పచ్చిక బయళ్లు లేక మూగజీవాలు పశుగ్రాసానికి తీవ్ర ఇబ్బందులు పడుతుంటాయి. ప్రత్యేకించి చలికాలంలో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో గడ్డి పెరుగుదల మందకొడిగా ఉండటంతో పాటు పోషకాల లోపంతో పశు సంతతుల ఎదుగుదల కూడా తక్కువగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర లైవ్‌స్టాక్ ఫారమ్ అధికారులు స్వల్పకాలంలో, తక్కువ స్థలంలో అధిక పోషకాలుండే గడ్డి జాతుల పెంపకాన్ని రైతులకు సూచిస్తున్నారు. అందులో ఒకటి జూరీ గడ్డి. నాటుకున్న తర్వాత కనీసం పదేళ్ల పాటు తిరిగి చూడాల్సిన పని ఉండదు. నీటి వసతి ఉండే భూములు ఈ గడ్డి పెంపకానికి అనుకూలం. గినీ జాతి రకానికి చెందిన పానికమ్ గడ్డి రకాలలో జూరీ ఒకటి. అధిక పోషకాలు ఉండి ఎక్కువ పాల ఉత్పత్తికి, దూడల పెరుగుదలకు తోడ్పడుతుంది. ఈ గడ్డిని నీడలో సైతం పెంచవచ్చు. ఉద్యాన తోటల్లో అంతర పంటగా కూడా వేయవచ్చు. గడ్డి కత్తిరించే యంత్రాలు లేని రైతులు ఈ జూరీ గడ్డిని సాగుచేసుకొని యథాతథంగా మేపుకోవచ్చు.
ఆకులు ఎక్కువ, కాండం తక్కువగా ఉంటుంది. ఈ పశుగ్రాసంలో మాంసకృత్తులు ఎక్కువ. ఫలితంగా పాల దిగుబడి పెరుగుతుంది. ఆవులు, గేదెలతో పాటు గొర్రె, మేక పిల్లలు కూడా జూరీ గడ్డిని ఇష్టంగా తింటాయి.చౌడు నేలలు తప్ప మిగతా భూములన్నింటిలో ఈ గడ్డిని పెంచవచ్చు. రెండు రకాలుగా– నారు, పిలకల పద్ధతిన– సాగు చేయవచ్చు. ఈ గడ్డి విత్తనాలు చాలా తేలికగా గాలికి ఎగిరిపోయేలా ఉంటాయి. అందువల్ల 2:1 నిష్పత్తిలో ఇసుకను కలిపి నారుమడి పోసుకోవాలి. విత్తనాలపై పలుచగా మట్టిలో కప్పి దానిపైన వరి గడ్డిని పొరగా వేసి నీరు చల్లాలి. విత్త చల్లిన ఐదారు రోజుల్లో మొలకలు వస్తాయి. ఇలా వచ్చిన మొక్కల్ని 30, 40 రోజుల్లో పొలంలో నాటుకోవచ్చు. నాటు వేయడానికి ముందు పొలంలో ఎరువులు వేసి పొలాన్ని సిద్ధం చేసుకోవాలి. మొక్కల్ని 2.5 అడుగుల దూరంలో నాటుకోవాలి.
ఇలా నాటిన మొక్కలు 65, 70 రోజుల్లో మొదటి కోతకు వస్తాయి. రెండో పద్ధతిలో దుబ్బులు కట్టిన జూరీ గడ్డి మొదళ్ల దగ్గర వచ్చే పిలకల్ని వేరు చేసి పొలంలో నాటుకోవచ్చని గన్నవరంలోని ఎన్టీఆర్ వెటర్నరీ సైన్సెస్ (లైవ్‌స్టాక్ ఫారమ్ కాంప్లెక్స్) అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్‌కే సౌజన్య లక్ష్మి వివరించారు. అధిక పశుగ్రాస దిగుబడికి ప్రతి కోత అనంతరం తగు మోతాదులో ఎరువు వేసి నీటి తడి పెట్టాలని ఆమె సూచించారు. జూరీ గడ్డి విత్తనాల ఉత్పత్తి జరుగుతోంది. వచ్చే వేసవిలో రైతులకు అందించే అవకాశం ఉంది.
– ఆకుల అమరయ్య, విజయవాడ
Comments
Please login to add a commentAdd a comment