papaya fruits
-
రోజూ ఒక కప్పు బొప్పాయి ముక్కలను తప్పక తినాల్సిందే..!
మనకు అందుబాటులో ఉండే అనేక రకాల పండ్లలో బొప్పాయి పండ్లు ఒకటి. వీటిని మనం ఎప్పుడైనా సరే తినవచ్చు. ఇవి మనకు ఏడాది పొడవునా అందుబాటులో ఉంటాయి. అయితే బొప్పాయి పండ్లను తినేందుకు చాలా మంది ఇష్టపడరు. కానీ వీటితో మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు. బొప్పాయి పండ్లను రోజూ ఒక కప్పు మోతాదులో ఉదయం లేదా మధ్యాహ్నం తినాలి. భోజనం చేసిన అనంతరం ఒక గంట వ్యవధి ఇచ్చి ఈ పండ్ల ముక్కలను తినాలి. దీంతో అనేక లాభాలను పొందొచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. బొప్పాయి పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. దీంతో అజీర్తి నుంచి బయట పడవచ్చు. అలాగే గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు కూడా ఉండవు. బొప్పాయి పండ్లలో ఐరన్ ఉంటుంది. ఇది రక్తాన్ని తయారు చేస్తుంది. దీంతో రక్తహీనత సమస్య తగ్గుతుంది. బొప్పాయి పండ్లలో ఉండే పోషకాలు మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీని వల్ల దగ్గు, జలుబుతోపాటు మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల నుంచి కూడా బయట పడవచ్చు. ఈ వ్యాధులు వచ్చిన వారు రోజూ ఉదయం, సాయంత్రం ఒక్కో కప్పు చొప్పున బొప్పాయి పండ్ల ముక్కలను తినాలి. దీంతో త్వరగా కోలుకుంటారు. అలాగే ప్లేట్లెట్స్ కూడా బాగా పెరుగుతాయి. బొప్పాయి పండ్లను తినడం వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే అధిక బరువు తగ్గుతారు. ఈ పండ్లను తినడం వల్ల శరీరంలోని కొవ్వు మొత్తం కరిగిపోతుంది. ఈ పండ్లను తింటే అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. ఇక షుగర్ ఉన్నవారు ఈ పండ్లను తింటే షుగర్ స్థాయిలు తగ్గుతాయి. ఈ పండ్లలో ఉండే పొటాషియం బీపీని తగ్గిస్తుంది. దీంతో హైబీపీ కంట్రోల్లోకి వస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి. ఇలా రోజూ ఒక కప్పు లేదా రెండు కప్పుల బొప్పాయి పండ్ల ముక్కలను తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. కనుక ఈ పండ్లను రోజూ తినాలి. అసలు మరిచిపోవద్దు. (చదవండి: అక్కడ చేపలు జస్ట్ తినడానికి ట్రై చేసినా చాలు..క్యాన్సర్ ఖాయం!) -
భలేగా లాభాలు..బొప్పాయి సాగుకు ఆసక్తి చూపుతున్న రైతులు
బొప్పాయి సాగు రైతులకు సిరులు కురిపిస్తోంది. రెండేళ్ల కాలపరిమితి పంటైనా సాగు చేసిన ఏడాదికే అన్నదాతలు లాభాలను ఆర్జిస్తున్నారు. ప్రభుత్వం సైతం ప్రోత్సాహాన్ని అందిస్తూ సబ్సిడీపై మల్చింగ్ షీట్లు, తదితరాలను సమకూరుస్తుండటంతో సాగు చేసే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఆత్మకూరు: బొప్పాయి సాగు రైతుల పాలిట కల్పతరువుగా మారింది. అన్నదాతలు లాభాలు చవి చూస్తుండగా.. తింటున్న వారి ఆరోగ్యం బాగుపడుతుండటంతో బొప్పాయి అందరికీ అనుకూలంగా మారింది. జిల్లాలోని 11 మండలాల్లో 1500 హెక్టార్లలో బొప్పాయి సాగవుతోందని అధికారిక లెక్కలు తెలియజేస్తున్నాయి. ఏడు నెలలకే తొలి కాపు వాస్తవానికి రెండేళ్ల కాలపరిమితి గల బొప్పాయిని ఆధునిక పద్ధతుల్లో సాగుచేస్తూ ఏడాదికే లాభాలు గడిస్తున్నారు. రెండో పంటనూ వెంటనే చేపడుతున్నారు. ఈ కారణంగా కొంత ఖర్చయినా లాభాలు వస్తుండటంతో రెండేళ్ల కాలపరిమితిని రైతులు పాటించడంలేదు. ఏడు నెలలకే తొలి కాపు వచ్చే బొప్పాయి తోటల్లో అంతర్పంటగా బంతిని సాగుచేస్తూ అదనపు ఆదాయాన్ని గడిస్తున్నారు. కచ్చితమైన లాభాలు వస్తుండటంతో అధిక శాతం మంది బొప్పాయి సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం ఉద్యాన పంటలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుండటంతో బొప్పాయి సాగుకు పలువురు రైతులు ఆసక్తి చూపుతున్నారు. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో డ్రిప్ ఇరిగేషన్‌ను ప్రోత్సహిస్తూ.. మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా హెక్టార్‌కు 90 శాతం సబ్సిడీతో అందిస్తోంది. కలుపు నివారణకు మల్చింగ్ చేసేందుకు తొలి ఏడాది రూ.18,490, రెండో సంవత్సరం రూ.ఆరు వేలను రైతులకు అందిస్తున్నారు. మల్చింగ్ షీట్ల ఏర్పాటుతో వర్షాకాలంలో వేరుకుళ్లు తెగులు సోకదని, వీటితో సాగు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. సోలాపూర్ రకానికి ప్రాధాన్యం బొప్పాయిలో తైవాన్ రెడ్ లేడీ 786 రకానికి మరో పేరు సోలాపూర్ వైరెటీ. ఈ రకం సాగుకు రైతులు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. సోలాపూర్ వెళ్లి మొక్కలు తెస్తుండటంతో తైవాన్ రెడ్ లేడీ పేరు స్థానంలో ఈ పేరొచ్చిందని రైతులు తెలిపారు. ప్రస్తుతం అనంతపురం, రైల్వేకోడూరు నుంచి రైతులు ఈ రకం మొక్కలను తీసుకొస్తున్నారు. ఎకరాకు 1200 వరకు వేయాల్సి ఉన్నా, రైతులు 1050 మొక్కల చొప్పున సాగు చేస్తున్నారు. అధిక ధర సాధారణంగా కాయలను విడిగా రూ.8.50 చొప్పున రైతులు విక్రయిస్తుంటారు. అయితే గతేడాది ఒక్కో కాయను రూ.16 చొప్పున రైతుల వద్దే కొనుగోలు చేయడంతో ఎకరాకు రూ.నాలుగు లక్షలకుపైగా ఆదాయం సమకూరింది. ఈ ఏడాది రూ.పది చొప్పున విక్రయిస్తున్నామని వారు చెప్పారు. ప్రథమ స్థానంలో ఆత్మకూరు సెక్టార్ ఆత్మకూరు సెక్టార్లో 400 ఎకరాలకుపైగా బొప్పాయి సాగవుతూ ప్రథమ స్థానంలో ఉందని ఉద్యానాధికారులు తెలిపారు. చేజర్ల, ఏఎస్‌పేట, మర్రిపాడు, పొదలకూరు, మనుబోలు, కలువాయి, తదితర మండలాల్లోనూ అధికంగా సాగు చేస్తున్నారు. వైద్యుల సూచన మేరకు బొప్పాయి వినియోగం పెరగడంతో కొనుగోళ్లూ భారీగానే జరుగుతున్నాయి. ఎకరాకు 40 టన్నుల దిగుబడి మూడేళ్లుగా బొప్పాయి సాగు చేస్తున్నా. లాభాలు బాగానే ఉన్నాయి. మా తోటను చూసి సమీపంలోని పలువురు రైతులు సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మొక్కలను అనంతపురం నుంచి తెచ్చుకుంటున్నాం. కలుపు రాకుండా మల్చింగ్ షీట్లను సబ్సిడీలో పొందాం. – సుబ్బారెడ్డి, బొప్పాయి రైతు, బొమ్మవరం, అనంతసాగరం ఎకరాలో బొప్పాయి సాగుకు రూ.70 వేలు ఖర్చవుతోంది. కలుపు రాకుండా మల్చింగ్ షీట్ల ఏర్పాటు, డ్రిప్ ఇరిగేషన్, తదితర ఆధునిక పద్ధతులతో సాగు చేస్తే రూ.లక్ష వరకు అవుతోంది. మొక్కలు నాటిన అనంతరం ఏడు నెలల పది రోజులకే తొలి కాపు చేతికందుతుంది. తొలి కాపులో ఒక టన్ను నుంచి ఒకటిన్నర టన్నుల దిగుబడి.. 20 రోజుల అనంతరం రెండో కాపులో రెండు నుంచి మూడు టన్నులు.. మూడో కాపులో నాలుగు నుంచి ఐదు టన్నుల దిగుబడి వస్తోంది. ఏడాది పొడవునా కాపు ఉంటుందని రైతులు తెలిపారు. దీంతో ఎకరాకు రూ.మూడు లక్షలకుపైగా ఆదాయాన్ని గడిస్తున్నారు. -
Papaya Fruits Packing: బొప్పాయి ప్యాకింగ్.. వెరీ స్పెషల్!
