ఈగలతో  ప్రొటీన్ల సేద్యం! | Black Soldier Fly Farming Creating Protein Content | Sakshi
Sakshi News home page

ఈగలతో  ప్రొటీన్ల సేద్యం! వ్యర్థాలకు చెక్‌..ఆదాయానికి ఆదాయం!

Published Tue, Oct 31 2023 8:11 AM | Last Updated on Tue, Oct 31 2023 8:11 AM

Black Soldier Fly Farming Creating Protein Content - Sakshi

సేంద్రియ వ్యర్థాలను ఆహారంగా తిని పెరిగే బ్లాక్‌ సోల్జర్‌ ఫ్లై (బిఎస్‌ఎఫ్‌) పిల్ల పురుగు(లార్వా)లు కోళ్లతో పాటు చేపలు, రొయ్యలకు మంచి ప్రొటీన్లతో కూడిన మేతగా ఉపయోగపడుతున్నాయి. విదేశాల్లో విస్తారంగా జరుగుతున్న బిఎస్‌ఎఫ్‌ లార్వా సాగు ఇప్పుడిప్పుడే మన దేశంలోనూ వ్యాపిస్తోంది. కుళ్లిన పండ్లు, కూరగాయలు, వంటింట్లో మిగిలిపోయిన ఆహార పదార్థాలతో పాటు పశువుల పేడ, కోళ్లు, మేకలు, పందుల విసర్జితాలను తిని ఈ పిల్ల పురుగులు దాదాపు నెల రోజుల్లోనే పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. బిఎస్‌ఎఫ్‌పై పరిశోధనలు మన దేశంలో శైశవ దశలో ఉన్నాయి. ఐసిఎఆర్‌ గ్రాంటుతో ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం(పిజెటిఎస్‌ఎయు) ఏడాది క్రితమే వేస్ట్‌2వెల్త్‌ ప్రాజెక్టులో భాగంగా దీనిపై పరిశోధనలు చేపట్టింది. అంతేకాదు, శాస్త్రవేత్తలు, ఎంటర్‌ప్రెన్యూర్లు, రైతుల శిక్షణకు ఇటీవలే శ్రీకారం చుట్టింది. ఇన్నోవేటివ్‌ ఇన్‌సెక్ట్‌ ఫార్మింగ్‌ వివరాలతో ఆసక్తికర కథనం... 

ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తయిన శాకాహార, మాంసాహారోత్పత్తుల్లో 60% మాత్రమే వినియోగమవుతోంది. పొలంలో 8%, మార్కెట్‌కు వెళ్లే దారిలో 14%, రిటైల్‌ అమ్మకందారుల వద్ద 7%, ఇళ్లలో వినియోగానికి ముందు 11% మేరకు ఆహారం వృథా అవుతోంది. 2021 యుఎన్‌ఇపి ఫుడ్‌ వేస్ట్‌ ఇండెక్స్‌ ప్రకారం మన దేశంలో ఏటా 6.88 కోట్ల టన్నుల ఆహార వ్యర్థాలు వెలువడుతున్నాయి. ఈ సేంద్రియ వ్యర్థాలను చెత్తకుప్పల్లో వేసే కంటే పునర్వినియోగించి ప్రయోజనం పొందటం తెలివైన పని. ఈ పనిని ఇతర పురుగుల కన్నా బ్లాక్‌ సోల్జర్‌ ఈగలు (బిఎస్‌ఎఫ్‌) సమర్థవంతంగా చేయగలవన్నది నిపుణుల మాట. 

పురుగుల సేద్యం చాలా వినూత్నమైనది, పర్యావరణ హితమైనది, ఆదాయాన్ని అందించేది కూడా. మన దేశంలో కొందరు వ్యాపారవేత్తలు, కోళ్ల రైతులు బ్లాక్‌ సోల్జర్‌ ఫ్లై (బిఎస్‌ఎఫ్‌) పిల్ల పురుగుల(లార్వా) ను సాగు చేయటం ఇటీవల ప్రారంభించారు. బిఎస్‌ఎఫ్‌ పిల్ల పురుగుల ఉత్పతి కాలం వాటికి వేసే ఆహారాన్ని బట్టి మారుతుంది. ఒక బ్యాచ్‌ 20 రోజుల నుంచి 40 రోజుల వరకు పడుతుంది. ఆహారం మెత్తగా, త్వరగా జీర్ణించుకునే విధంగా ఉండి ప్రొటీన్లతో కూడి ఉన్నప్పుడు తక్కువ రోజుల్లోనే పురుగులు పెరుగుతాయి.  

లేయర్‌ కోళ్ల ఫారాల్లో ఇనుప కేజ్‌ల కింద పోగుపడే కోళ్ల పెంటపై బిఎస్‌ఎఫ్‌ ఈగల 5 రోజుల పిల్లలను వదిలితే చాలు.. ఆ వ్యర్థాలనే ఆహారంగా తింటూ 25–30 రోజుల్లోనే పిల్ల పురుగులు వృద్ధి చెందుతాయి. బిఎస్‌ఎఫ్‌ పెంపకం ద్వారా సేంద్రియ వ్యర్థాల పరిమాణాన్ని 15–25 రోజుల్లో 70–80% మేరకు కుదించవచ్చు. అందువల్లనే నగరాలు, పట్టణాల్లో పోగుపడే సేంద్రియ వ్యర్థాల సమర్థవంతమైన నిర్వహణకు ఇవి ఉపయోగపడుతున్నాయని ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఎఓ) చెబుతోంది. బిఎస్‌ఎఫ్‌ లార్వా(పిల్ల పురుగులు) బరువులో 40–45% వరకు ప్రొటీన్లు ఉన్నాయి.

అందువల్ల కోళ్ల మేతలో, ఆక్వా మేతల తయారీలో సోయా చిక్కుళ్లు, ఫిష్‌ మీల్‌తో పాటుగా 10 శాతం వరకు బిఎస్‌ఎఫ్‌ పురుగుల పొడిని కలుపుతున్నారు. బతికి ఉన్న పిల్ల పురుగుల (వెట్‌ లార్వా)ను కోళ్లకు నేరుగా మేతగా వేస్తున్నారు. రోజువారీ మేతలో పది శాతం వరకు ఈ పిల్ల పురుగులను అందిస్తూ సత్ఫలితాలు పొందుతున్న కోళ్ల ఫారాలు తెలుగునాట ఇప్పటికే అనేకం ఉన్నాయి. 

పిజెటిఎస్‌ఎయులో పైలెట్‌ ప్రాజెక్టు
అయితే, మన దేశంలో దీనిపై పరిశోధనలు ఇంకా శైశవ దశలోనే ఉన్నాయి. ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (పిజెటిఎస్‌ఎయు) ఈ దిశగా ముందడుగు వేసింది. దేశంలోనే మొట్టమొదటిగా బిఎస్‌ఎఫ్‌ పెంపకంపై పరిశోధన చేపట్టింది. నేషనల్‌ అగ్రికల్చర్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ‘వేస్ట్‌2వెల్త్‌’ ప్రాజెక్టును మంజూరు పిజెటిఎస్‌ఎయుకు గత ఏడాది చేసింది. పిజెటిఎస్‌ఎయు పీజీ స్టడీస్‌ డీన్, కీటక శాస్త్ర ఆచార్యులు డా. వి. అనిత ఈ ప్రాజెక్టుకు నోడల్‌ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. ఈ ప్రాజెక్టులో భాగంగా రాజేంద్రనగర్‌లోని వర్సిటీ ఆవరణలో బ్లాక్‌ సోల్జర్‌ ఫ్లైల పెంపకం కమ్‌ శిక్షణా కేంద్రాన్ని నెలకొల్పారు. కూరగాయలు, పండ్ల వ్యర్థాలు, మెస్‌లో మిగిలిన అన్నం, గోధుమ తవుడు మిశ్రమంతో బిఎస్‌ఎఫ్‌ పిల్ల పురుగులు పెంచుతున్నారు. పరిశోధక విద్యార్థులు పరిశోధనలు కొనసాగిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో, కృషి విజ్ఞాన కేంద్రాల్లోని శాస్త్రవేత్తల మొదటి బ్యాచ్‌కు డా. అనిత ఇటీవలే శిక్షణ ఇచ్చారు. ఎంటర్‌ప్రెన్యూర్లు, రైతులకు కూడా శిక్షణ ఇవ్వనున్నట్లు డా. అనిత ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. నగరాలు, పట్టణాల్లో వెలువడే సేంద్రియ ఆహార వ్యర్థాల కాలుష్యాన్ని తగ్గించడానికి, పనిలో పనిగా మంచి ప్రొటీన్‌ను అందుబాటులోకి తెచ్చుకోవడానికి బిఎస్‌ఎఫ్‌ లార్వాల పెంపకం ఉపయోగకరం. అన్నిటికీ మించి, సేంద్రియ వ్యర్థాల పరిమాణాన్ని 15–25 రోజుల్లోనే 70–80% మేరకు తగ్గించేంత ఆబగా తినగల శక్తి బిఎస్‌ఎఫ్‌ జాతికి వుంది. బిఎస్‌ఎఫ్‌ పిల్ల పురుగుల పెంపకానికి మన దేశపు వాతావరణం చాలా అనువైనదంటున్నారు డా.అనిత.

ఎంటర్‌ప్రెన్యూర్లకు, రైతులకు శిక్షణ ఇస్తున్నాం!
బ్లాక్‌ సోల్జర్‌ ఈగలు మనకు కొత్తవి కావు. భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా 20వ శతాబ్దం నుంచి ఉన్నదే ఈ జాతి. కొత్త తెగుళ్లు వ్యాప్తి చెందుతాయన్న భయం లేదు. ఆహార వ్యర్థాలు, పశువుల విసర్జితాలను సాధ్యమైనంత మెత్తగా చేసి, సులభంగా జీర్ణించుకునేలా మార్చి ఈ పురుగులకు వేయాలి. అందులో ప్రొటీన్లు ఉండాలి. చిన్న పిల్లల ఆహారం లాగా ఉండాలి. కూరగాయలు, పండ్ల వ్యర్థాలను సేకరించి, మెత్తగా రుబ్బి.. దానితో పాటు మెస్‌లో మిగిలిపోయిన అన్నం, గోధుమ తవుడు కొంచెం కలిపి మా ప్రయోగశాలలో బిఎస్‌ఎఫ్‌ పిల్ల పురుగులను పెంచుతున్నాం.

వాటికి వేసే ఆహారాన్ని బట్టి, దానిలో పోషక విలువలను బట్టి, వాతావరణంలో వేడి, గాలిలో తేమను బట్టి.. అవి ఎన్ని రోజుల్లో, ఎంత బరువు పెరుగుతాయన్న విషయం ఆధారపడి ఉంటుంది. సేంద్రియ వ్యర్థాలను సమర్థవంతంగా నాణ్యమైన సేంద్రియ ఎరువుగా మార్చుకునే మార్గం ఇది. పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. మంచి ఆదాయమూ సమకూరుతుంది. రైతులకు, ఎంటర్‌ప్రెన్యూర్లకు శిక్షణ ఇస్తున్నాం.

సేంద్రియ వ్యర్థాలను తినే అనేక జీవులుండగా బ్లాక్‌ సోల్జర్‌ ఫ్లైలనే ఎందుకు ఎంపిక చేసినట్లు? ఇదే ప్రశ్న డా. అనితను అడిగితే ఇలా బదులిచ్చారు...

