ’
పచ్చిక బయళ్లు లేక మూగజీవాలు పశుగ్రాసానికి తీవ్ర ఇబ్బందులు పడుతుంటాయి. ప్రత్యేకించి చలికాలంలో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో గడ్డి పెరుగుదల మందకొడిగా ఉండటంతో పాటు పోషకాల లోపంతో పశు సంతతుల ఎదుగుదల కూడా తక్కువగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర లైవ్‌స్టాక్ ఫారమ్ అధికారులు స్వల్పకాలంలో, తక్కువ స్థలంలో అధిక పోషకాలుండే గడ్డి జాతుల పెంపకాన్ని రైతులకు సూచిస్తున్నారు. అందులో ఒకటి జూరీ గడ్డి. నాటుకున్న తర్వాత కనీసం పదేళ్ల పాటు తిరిగి చూడాల్సిన పని ఉండదు. నీటి వసతి ఉండే భూములు ఈ గడ్డి పెంపకానికి అనుకూలం. గినీ జాతి రకానికి చెందిన పానికమ్ గడ్డి రకాలలో జూరీ ఒకటి. అధిక పోషకాలు ఉండి ఎక్కువ పాల ఉత్పత్తికి, దూడల పెరుగుదలకు తోడ్పడుతుంది. ఈ గడ్డిని నీడలో సైతం పెంచవచ్చు. ఉద్యాన తోటల్లో అంతర పంటగా కూడా వేయవచ్చు. గడ్డి కత్తిరించే యంత్రాలు లేని రైతులు ఈ జూరీ గడ్డిని సాగుచేసుకొని యథాతథంగా మేపుకోవచ్చు. ఆకులు ఎక్కువ, కాండం తక్కువగా ఉంటుంది. ఈ పశుగ్రాసంలో మాంసకృత్తులు ఎక్కువ. ఫలితంగా పాల దిగుబడి పెరుగుతుంది. ఆవులు, గేదెలతో పాటు గొర్రె, మేక పిల్లలు కూడా జూరీ గడ్డిని ఇష్టంగా తింటాయి.చౌడు నేలలు తప్ప మిగతా భూములన్నింటిలో ఈ గడ్డిని పెంచవచ్చు. రెండు రకాలుగా– నారు, పిలకల పద్ధతిన– సాగు చేయవచ్చు. ఈ గడ్డి విత్తనాలు చాలా తేలికగా గాలికి ఎగిరిపోయేలా ఉంటాయి. అందువల్ల 2:1 నిష్పత్తిలో ఇసుకను కలిపి నారుమడి పోసుకోవాలి. విత్తనాలపై పలుచగా మట్టిలో కప్పి దానిపైన వరి గడ్డిని పొరగా వేసి నీరు చల్లాలి. విత్త చల్లిన ఐదారు రోజుల్లో మొలకలు వస్తాయి. ఇలా వచ్చిన మొక్కల్ని 30, 40 రోజుల్లో పొలంలో నాటుకోవచ్చు. నాటు వేయడానికి ముందు పొలంలో ఎరువులు వేసి పొలాన్ని సిద్ధం చేసుకోవాలి. మొక్కల్ని 2.5 అడుగుల దూరంలో నాటుకోవాలి. ఇలా నాటిన మొక్కలు 65, 70 రోజుల్లో మొదటి కోతకు వస్తాయి. రెండో పద్ధతిలో దుబ్బులు కట్టిన జూరీ గడ్డి మొదళ్ల దగ్గర వచ్చే పిలకల్ని వేరు చేసి పొలంలో నాటుకోవచ్చని గన్నవరంలోని ఎన్టీఆర్ వెటర్నరీ సైన్సెస్ (లైవ్‌స్టాక్ ఫారమ్ కాంప్లెక్స్) అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్కే సౌజన్య లక్ష్మి వివరించారు. అధిక పశుగ్రాస దిగుబడికి ప్రతి కోత అనంతరం తగు మోతాదులో ఎరువు వేసి నీటి తడి పెట్టాలని ఆమె సూచించారు. జూరీ గడ్డి విత్తనాల ఉత్పత్తి జరుగుతోంది. వచ్చే వేసవిలో రైతులకు అందించే అవకాశం ఉంది. – ఆకుల అమరయ్య, విజయవాడ -
వరి గడ్డిని సుపోషకం చేయటం ఎలా?
తెలుగు రాష్ట్రాల్లో వరి గడ్డి ప్రధానమైన పశుగ్రాసం వరి గడ్డిని ఎండబెట్టి వాముగా వేసి వేసవిలో పశువుల మేతగా వాడుట సహజం. కానీ వరి గడ్డి పోషక పదార్థాల రీత్యా పాల దిగుబడికి అంత దోహదకారి కాదు. అంతేకాక వరి గడ్డిలో పశువు శరీరంలో ఉండే ముఖ్యమైన లవణ ధాతువు కాల్షియంను నష్టపరిచే లక్షణం ఉంది. వరి గడ్డిలో మాంసకృత్తులు లేవు. జీర్ణమవదగ్గ ఆహార పదార్థాలు కేవలం 45% ఉన్నాయి. కాబట్టి వరిగడ్డిని సుపోషకం చేయటం అవసరం. వరి గడ్డిని సుపోషకం చేయడానికి యూరియాని వాడుతారు. ఈ పద్ధతిని ‘యుటిపిఎస్’ అని కూడా అంటారు. వరి గడ్డిని యూరియాతో సుపోషకం చేసే పద్ధతి: ఒక రోజుకు ఒక పాడి పశువుకు 6 కేజీల సుపోషకం చేసిన వరి గడ్డిని ఆహారంగా ఇవ్వవచ్చు. దీని ప్రకారం ఒక పశువుకు ఒక వారానికి దాదాపు 50 కేజీల సుపోషకం చేసిన వరి గడ్డి అసవరమవుతుంది. రెండు పద్ధతులతో వరి గడ్డిని యూరియాతో సుపోషకం చేయవచ్చు. 100 కిలోల వరి గడ్డికి, 4 కిలోల యూరియా 60 లీటర్ల నీళ్లు అవసరమవుతాయి. మొదట యూరియాను నీళ్లలో బాగా కరిగేటట్లు చూడాలి. తరువాత వరి గడ్డిని నేల మీద పరచి యూరియా కరిగిన నీళ్లను గడ్డిపై పూర్తిగా తడిచేలా చల్లాలి. తరువాత యూరియా నీటితో తడిపిన గడ్డిని పాతర గోతిలో గాని, యూరియా బస్తాలలలో గాని లేదా ప్లాస్టిక్ షీట్‌తో గానీ గాలి చొరబడకుండా జాగ్రత్తగా భద్రపరచి వారం రోజుల పాటు మాగనిస్తే వరి గడ్డి వాడకానికి సిద్ధం అవుతుంది. వరి గడ్డిని సుపోషకం చేయడం వల్ల లాభాలు: 1 వరి గడ్డిలో ఉండే పీచు పదార్థం తగ్గి పశువులు ఎక్కువ మేతను తినగలవు, జీర్ణం చేసుకోవడం కూడా సులభం. 2 ఈ పద్ధతిలో వరి గడ్డిలో మాంసకృత్తులను 0 నుంచి 5% పెంచవచ్చు. 3 వరి గడ్డిలో ఉండే జీర్ణమవదగ్గ ఆహార పదార్థాలు 45% నుంచి 60% పెరుగుతాయి. 4 ఎండు వరి గడ్డిలో తేమ శాతం 10% ఉండి తినడానికి ఇబ్బంది ఉంటుంది. సుపోషకం చేయడం వలన తేమను 45–50% పెంచవచ్చు. 5 యూరియాతో సుపోషకం చేయటం వలన తక్కువ ఖర్చుతో మాంసకృత్తులను పొందవచ్చు. 6 ఈ పద్ధతి పాడి రైతులు అమలు చేయడానికి అనువైనది, సులభమైనది. 7 సుపోషకం చేయబడిన గడ్డి రంగు ముదురు గోధుమ రంగుగా మారి కొద్దిగా అమ్మోనియా వాసన వస్తుంది. ఈ గడ్డి వాడకం వలన పొల ఉత్పత్తి, పని చేసే శక్తి పెరుగుతాయి. కొన్ని పశువులు మొదట ఈ గడ్డిని తినడానికి ఇష్టపడకపోవచ్చు. అటువంటి వాటికి కొద్దికొద్దిగా మేపి అలవాటు చేయాలి. పశుపోషణలో పచ్చిమేత, దాణా ఎంత ముఖ్యమో.. వాటి ద్వారా ఖనిజ లవణాల లభ్యత కూడా అంతే ముఖ్యం. అంతేగాక పాడి పశువుల పాల ఉత్పత్తి స్థాయితో పాటు వాటి శరీర కార్యక్రమాలను నిర్వర్తిస్తూ నష్టాలను భర్తీ చేసుకుంటూ ఆరోగ్యవంతంగా ఉండడానికి అవసరమైనంత ఖనిజ లవణాలను అందించడం కూడా అంతే ముఖ్యం. -