గుర్రంకొండ: అన్నయమ్య జిల్లాలో పడమటి ప్రాంతాలైన పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల పరిధిలో సాగు చేసిన బొప్పాయిని ప్రత్యేక పద్ధతుల ద్వారా దేశరాజధాని ఢిల్లీకి ఎగుమతి చేస్తున్నారు. బొప్పాయి లోడింగ్ అన్నిటికంటే భిన్నంగా ఆసక్తికరంగానూ ఉంటుంది. ఇందుకోసం కాకినాడ, ఒంగోలు ప్రాంతాల నుంచి సిద్ధహస్తులైన కూలీలను వ్యాపారులు ఇక్కడికి తీసుకొస్తుంటారు. ముందుగా ఎండుగడ్డితో లారీని లోపలివైపు ప్యాకింగ్ చేయడం విశేషం. ప్రస్తుతం మార్కెట్లో కిలో బొప్పాయి ధర రూ.18 వరకు పలుకుతోంది. దీంతో ఢిల్లీ, ముంబై, రాజస్థాన్‌కు చెందిన బొప్పాయి వ్యాపారులు ఇక్కడే మకాం వేసి బొప్పాయి కాయలను వారి రాష్ట్రాలకు తరలిస్తున్నారు. వ్యాపారులు ఇక్కడే మకాం సాధారణంగా పలు రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు జులై నెలలో ఇక్కడికి చేరుకొంటారు. ముఖ్యంగా మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో మకాం వేస్తుంటారు. అప్పటి నుంచి డిసెంబర్ నెల వరకు ఇక్కడే ఉండి బొప్పాయి కొనుగోలు చేసి ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, రాజస్థాన్ వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. ఏజెంట్లను నియమించుకొని బొప్పాయి సాగు చేసిన రైతుల వివరాలు సేకరించి తోటలవద్దకు వెళ్లి వారే నేరుగా రైతుల వద్ద నుంచి కాయల్ని కొనుగోలు చేస్తారు. లోడింగ్ కూలీల ప్రత్యేకత కాకినాడ, ఒంగోలు లాంటి ప్రాంతాలకు చెందిన కూలీలు ఈ తరహా కటింగ్, లోడింగ్ కోసం వస్తుంటారు. బొప్పాయి తోటల్లో వెళ్లే కూలీలు ఎగుమతికి పనికొచ్చే కాయలను చెట్టునుంచి కింద పడకుండా కిందికి దించుతారు. ఆ తరువాత ప్రతి కాయను పేపర్‌తో చుడతారు. లారీలోకి బొప్పాయి కాయల్ని లోడ్ చేసే సమయంలో తగిన జాగ్రత్తలు పాటిస్తారు. లారీ లోపల, కింద భాగంలో నాలుగువైపులా ఎండుగడ్డిని ఏర్పాటు చేస్తారు. పేపర్ చుట్టిన కాయల్ని లారీల్లో లోడ్ చేసి మళ్లీపైన కూడా ఎండుగడ్డిని ఎక్కువగా వేసి లోడ్ చేయడం వీరి ప్రత్యేకత. వందలాది మంది కూలీలు బయట జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి జీవనోపాధి పొందుతుండడం గమనార్హం. ఢిల్లీ కటింగ్‌కు ప్రత్యేకం సాధారణంగా మన ప్రాంతంలో బొప్పాయి సగం రంగు వచ్చే వరకు కోత కోయరు. ఢిల్లీ కటింగ్‌కు మాత్రం ఎంతో తేడా ఉంటుంది. ఆకుపచ్చ రంగులో ఉన్న బొప్పాయి సన్నని సూది లావు అంత లేత పసుపు రంగు వర్ణం రాగానే వాటితో పాటు వాటిపైనున్న రెండు కాయల్ని కోత కోస్తారు. ఇందుకోసం అనుభవం కలిగిన కోత కూలీలను ఏర్పాటు చేసుకొంటారు. లోడింగ్ చేసేందుకు అనుభవం ఉన్న బయట ప్రాంతాల హమాలీలను తీసుకొస్తుంటారు. ఢిల్లీ కంటింగ్ కాయలు పచ్చిగా ఉండాలి, వారం రోజుల తరువాత వర్ణం వచ్చే కాయలనే తోటల్లో ఏరి మరీ కోస్తుంటారు. ఇక్కడి నుంచి ఢిల్లీకి లోడ్ లారీ చేరుకోవాలంటే కనీసం ఆరు రోజుల సమయం పడుతుంది. అప్పటి వరకు కాయలు చెడిపోకుండా బందోబస్తు చేయడం కూలీల ప్రత్యేకత. బొప్పాయికి భలే డిమాండ్ బయట రాష్ట్రాలతో పాటు, రాయలసీమ జిల్లాల్లో చిత్తూరు మినహా అన్ని జిల్లాల్లో గతంలో కురిసిన వర్షాలకు బొప్పాయి తోటలు దెబ్బతిన్నాయి. దీంతో ఇక్కడి బొప్పాయికి మంచి డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం ఇక్కడి మార్కెట్లో కిలో రూ.18 వరకు ధర పలుకుతోంది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, రాజస్థాన్ మార్కెట్లలో కిలో రూ.50 నుంచి రూ. 60 వరకు ధరలు పలుకుతుండడం గమనార్హం. (క్లిక్: మదనపల్లెకు కొత్త మాస్టర్ ప్లాన్) తోటల వద్దనే కొనుగోలు చేస్తున్నారు బొప్పాయి తోటల వద్దకే వ్యాపారులు వచ్చి కాయల్ని కొనుగోలు చేస్తున్నారు. బయట రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు ముందుగా తమను సంప్రదించి ధర నిర్ణయిస్తారు. ఢిల్లీకి తరలించే బొప్పాయిని జాగ్రత్తగా నైపుణ్యం కలిగిన కూలీల చేత కోయిస్తారు. వాటిని భద్రంగా ప్యాకింగ్ చేసి వాహనాల్లో లోడ్ చేసి తీసుకెళుతుంటారు. – సుధాకర్‌రెడ్డి, బొప్పాయి రైతు, చెరవుమొరవపల్లె మూడు ఎకరాల్లొ సాగు చేశా ఈసీజన్లో మూడు ఎకరాల్లో బొప్పాయి సాగు చేశాను. ప్రస్తుతం తోటల వద్దకే వచ్చి వ్యాపారులు కిలో రూ. 18 చొప్పున ధర ఇస్తున్నారు. కూలీఖర్చు, మార్కెట్‌కు తరలించడం వంటి అన్ని ఖర్చులు వ్యాపారులే భరిస్తారు. ప్రస్తుతానికి మంచి గిట్టుబాటు ధరలే ఉన్నాయి. – రామయ్య, బొప్పాయి రైతు, కొత్తపల్లె -
Beauty Tips: బొప్పాయి గుజ్జు, గంధం పొడి.. ముఖంపై జిడ్డు మాయం
క్రమంగా పెరుగుతోన్న ఉష్ణోగ్రతల నుంచి చర్మాన్ని కాపాడుకోవాలంటే.. రోజుకి కనీసం మూడు లీటర్ల మంచినీటితోపాటు కొబ్బరి నీళ్లను తాగాలి. వీలైనంత ఎక్కువగా ద్రవపదార్థాలు తీసుకోవడంతోపాటు సులభంగా ఇంట్లో తయారు చేసిన ప్యాక్‌లు వేసుకోవడం ద్వారా వేసవిలో కూడా ముఖవర్ఛస్సుని కాపాడుకోవచ్చు. కప్పు పెరుగులో టేబుల్ స్పూను తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పదినిమిషాలపాటు ఆరనిచ్చి చల్లటి నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్ ముఖానికి సహజ సిద్ధమైన మాయిశ్చర్‌ను అందించి కాంతిమంతంగా కనిపించేలా చేస్తుంది. బాగా పండిన అరకప్పు బొప్పాయి గుజ్జులో రెండు టేబుల్ స్పూన్ల గంధం పొడి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసి ఇరవై నిమిషాలపాటు ఆరనివ్వాలి. తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్ వేసుకోడం వల్ల ముఖంపై పేరుకుపోయిన జిడ్డు, దుమ్మూధూళి వదిలి, చర్మం కాంతివంతంగా కనిపించడమే కాదు, మృదుత్వాన్ని సంతరించుకుంటుంది. చదవండి: Ragi Java Health Benefits: రాగిజావను పాలు, బెల్లం, యాలకుల పొడితో కలిపి కాచుకుని తాగే అలవాటు ఉందా.. అయితే -
బొప్పాయి పండ్ల కింద ఎర్రచందనం దుంగలు
ఒంగోలు: బొప్పాయి పండ్ల కింద అక్రమంగా భారీ ఎత్తున ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న లారీని ప్రకాశం జిల్లా పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం లారీని సీజ్ చేసి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లా కొమరవోలు మండలం తాటాచర్లమోటు రహదారిపై ఈ రోజు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా బొప్పాయి లోడ్‌తో వెళ్తున్న లారీని పోలీసులు ఆపారు. లారీలో లోడ్‌పై డ్రైవర్‌ను ప్రశ్నించగా... పొంతన లేని సమాధానాలు చెప్పాడు. దీంతో పోలీసులు అనుమానించి... లారీలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా బొప్పాయి పండ్లు కింద ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.