  • రోజుకు తన బరువుకు రెట్టింపు సేంద్రియ వ్యర్థాలను తిని, సేంద్రియ ఎరువును విసర్జించగల శక్తి బిఎస్‌ఎఫ్‌ పిల్ల పురుగులకు ఉంది. దీని అర్థం ఏమిటంటే.. చెత్త కుప్పలకు తరలివెళ్లే సేంద్రియ వ్యర్థాలు తగ్గిపోతాయి. మిథేన్‌ ఉద్గారాలు ఆ మేరకు తగ్గుతాయి. 
  • కుళ్లిన పండ్లు/కూరగాయలు,హోటళ్లు/ఇళ్లలో మిగిలిపోయిన ఆహార పదార్థాలతో పాటు పశువుల పేడ, కోళ్లు, మేకలు, పందుల విసర్జితాలు వంటి సేంద్రియ వ్యర్థాలను బిఎస్‌ఎఫ్‌ పిల్ల పురుగుల పెంపకానికి వాడొచ్చు.
  • బిఎస్‌ఎఫ్‌ జీవిత చక్రం మొత్తం 42–55 రోజులు. గుడ్లు పెట్టిన 4–5 రోజులకు పిగులుతాయి. అవి 15–25 రోజుల్లో పిల్ల పురుగులా(లార్వా)గా ఎదుగుతాయి. ఈ దశలోనే వాటిని సేకరించి కోళ్లు, ఆక్వా మేతల్లో వాడుతున్నారు. అలాగే ఉంచితే, ప్యూపాగా రూపాంతరం చెంది, 17 రోజుల తర్వాత బ్లాక్‌ సోల్జర్‌ ఈగలు పుడతాయి. మగ ఈగ 4 రోజుల్లో ఆడ ఈగను కలిసిన తర్వాత చనిపోతుంది. ఆడ ఈగ 5–8 రోజుల్లో గుడ్లు పెట్టి చనిపోతుంది. 
  • గుడ్లను సేకరించి, అతి చిన్న పురుగులను తయారు చేయట కొంచెం క్లిష్టమైన ప్రక్రియ. 5 రోజుల పిల్లలకు తగిన సేంద్రియ ఆహారం అందిస్తే 15–25 రోజుల్లో పిల్ల పురుగులు(లార్వా)గా పెరుగుతాయి. ఆ దశలో చక్కని ప్రొటీన్లతో కూడిన ఆ పిల్ల పురుగులు కోళ్లు, చేపలు, రొయ్యలకు మేతగా వాడుకోవచ్చు. 
  • 5 రోజుల పిల్లలను కొనుక్కొని రైతులు 15–25 రోజుల్లో బిఎస్‌ఎఫ్‌ పిల్ల పురుగులను లార్వా దశకు పెంచి, కోళ్లకు, చేపలు, రొయ్యలకు మేతగా వేసుకోవచ్చు లేదా కొనుగోలుదారులకు అమ్ముకోవచ్చు. స్వయం ఉపాధిగా యువకులు బిఎస్‌ఎఫ్‌ లార్వా సాగు చేపట్టవచ్చు. ఈ లార్వాను దాణా తయారీ కంపెనీలు, సంస్థలు కొనుగోలు చేస్తున్నాయి. లార్వా దశ దాటి ప్యూపా దశకు పెరిగితే దాణాల్లో వాడకానికి పనికిరాదు.
  • సోయా చిక్కుళ్ల సాగులో సమస్యలు, సముద్రాల్లో చేపల సంతతి తగ్గిపోతుండటం వల్ల కోళ్లు, ఆక్వా మేతలతో పాటు, పెంపకపు కుక్కల మేతల్లో కూడా బిఎస్‌ఎఫ్‌ పిల్ల పురుగులను ప్రొటీన్‌ సప్లిమెంట్‌గా ప్రపంచవ్యాప్తంగా వాడుతున్నారు. దీంతో బిఎస్‌ఎఫ్‌ లార్వా సాగుకు డిమాండ్‌ పెరుగుతోంది. 
  • ఈ పిల్ల పురుగులే అధిక నాణ్యత గల ప్రొటీన్లతో కూడిన దాణాకు ముడి పదార్థం. కోళ్లు, చేపలు, రొయ్యలు, పందులు, పెంపుడు కుక్కలకు వేసే మేతలో బిఎస్‌ఎఫ్‌ పిల్ల పురుగుల పొడిని కలపవచ్చు. పిల్ల పురుగుల బరువులో 40–45% ప్రొటీన్‌తో పాటు ఎసెన్షియల్‌ అమినో యాసిడ్లు ఉంటాయి. సాధారణంగా మేతల్లో ప్రొటీన్లుగా వాడే సోయా చిక్కుడు గింజలు, ఫిష్‌మీల్‌ను కొంత తగ్గించి దీన్ని వాడుతున్నారు.
  • కోళ్లకు రోజువారీ మేతలో పది శాతం మేరకు దీన్ని వాడుతున్నారు. పిల్ల పురుగులను బతికి ఉన్నప్పుడే ఫారం కోళ్లకు మేపవచ్చు. నాటు కోళ్లకూ ఇది మంచి ఆహారం.
  • బిఎస్‌ఎఫ్‌ పిల్ల పురుగుల పెంపకం క్రమంలో వెలువడే విసర్జితాలే(ఫ్రాస్‌) పంటలకు అత్యంత విలువైన సేంద్రియ ఎరువుగా పనికి వస్తుంది. వర్మీకంపోస్టు, పశువుల ఎరువుల్లో కంటే అధిక పోషక విలువలు ఇందులో ఉంటాయని చెబుతున్నారు. 
  • విదేశాల్లో బిఎస్‌ఎఫ్‌ పిల్ల పురుగుల పొడిని బర్గర్లు, షేక్‌లలో కలుపుతున్నారు. దీని నుంచి వెలికితీసే నూనెను బయో ఇంధనంగా వాహనాలు, జనరేటర్లలో వాడుతున్నారు. బిఎస్‌ఎఫ్‌ లార్వా నుంచి వెలువడే పొలుసులు(కూటిన్‌) బయోడీగ్రేడబుల్‌ ప్యాకేజింగ్‌ ప్లాస్టిక్‌ తయారీకి వాడుతున్నారు. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్‌ గుణాలున్నందున వైద్య అవసరాలకు కూడా వినియోగిస్తున్నారు. 
  • వర్షాకాలంలో దీపం చుట్టూ చేరే ఉసుళ్లను వేపుకొని శనగపప్పుతో కలుపుకొని తినే అలవాటు మన దేశంలోనూ ఉంది. బిఎస్‌ఎఫ్‌తో పాటు మిడతలు, మీల్‌ వార్మ్స్, గొల్లభామలు,  వంటి 1,900 జాతుల పురుగులను 113 దేశాల్లో 200 కోట్ల మంది తింటున్నారని ఎఫ్‌ఎఓ చెబుతోంది.      

--పతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్‌

(చదవండి: అంతరించిపోయే స్టేజ్‌లో అరటిపళ్లు!..శాస్త్రవేత్తలు స్ట్రాంగ్‌ వార్నింగ్‌)

     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement