బొప్పాయి సాగు రైతులకు సిరులు కురిపిస్తోంది. రెండేళ్ల కాలపరిమితి పంటైనా సాగు చేసిన ఏడాదికే అన్నదాతలు లాభాలను ఆర్జిస్తున్నారు. ప్రభుత్వం సైతం ప్రోత్సాహాన్ని అందిస్తూ సబ్సిడీపై మల్చింగ్ షీట్లు, తదితరాలను సమకూరుస్తుండటంతో సాగు చేసే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది.
ఆత్మకూరు: బొప్పాయి సాగు రైతుల పాలిట కల్పతరువుగా మారింది. అన్నదాతలు లాభాలు చవి చూస్తుండగా.. తింటున్న వారి ఆరోగ్యం బాగుపడుతుండటంతో బొప్పాయి అందరికీ అనుకూలంగా మారింది. జిల్లాలోని 11 మండలాల్లో 1500 హెక్టార్లలో బొప్పాయి సాగవుతోందని అధికారిక లెక్కలు తెలియజేస్తున్నాయి.
ఏడు నెలలకే తొలి కాపు
వాస్తవానికి రెండేళ్ల కాలపరిమితి గల బొప్పాయిని ఆధునిక పద్ధతుల్లో సాగుచేస్తూ ఏడాదికే లాభాలు గడిస్తున్నారు. రెండో పంటనూ వెంటనే చేపడుతున్నారు. ఈ కారణంగా కొంత ఖర్చయినా లాభాలు వస్తుండటంతో రెండేళ్ల కాలపరిమితిని రైతులు పాటించడంలేదు. ఏడు నెలలకే తొలి కాపు వచ్చే బొప్పాయి తోటల్లో అంతర్‌పంటగా బంతిని సాగుచేస్తూ అదనపు ఆదాయాన్ని గడిస్తున్నారు. కచ్చితమైన లాభాలు వస్తుండటంతో అధిక శాతం మంది బొప్పాయి సాగు వైపు మొగ్గు చూపుతున్నారు.
ప్రభుత్వ ప్రోత్సాహం
ఉద్యాన పంటలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుండటంతో బొప్పాయి సాగుకు పలువురు రైతులు ఆసక్తి చూపుతున్నారు. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో డ్రిప్ ఇరిగేషన్‌ను ప్రోత్సహిస్తూ.. మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా హెక్టార్‌కు 90 శాతం సబ్సిడీతో అందిస్తోంది. కలుపు నివారణకు మల్చింగ్ చేసేందుకు తొలి ఏడాది రూ.18,490, రెండో సంవత్సరం రూ.ఆరు వేలను రైతులకు అందిస్తున్నారు. మల్చింగ్ షీట్ల ఏర్పాటుతో వర్షాకాలంలో వేరుకుళ్లు తెగులు సోకదని, వీటితో సాగు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
సోలాపూర్ రకానికి ప్రాధాన్యం
బొప్పాయిలో తైవాన్ రెడ్ లేడీ 786 రకానికి మరో పేరు సోలాపూర్ వైరెటీ. ఈ రకం సాగుకు రైతులు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. సోలాపూర్ వెళ్లి మొక్కలు తెస్తుండటంతో తైవాన్ రెడ్ లేడీ పేరు స్థానంలో ఈ పేరొచ్చిందని రైతులు తెలిపారు. ప్రస్తుతం అనంతపురం, రైల్వేకోడూరు నుంచి రైతులు ఈ రకం మొక్కలను తీసుకొస్తున్నారు. ఎకరాకు 1200 వరకు వేయాల్సి ఉన్నా, రైతులు 1050 మొక్కల చొప్పున సాగు చేస్తున్నారు.
అధిక ధర
సాధారణంగా కాయలను విడిగా రూ.8.50 చొప్పున రైతులు విక్రయిస్తుంటారు. అయితే గతేడాది ఒక్కో కాయను రూ.16 చొప్పున రైతుల వద్దే కొనుగోలు చేయడంతో ఎకరాకు రూ.నాలుగు లక్షలకుపైగా ఆదాయం సమకూరింది. ఈ ఏడాది రూ.పది చొప్పున విక్రయిస్తున్నామని వారు చెప్పారు. ప్రథమ స్థానంలో ఆత్మకూరు సెక్టార్ ఆత్మకూరు సెక్టార్‌లో 400 ఎకరాలకుపైగా బొప్పాయి సాగవుతూ ప్రథమ స్థానంలో ఉందని ఉద్యానాధికారులు తెలిపారు. చేజర్ల, ఏఎస్‌పేట, మర్రిపాడు, పొదలకూరు, మనుబోలు, కలువాయి, తదితర మండలాల్లోనూ అధికంగా సాగు చేస్తున్నారు.
వైద్యుల సూచన మేరకు బొప్పాయి వినియోగం పెరగడంతో కొనుగోళ్లూ భారీగానే జరుగుతున్నాయి. ఎకరాకు 40 టన్నుల దిగుబడి మూడేళ్లుగా బొప్పాయి సాగు చేస్తున్నా. లాభాలు బాగానే ఉన్నాయి. మా తోటను చూసి సమీపంలోని పలువురు రైతులు సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మొక్కలను అనంతపురం నుంచి తెచ్చుకుంటున్నాం. కలుపు రాకుండా మల్చింగ్ షీట్లను సబ్సిడీలో పొందాం. – సుబ్బారెడ్డి, బొప్పాయి రైతు, బొమ్మవరం, అనంతసాగరం ఎకరాలో బొప్పాయి సాగుకు రూ.70 వేలు ఖర్చవుతోంది.
కలుపు రాకుండా మల్చింగ్ షీట్ల ఏర్పాటు, డ్రిప్ ఇరిగేషన్, తదితర ఆధునిక పద్ధతులతో సాగు చేస్తే రూ.లక్ష వరకు అవుతోంది. మొక్కలు నాటిన అనంతరం ఏడు నెలల పది రోజులకే తొలి కాపు చేతికందుతుంది. తొలి కాపులో ఒక టన్ను నుంచి ఒకటిన్నర టన్నుల దిగుబడి.. 20 రోజుల అనంతరం రెండో కాపులో రెండు నుంచి మూడు టన్నులు.. మూడో కాపులో నాలుగు నుంచి ఐదు టన్నుల దిగుబడి వస్తోంది. ఏడాది పొడవునా కాపు ఉంటుందని రైతులు తెలిపారు. దీంతో ఎకరాకు రూ.మూడు లక్షలకుపైగా ఆదాయాన్ని గడిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment