పొడుగు చేతుల పందేరంలా ఊరూరా గడ్డి క్షేత్రాలు
- జిల్లాలో 604 ఎకరాల్లో పచ్చిమేత సాగు
- టీడీపీ నేతలకు వరంగా మారిన పథకం
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు ఇప్పర్ల నాగేశ్వరరావు.
ఈయనది కొండాయపల్లె గ్రామం. 13 బర్రెలను పోషించుకుంటూ.. పాలను విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈయన చిన్నచౌక్ పొలాల్లో ఓ రెండు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని పచ్చిమేత కోసం ఏడాదికి రూ.16 వేలు నగదు చెల్లించి సాగు చేస్తున్నారు. ఈయనను సాక్షి పలుకరించి ఊరూరా గడ్డి క్షేత్రాల్లో గడ్డి సాగు చేసుకోవడానికి పథకం ఉంది కదా? మీరు ఎందుకు దాన్ని వినియోగించుకోలేదని ప్రశ్నించగా దాని గురించే తనకు తెలియదన్నారు.
కడప అగ్రికల్చర్: రైతు సంక్షేమమే ధ్యేయమంటూ ప్రభుత్వం ఊదరగొడుతోంది. అయితే నిజమైన పాడి రైతులకు పథకాలు అందకుండా పొడుగు చేతుల పందేరంలా పంచిపెడుతోంది. పచ్చగడ్డి దొరక్క రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఈ తరుణంలో అన్నదాతలను ఆదుకుంటామంటూ ప్రభుత్వం ముందుకొచ్చి ఊరూరా గడ్డి క్షేత్రాలు ఏర్పాటు చేసుకునేలా వీలుకల్పించింది. గ్రామ స్థాయిలో అధికార పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు వీటిని తమ వర్గం వారికే కావాలని పట్టుబట్టారు. మెజార్టీ గ్రామాల్లో అటు ఉపాధిహామీ, పశుసంవర్ధకశాఖ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి ఇప్పించుకున్నారనే విమర్శలు కోకొల్లలు.
నిజమైన రైతులకు ఈ గడ్డి క్షేత్రాలు అందలేదని ఆరోపిస్తున్నారు. తమ వాళ్లకే కావాలని కమలాపురం, మైదుకూరుకు చెందిన టీడీపీ నేతలు అధికారులు, ఫీల్డ్ అసిస్టెంట్లపై ఒత్తిడి తీసుకువచ్చి నిజమైన రైతులకు దక్కకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అంతటా ఇలాగే ఉందని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. పశువుల మేతకు కూడా రాజకీయాలు అంటగట్టం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఇంత దారుణంగా గత ప్రభుత్వంలోని నాయకులు వ్యవహరించలేదని దుమ్మెత్తిపోస్తున్నా రు. పశవుల నోటికాడి మేతను కూడా తమ వర్గీయులకు ఇప్పించుకోవడం ఏమిటని రైతు సంఘాలు దుయ్యబడుతున్నాయి.
నిబంధనలు ఇలా
జిల్లాలో 604 ఎకరాల్లో పచ్చిగడ్డి సాగు చేసుకునేందుకు అనుమతులు ఇచ్చారు. ముందుగా రైతులను గుర్తించి ప్రోత్సాహాన్ని అందించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. గ్రామీణ ఉపాధిహామీ, జిల్లా పశుసంవర్ధకశాఖలకు విడివిడిగా గడ్డి సాగు చేసే రైతులను గుర్తించే బాధ్యతను అప్పగించారు. ఎవరికి వారుగా గుర్తించినా చివరకు గడ్డిసాగుకు లీజు అనుమతులను పశుసంవర్ధకశాఖ ఇచ్చేలా నిబంధనలు రూపొందించారు. పశుగ్రాసం కొరత ఉన్న గ్రామాలను గుర్తించడం, సాగుచేసే ఔత్సాహికులను ఎంపిక చేయడం, గడ్డిసాగుకు ఉపాధిహామీ పథకంలోని నిధులను అనుసంధానం చేయడం, భూమి, బోరుబావి ఉండే రైతులతో గడ్డి సాగు చేయించి పశువులుండి భూమిలేని వారికి ఈ గడ్డిని రూపాయి లెక్కతో ప్రభుత్వం అందించేలా నిబంధనలు రూపొందించారు.
పశుసంవర్ధకశాఖ గుర్తించే రైతులకు సంవత్సరానికి రూ.19 వేలు, రెండు సంవత్సరాలకు రూ.23 వేలు, అదే ఉపాధిహామీలో గడ్డి సాగు చేసుకునేవారికి సంవత్సరానికి రూ.15 వేలు, రెండేళ్లకు రూ.40 వేలు ఇచ్చేలా నిర్ణయించారు. అయితే పశుసంవర్ధశాఖ వారు గుర్తించే వారు ఎన్ని ఎకరాల్లోనైనా గడ్డిని సాగు చేసుకోవచ్చు. అదే ఉపాధిహామీలో కేవలం 5 ఎకరాలకు మాత్రమే అనుమతులు ఇచ్చారు.
రోజుకు 3825 మెట్రిక్ టన్నుల పచ్చిమేత.
జిల్లాలో రాయచోటి, పులివెందుల, రైల్వేకోడూరు నియోజవర్గాల్లో ఆవులు, ఇతర నియోజకవర్గాల్లో బర్రెలు కలిపి 7.65 లక్షలు ఉన్నాయి. వీటికి రోజుకు 5 కిలోల చొప్పున పచ్చిమేతను అందిస్తారు. ఈ లెక్కన రోజుకు 3825 మెట్రిక్ టన్నుల పచ్చిమేత కావాల్సి ఉంటుంది. వర్షాభావ నేపథ్యంలో ఈ గడ్డిని అందించడం రైతులకు సాధ్యం కావడంలేదు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పచ్చిమేత సాగుకు అనుమతులు ఇచ్చింది.
రూ.22.50 లక్షల నిధులు విడుదల చేసిన ప్రభుత్వం..
జిల్లాలో ఊరురా గడ్డిక్షేత్రాలు సాగు చేయడానికి రాష్ట్ర పశుసంవర్ధకశాఖకు జిల్లా పశుసంవర్ధకశాఖ రూ.40 లక్షలకు ప్రతిపాదనలు పంపారు. అయితే ప్రభుత్వం మాత్రం రూ.22.50 లక్షలు నిధులు విడుదల చేసింది. ఈ నిధులు టీడీపీలోని ద్వితీయ శ్రేణినాయకులకు వరంగా మారాయి. సాగు చేసింది తక్కువ మెక్కింది ఎక్కువ అన్న ఆరోపణలు మెండుగా ఉన్నాయి. సాగు చేసిన ఆయా పచ్చనేతల అనుచర రైతులు అధికారులు సందర్శనకు వస్తున్నారని చెప్పగానే అప్పటికప్పుడు సమీప అన్నదాతలను పిలిపించి గడ్డికోసుకుపొమ్మని చెబుతుండడం చాలాచోట్ల కనిపిస్తోందని పశుసంవర్ధకశాఖలోని కొందరు అధికారులు పెదవి విరుస్తున్నారు. ఇది నిజంగా నిజమైన రైతులకు ఒక వరం అయితే టీడీపీలోని ద్వితీయ శ్రేణి నాయకులకు వనభోజనం లాంటిందని అంటున్నారు.
రైతుల గుర్తింపులో నిబంధనలు పాటించాం
ఊరూరా గడ్డిక్షేత్రాల్లో ఎక్కడ కూడా పొరపాట్లు చోటు చేసుకోలేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రామాల్లో పశుసంవర్ధకశాఖ డాక్టర్లు, సిబ్బంది, ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లు పక్కాగా రైతులను, భూములను గుర్తించి సాగు చేయించారు. ఇందులో ఎలాంటి అనుమానాలు లేవు. ఏవైనా తప్పులు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే నిజమైన రైతులకు న్యాయం చేస్తాం.
–సత్యప్రకాష్, డిప్యూటీ డైరెక్టర్, జిల్లా పశుసంవర్ధకశాఖ