గ్రాసం కోసం పశువుల విలవిల
సాక్షి, ఇల్లందకుంట: వేసవి ముదిరే కొద్దీ కరువు మేఘాలు కమ్ముకొస్తున్నాయి. హుజూరాబాద్ నియోజకవర్గంలో పశుగ్రాసం కొరత ఏర్పడింది. వర్షాభావంతో ఖరీఫ్‌లో పంటలు పండక గ్రాసానికి అవస్థలు తప్పడం లేదు. మూగజీవాలకు మేతకోసం ఇతర ప్రాంతాలకు ప్రతిరోజు వాహనాలపై కాపరులు తరలిస్తున్నారు. ప్రభుత్వం ఉపాధిహామీ పథకం ద్వారా పశువుల మేత పెంపకానికి కార్యక్రమాలు చేస్తున్న క్షేత్రస్థాయిలో రైతులకు అందడం లేదు. పశు సంవర్ధక శాఖ పంపిణీ చేస్తున్న పశుగ్రాసం, విత్తనాపంపిణీ మొక్కుబడిగా మారింది. ఫలితంగా పశువులను రైతులు సంతలో విక్రయిస్తున్నారు. ఉపాధి, వాటర్‌షెడ్ పథకాల్లో భాగంగా పశుగ్రాసాన్ని పెంచేందుకు ముందుకు వచ్చిన రైతులకు సంబంధిత శాఖ సిబ్బంది నుంచి ప్రోత్సాహం కరువైంది. కొంతమంది రైతులే ఈ ప్రయోజనాన్ని పొందుతున్నారు. ముందస్తు సమాచారం లేక ఉచిత విత్తనాలు ఇతర రైతులకు అందలేదు. ఉపాధిహామీ పథకంలో పశుగ్రాసం పెంపకానికి చేపట్టిన కార్యక్రమం నివేదికలకే పరిమితమైంది. సమాచార లోపంతో రైతులకు ఉచిత విత్తనాలు కరువయ్యాయి. ఇప్పటికే మండలవ్యాప్తంగా పశుసందప తగ్గుముఖం పడుతోంది. ఇటు పశుగ్రాసం కొరత అన్నదాతను కలవరపెడుతోంది. ఎడ్లబండిలోడ్ వరి గ్రాసానికి రూ.వెయ్యికి పైగా, ట్రాక్టర్ వరి గ్రాసాన్ని రూ.6వేల వరకు కొనుగోలు చేస్తున్నారు. మండలంలో పశు సంపదను కాపాడుకునేందుకు రైతులు కష్టాలు పడుతున్నారు. పశువులను పోషిస్తున్న రైతులు గ్రాసం కోసం అధిక ధరలు వెచ్చించి పశు సంపదను కాపాడుకుంటున్నారు. మొక్కుబడిగా విత్తనాల పంపిణీ ప్రభుత్వ పరంగా పశు సంవర్ధక, వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో పంపిణీ చేసే గ్రాసం విత్త నాలు మొక్కుబడిగా అందిస్తున్నారు. అవి కూ డా పలుకుబడి ఉన్నవారికి ఇస్తున్నారు. విత్తనాల సరఫరా చేస్తున్న ట్లు ఎలాంటి సమాచారం ఇవ్వరూ. తీరా విషయం తెలుసుకొని వెళ్లే సరికి విత్తనాలు ఉండడం లేదు. - అంబటి రమేశ్, రైతు తక్కువకు అమ్ముతున్నం వేసవికాలం కరువు పరిస్థితులతో తక్కువ ధరలకు పశువులను విక్రయిస్తున్నాం. వేలకు వేలు డబ్బులు ఖర్చులు పెట్టినా గ్రాసం మార్కెట్లో దొరకడం లేదు. ప్రభుత్వం కల్పిస్తున్నా రాయితీలు అందడం లేదు చివరికీ పశుసంపద అంతరించి పోయే ప్రమాదం కనిపిస్తుంది. ఏంచేయాలో అర్థం కావడం లేదు. – చెన్నారెడ్డి, రైతు తిప్పలు పడుతున్నాం మూగజీవాలకు పశుగ్రాసం అందించేందుకు నా నా ఇబ్బందులు పడుతున్నాం. ఇతర ప్రాంతాల కు వేలాది రూపాయల డబ్బులు పెట్టి దిగుమతి చేసుకోవాల్సివస్తుంది. దీంతోఆర్థికంగా ఇబ్బందులుపడుతున్నాం. మా సమస్యపై అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలి. – దార సదయ్య , రైతు -
సాగు తక్కువ..మేత ఎక్కువ..
పొడుగు చేతుల పందేరంలా ఊరూరా గడ్డి క్షేత్రాలు - జిల్లాలో 604 ఎకరాల్లో పచ్చిమేత సాగు - టీడీపీ నేతలకు వరంగా మారిన పథకం ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు ఇప్పర్ల నాగేశ్వరరావు. ఈయనది కొండాయపల్లె గ్రామం. 13 బర్రెలను పోషించుకుంటూ.. పాలను విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈయన చిన్నచౌక్ పొలాల్లో ఓ రెండు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని పచ్చిమేత కోసం ఏడాదికి రూ.16 వేలు నగదు చెల్లించి సాగు చేస్తున్నారు. ఈయనను సాక్షి పలుకరించి ఊరూరా గడ్డి క్షేత్రాల్లో గడ్డి సాగు చేసుకోవడానికి పథకం ఉంది కదా? మీరు ఎందుకు దాన్ని వినియోగించుకోలేదని ప్రశ్నించగా దాని గురించే తనకు తెలియదన్నారు. కడప అగ్రికల్చర్: రైతు సంక్షేమమే ధ్యేయమంటూ ప్రభుత్వం ఊదరగొడుతోంది. అయితే నిజమైన పాడి రైతులకు పథకాలు అందకుండా పొడుగు చేతుల పందేరంలా పంచిపెడుతోంది. పచ్చగడ్డి దొరక్క రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఈ తరుణంలో అన్నదాతలను ఆదుకుంటామంటూ ప్రభుత్వం ముందుకొచ్చి ఊరూరా గడ్డి క్షేత్రాలు ఏర్పాటు చేసుకునేలా వీలుకల్పించింది. గ్రామ స్థాయిలో అధికార పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు వీటిని తమ వర్గం వారికే కావాలని పట్టుబట్టారు. మెజార్టీ గ్రామాల్లో అటు ఉపాధిహామీ, పశుసంవర్ధకశాఖ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి ఇప్పించుకున్నారనే విమర్శలు కోకొల్లలు. నిజమైన రైతులకు ఈ గడ్డి క్షేత్రాలు అందలేదని ఆరోపిస్తున్నారు. తమ వాళ్లకే కావాలని కమలాపురం, మైదుకూరుకు చెందిన టీడీపీ నేతలు అధికారులు, ఫీల్డ్ అసిస్టెంట్లపై ఒత్తిడి తీసుకువచ్చి నిజమైన రైతులకు దక్కకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అంతటా ఇలాగే ఉందని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. పశువుల మేతకు కూడా రాజకీయాలు అంటగట్టం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఇంత దారుణంగా గత ప్రభుత్వంలోని నాయకులు వ్యవహరించలేదని దుమ్మెత్తిపోస్తున్నా రు. పశవుల నోటికాడి మేతను కూడా తమ వర్గీయులకు ఇప్పించుకోవడం ఏమిటని రైతు సంఘాలు దుయ్యబడుతున్నాయి. నిబంధనలు ఇలా జిల్లాలో 604 ఎకరాల్లో పచ్చిగడ్డి సాగు చేసుకునేందుకు అనుమతులు ఇచ్చారు. ముందుగా రైతులను గుర్తించి ప్రోత్సాహాన్ని అందించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. గ్రామీణ ఉపాధిహామీ, జిల్లా పశుసంవర్ధకశాఖలకు విడివిడిగా గడ్డి సాగు చేసే రైతులను గుర్తించే బాధ్యతను అప్పగించారు. ఎవరికి వారుగా గుర్తించినా చివరకు గడ్డిసాగుకు లీజు అనుమతులను పశుసంవర్ధకశాఖ ఇచ్చేలా నిబంధనలు రూపొందించారు. పశుగ్రాసం కొరత ఉన్న గ్రామాలను గుర్తించడం, సాగుచేసే ఔత్సాహికులను ఎంపిక చేయడం, గడ్డిసాగుకు ఉపాధిహామీ పథకంలోని నిధులను అనుసంధానం చేయడం, భూమి, బోరుబావి ఉండే రైతులతో గడ్డి సాగు చేయించి పశువులుండి భూమిలేని వారికి ఈ గడ్డిని రూపాయి లెక్కతో ప్రభుత్వం అందించేలా నిబంధనలు రూపొందించారు. పశుసంవర్ధకశాఖ గుర్తించే రైతులకు సంవత్సరానికి రూ.19 వేలు, రెండు సంవత్సరాలకు రూ.23 వేలు, అదే ఉపాధిహామీలో గడ్డి సాగు చేసుకునేవారికి సంవత్సరానికి రూ.15 వేలు, రెండేళ్లకు రూ.40 వేలు ఇచ్చేలా నిర్ణయించారు. అయితే పశుసంవర్ధశాఖ వారు గుర్తించే వారు ఎన్ని ఎకరాల్లోనైనా గడ్డిని సాగు చేసుకోవచ్చు. అదే ఉపాధిహామీలో కేవలం 5 ఎకరాలకు మాత్రమే అనుమతులు ఇచ్చారు. రోజుకు 3825 మెట్రిక్ టన్నుల పచ్చిమేత. జిల్లాలో రాయచోటి, పులివెందుల, రైల్వేకోడూరు నియోజవర్గాల్లో ఆవులు, ఇతర నియోజకవర్గాల్లో బర్రెలు కలిపి 7.65 లక్షలు ఉన్నాయి. వీటికి రోజుకు 5 కిలోల చొప్పున పచ్చిమేతను అందిస్తారు. ఈ లెక్కన రోజుకు 3825 మెట్రిక్ టన్నుల పచ్చిమేత కావాల్సి ఉంటుంది. వర్షాభావ నేపథ్యంలో ఈ గడ్డిని అందించడం రైతులకు సాధ్యం కావడంలేదు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పచ్చిమేత సాగుకు అనుమతులు ఇచ్చింది. రూ.22.50 లక్షల నిధులు విడుదల చేసిన ప్రభుత్వం.. జిల్లాలో ఊరురా గడ్డిక్షేత్రాలు సాగు చేయడానికి రాష్ట్ర పశుసంవర్ధకశాఖకు జిల్లా పశుసంవర్ధకశాఖ రూ.40 లక్షలకు ప్రతిపాదనలు పంపారు. అయితే ప్రభుత్వం మాత్రం రూ.22.50 లక్షలు నిధులు విడుదల చేసింది. ఈ నిధులు టీడీపీలోని ద్వితీయ శ్రేణినాయకులకు వరంగా మారాయి. సాగు చేసింది తక్కువ మెక్కింది ఎక్కువ అన్న ఆరోపణలు మెండుగా ఉన్నాయి. సాగు చేసిన ఆయా పచ్చనేతల అనుచర రైతులు అధికారులు సందర్శనకు వస్తున్నారని చెప్పగానే అప్పటికప్పుడు సమీప అన్నదాతలను పిలిపించి గడ్డికోసుకుపొమ్మని చెబుతుండడం చాలాచోట్ల కనిపిస్తోందని పశుసంవర్ధకశాఖలోని కొందరు అధికారులు పెదవి విరుస్తున్నారు. ఇది నిజంగా నిజమైన రైతులకు ఒక వరం అయితే టీడీపీలోని ద్వితీయ శ్రేణి నాయకులకు వనభోజనం లాంటిందని అంటున్నారు. రైతుల గుర్తింపులో నిబంధనలు పాటించాం ఊరూరా గడ్డిక్షేత్రాల్లో ఎక్కడ కూడా పొరపాట్లు చోటు చేసుకోలేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రామాల్లో పశుసంవర్ధకశాఖ డాక్టర్లు, సిబ్బంది, ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లు పక్కాగా రైతులను, భూములను గుర్తించి సాగు చేయించారు. ఇందులో ఎలాంటి అనుమానాలు లేవు. ఏవైనా తప్పులు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే నిజమైన రైతులకు న్యాయం చేస్తాం. –సత్యప్రకాష్, డిప్యూటీ డైరెక్టర్, జిల్లా పశుసంవర్ధకశాఖ